
‘ఆరోగ్యం’పై అశ్రద్ధ..!
వ్యక్తిగత ఆరోగ్య బీమాపై యువ నిపుణుల అనాసక్తి...
కాలం మారింది. మామూలుగా 9 గంటలకు నిద్రపోవాల్సిన మనం 2 గంటలకు నిద్రపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎప్పుడు తింటామో తెలియదు. దీంతో ఆరోగ్యం చెడిపోతోంది. ముఖ్యంగా ఉద్యోగుల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. జీవన విధానంలో వస్తున్న మార్పులు, మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు ఒకవైపు ఎక్కువైపోతుంటే, వ్యక్తిగత ఆరోగ్య బీమా తీసుకున్న యువ నిపుణులు చాలా తక్కువ మంది ఉన్నారు.
బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ సహా ఇతర ముఖ్యమైన నగరాల్లోని 23-35 ఏళ్ల వయసున్న దాదాపు 1,100 మంది యువ నిపుణులపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
వ్యక్తిగత ఆరోగ్య బీమా.. 10% మందికే సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మందికి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటే, మిగిలిన వారికి లేదు. ఇన్సూరెన్స్ కవర్ ఉన్న వారిలో 60 శాతం మంది కంపెనీ క్లెయిమ్‌ను మాత్రమే కలిగి ఉన్నారు. మిగిలిన 30 మంది కంపెనీ మెడిక్లెయిమ్‌తోపాటు పర్సనల్ హెల్త్ పాలసీని కలిగి ఉన్నారు.
కేవలం 10 శాతం మంది మాత్రమే పర్సనల్ కవర్‌ను తీసుకున్నారు. పాలసీ లేనివారిలో 46 శాతం మంది అది చాలా ఖరీదైనదని, అందులో ఇన్వెస్ట్ చేయడానికి తాము ఇంకా చాలా యువకులమని 22 శాతం మంది తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ క్లిష్టమైనవని 15 శాతం మంది, దాని గురించి తెలియదని 17 శాతం మంది పేర్కొన్నారు.
శారీరక నొప్పులతో బాధపడేవారే ఎక్కువ
పలు రకాల వ్యాధులతో బాధపడుతున్నామని సర్వేలో పాల్గొన్న 45 శాతం మంది పేర్కొన్నారు. వీరిలో 40 శాతం మంది దీర్ఘకాలిక శారీరక నొప్పులతో సతమతమౌతున్నట్లు తెలిపారు. 20 శాతం మంది బరువు సంబంధిత సమస్యలతో, 18 శాతం మంది రక్తపోటు, 10 శాతం మంది శ్వాసకోశ రుగ్మతలతో, 8 శాతం మంది జీర్ణ సంబంధిత వ్యాధులతో, 4% మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ జబ్బులు వారు చేసే పని వల్ల వచ్చాయని 40% మంది, వంశపారంపర్యంగా వచ్చాయని 17 శాతం మంది, వ్యాయామం చేయకపోవడం వల్ల వచ్చాయని 10 శాతం మంది, ఒత్తిడి వల్ల వచ్చాయని 5 శాతం మంది, ఆహార విధానాల మా ర్పు వల్ల వచ్చాయని 28 శాతం మంది పేర్కొన్నారు.
యువ నిపుణులు వారి కంపెనీలు ఇచ్చే మెడికల్ పాలసీలనే తీసుకుంటున్నారు తప్ప ప్రత్యేకంగా ఆరోగ్య బీమా తీసుకోవడానికి ఉత్సాహం చూపడం లేదు. కంపెనీ ఇచ్చే మెడికల్ క్లెయిమ్ వైద్య ఖర్చులకు సరిపోతుందని సర్వేలో పాల్గొన్న దాదాపు 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. పన్ను మినహాయింపుల నిమిత్తం హెల్త్ పాలసీని కలిగి ఉన్నామని 74 శాతం మంది తెలిపారు.