Young Professionals
-
100 మంది యువకులను మోసగించి...
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హనీ ట్రాప్ గ్యాంగ్ ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. ఉద్యోగాలు చేస్తూ సోషల్ మీడియాను వినియోగించే యువకులే లక్ష్యంగా ఈ గ్యాంగ్ లు నడుస్తున్నాయి. నగరంలో తాజాగా జరిగిన ఓ సంఘటనలో ఇద్దరు వ్యక్తులతో పాటు ఢిల్లీ హోం గార్డు శాఖకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటివరకు దాదాపు 100 మందికి పైగా యువకులను మోసగించి డబ్బులు దోచుకున్నట్లు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో పనిచేసే పైలట్ ను ఓ ముఠా బెదిరించి రూ.9.70 లక్షలు దోచుకుందని ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో పరిచయమైన సియా అనే అమ్మాయితో గత ఏడాది ఫ్రెండ్ అయ్యాడని, కొద్ది రోజుల చాటింగ్ తర్వాత ఇద్దరం కలిసి సినిమాకు వెళ్లామని ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా పూర్తయిన తర్వాత ఆమె తన ఫ్లాట్ కు వెళ్దామని చెప్పిందని, దారిలో సలోని అనే మరో అమ్మాయిని తన స్నేహితురాలిగా అతని కి పరిచయం చేసిందని తెలిపారు. వాళ్లిద్దరితో కలిసి ఫ్లాట్ కు వెళ్లగా.. ఉన్నట్టుండి సియా తనను సలోనితో వదిలేసి బయటకు వెళ్లిపోయిందని పేర్కొన్నారు. ఆ తర్వాత ముగ్గురు వ్యక్తులు పోలీసు అధికారుల్లా నటించి అతన్ని ఓ గదిలో బంధించి యువతిని రేప్ చేశావని నిందించారని చెప్పారు. యువతిని పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారని వివరించారు. బాధితుడిపై రేప్ కేసు పెడతామని బెదిరించారని చెప్పారు. కేసు నుంచి తప్పించాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.10 లక్షలకు కేసును మూసేయడానికి ఒప్పుకున్నారని తెలిపారు. ఘటన జరిగిన కొన్ని నెలల వరకు మామూలుగానే ఉన్న ఈ ఏడాది మార్చిలో కోర్టులో కేసు ఇంకా పెండింగ్ ఉందని, యువతి కోర్టులో వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిందని కేసు సెటిల్ చేయడానికి మరో రెండు లక్షలు ఇవ్వాలని బాధితుడిని డిమాండ్ చేశారని చెప్పారు. కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. బాధితుడిని బెదిరించిన ఫ్లాట్ అద్దెకు తీసుకుందని పోలీసులు తొలుత నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత నిందితుల్లో ఒకరు ఢిల్లీ హోం గార్డులో పనిచేసే అధికారి జగ్తిందర్ సింగ్ గా గుర్తించి అరెస్టు చేశారు. సింగ్ ఇచ్చిన వివరాల ప్రకారం మిగిలిన ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేశారు. ఆర్ధికంగా బలంగా ఉన్నవ్యక్తులను తాము సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేసి డబ్బులు గుంజినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. -
‘ఆరోగ్యం’పై అశ్రద్ధ..!
వ్యక్తిగత ఆరోగ్య బీమాపై యువ నిపుణుల అనాసక్తి... కాలం మారింది. మామూలుగా 9 గంటలకు నిద్రపోవాల్సిన మనం 2 గంటలకు నిద్రపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎప్పుడు తింటామో తెలియదు. దీంతో ఆరోగ్యం చెడిపోతోంది. ముఖ్యంగా ఉద్యోగుల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. జీవన విధానంలో వస్తున్న మార్పులు, మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు ఒకవైపు ఎక్కువైపోతుంటే, వ్యక్తిగత ఆరోగ్య బీమా తీసుకున్న యువ నిపుణులు చాలా తక్కువ మంది ఉన్నారు. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ సహా ఇతర ముఖ్యమైన నగరాల్లోని 23-35 ఏళ్ల వయసున్న దాదాపు 1,100 మంది యువ నిపుణులపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో ఒకసారి చూద్దాం. వ్యక్తిగత ఆరోగ్య బీమా.. 10% మందికే సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మందికి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటే, మిగిలిన వారికి లేదు. ఇన్సూరెన్స్ కవర్ ఉన్న వారిలో 60 శాతం మంది కంపెనీ క్లెయిమ్‌ను మాత్రమే కలిగి ఉన్నారు. మిగిలిన 30 మంది కంపెనీ మెడిక్లెయిమ్తోపాటు పర్సనల్ హెల్త్ పాలసీని కలిగి ఉన్నారు. కేవలం 10 శాతం మంది మాత్రమే పర్సనల్ కవర్‌ను తీసుకున్నారు. పాలసీ లేనివారిలో 46 శాతం మంది అది చాలా ఖరీదైనదని, అందులో ఇన్వెస్ట్ చేయడానికి తాము ఇంకా చాలా యువకులమని 22 శాతం మంది తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ క్లిష్టమైనవని 15 శాతం మంది, దాని గురించి తెలియదని 17 శాతం మంది పేర్కొన్నారు. శారీరక నొప్పులతో బాధపడేవారే ఎక్కువ పలు రకాల వ్యాధులతో బాధపడుతున్నామని సర్వేలో పాల్గొన్న 45 శాతం మంది పేర్కొన్నారు. వీరిలో 40 శాతం మంది దీర్ఘకాలిక శారీరక నొప్పులతో సతమతమౌతున్నట్లు తెలిపారు. 20 శాతం మంది బరువు సంబంధిత సమస్యలతో, 18 శాతం మంది రక్తపోటు, 10 శాతం మంది శ్వాసకోశ రుగ్మతలతో, 8 శాతం మంది జీర్ణ సంబంధిత వ్యాధులతో, 4% మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ జబ్బులు వారు చేసే పని వల్ల వచ్చాయని 40% మంది, వంశపారంపర్యంగా వచ్చాయని 17 శాతం మంది, వ్యాయామం చేయకపోవడం వల్ల వచ్చాయని 10 శాతం మంది, ఒత్తిడి వల్ల వచ్చాయని 5 శాతం మంది, ఆహార విధానాల మా ర్పు వల్ల వచ్చాయని 28 శాతం మంది పేర్కొన్నారు. యువ నిపుణులు వారి కంపెనీలు ఇచ్చే మెడికల్ పాలసీలనే తీసుకుంటున్నారు తప్ప ప్రత్యేకంగా ఆరోగ్య బీమా తీసుకోవడానికి ఉత్సాహం చూపడం లేదు. కంపెనీ ఇచ్చే మెడికల్ క్లెయిమ్ వైద్య ఖర్చులకు సరిపోతుందని సర్వేలో పాల్గొన్న దాదాపు 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. పన్ను మినహాయింపుల నిమిత్తం హెల్త్ పాలసీని కలిగి ఉన్నామని 74 శాతం మంది తెలిపారు. -
యువ నిపుణులకు నీతి ఆయోగ్ భారీ వేతనాలు
న్యూఢిల్లీ: ప్రతిభావంతులైన యువ నిపుణులను ఆకర్షించేందుకు మునుపటి ప్రణాళికా సంఘం అందించిన దాని కంటే 30 శాతం ఎక్కువగా వేతనం ఇవ్వాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. స్వతంత్ర భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ని కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 20 మంది యువ నిపుణుల కోసం నీతి ఆయోగ్ రిక్రూట్మెంట్ ప్రారంభించింది. వీరికి నెలకు రూ.40,000- రూ.70,000 వేతనం అందించనుంది. ప్రణాళిక సంఘం నెలకు రూ.31,000-రూ.51,000 వేతనం అందించగా, అందుకు 30 శాతం ఎక్కువగా నీతి ఆయోగ్ అందించనుండడం విశేషం. దీంతో పాటు వయోపరిమితిని కూడా 40 ఏళ్ల నుంచి 32 ఏళ్లకు తగ్గించినట్లు అధికారులు వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితులను పరిశీలించేందుకు చీఫ్ ఎకనమిస్ట్ కోసం కూడా నీతి ఆయోగ్ అన్వేషిస్తోంది.