నిద్రపట్టడం లేదు... సలహా ఇవ్వండి | Sakshi family health counseling 18-04-2019 | Sakshi
Sakshi News home page

నిద్రపట్టడం లేదు... సలహా ఇవ్వండి

Published Thu, Apr 18 2019 12:16 AM | Last Updated on Thu, Apr 18 2019 12:16 AM

Sakshi family health counseling 18-04-2019

హోమియో కౌన్సెలింగ్స్‌
నా వయసు 33 ఏళ్లు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ప్రతి రెండు వారాలకు ఒకసారి షిఫ్ట్‌ మారుతుంది. ఈ మధ్యే డే–షిఫ్ట్‌ కు మారాను. అయినా రాత్రివేళ సరిగా నిద్రపట్టడం లేదు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – ఎమ్‌. నవీన్, హైదరాబాద్‌ 
మనిషికి గాలి, నీరు, తిండి లాగే నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర కరువైతే కళ్లలో కళాకాంతులు తగ్గుతాయి. ఉత్సాహం తగ్గుతుంది. అలసట, ఆందోళన మాత్రమే గాక అనేక ఆరోగ్య సమస్యలకు నిద్రలేమి కారణమవుతుంది. శారీరక, మానసిక సమస్యలు తప్పవు. నిద్రలోకి జారుకోలేకపోవడం, ఒకవేళ నిద్రపట్టినా తెల్లవారుజామున నిద్రలేవడం, రాత్రిళ్లు మళ్లీ మళ్లీ మెలకువ రావడం, ప్రశాంతమైన నిద్రలేకపోవడం నిద్రలేమి సమస్యకు సంబంధించిన ఒకటి రెండు లక్షణాలు. అయితే ఇవి అన్నీ గాని... కొన్ని గాని ఉండటాన్ని వైద్యపరిభాషలో ఇన్‌సామ్నియా (నిద్రలేమి)గా చెప్పవచ్చు. నిద్రలేమి శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆలోచన గమనాన్ని నియంత్రిస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. 

కారణాలు : ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శారీరకంగా వచ్చే మార్పులు ∙చికాకులు ∙చీటికిమాటికి కోపం తెచ్చుకోవడం ∙దీర్ఘకాలిక వ్యాధులు ∙వంశపారంపర్యం ∙అంతులేని ఆలోచనలు
లక్షణాలు: ∙నిద్రలోకి జారుకునేందుకు కష్టపడిపోవడం ∙నిద్రపట్టినా మధ్య మధ్య మెలకువ వస్తూ ఉండటం, నాణ్యమైన నిద్ర లోపించడం ∙తెల్లవారుజామున మెలకువ వచ్చాక మళ్లీ నిద్రపట్టకపోవడం ∙నిద్రలేచిన తర్వాత విశ్రాంతిగా అనిపించకపోవడం 
నిర్ధారణ పరీక్షలు : రక్తపరీక్షలు, పాలీసామ్నోగ్రామ్‌ (పీఎస్‌జీ)  
చికిత్స: హోమియోలో నిద్రలేమి సమస్యకు మంచి చికిత్స అందుబాటులో ఉంది. నక్స్‌వామికా, ఓపియమ్, బెల్లడోనా, ఆర్సినిక్‌ ఆల్బమ్‌ వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. పాసీఫ్లోరా 20 – 25 చుక్కలు అరకప్పు నీళ్లలో కలుపుకుని తాగితే గాఢంగా నిద్రపడుతుంది.
డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, 
ఎండీ (హోమియో), స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

గౌట్‌ సమస్యకు  పరిష్కారం ఉందా? 
నా వయసు 43 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. సలపరంతో కూడిన తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌గారు గౌట్‌ అని చెప్పారు.  ఎన్ని  మందులు వాడినా ఉపశమనం కనిపించడం లేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – ఆర్‌. కళ్యాణ్, గుంటూరు 
గౌట్‌ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్‌ యాసిడ్‌’ జీవక్రియలు సరిగా లేనందున ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్‌ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్‌ యాసిడ్‌ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీళ్లు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘గౌట్‌’ అంటారు. 

కారణాలు: సాధారణంగా రక్తంలోని యూరిక్‌ యాసిడ్‌ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది. ∙ప్యూరిన్స్‌ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం. ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. 

లక్షణాలు: ∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి.  ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది.  ∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. 
∙ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. 
నివారణ / జాగ్రత్తలు : మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్‌ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్‌ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగ, పేగుల వంటివి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. 
చికిత్స: హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్‌టిట్యూషన్‌ చికిత్స ద్వారా గౌట్‌ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. 
డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌  అంటున్నారు... 
నా వయసు 62 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉండటంతోబాటు కీళ్లవద్ద ఎర్రగా మారాయి. నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. మాలకొండారావు, ఒంగోలు 
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌. అంటే తన వ్యాధి నిరోధక శక్తి తన పట్ల ప్రతికూలంగా పనిచేయడం. సాధారణంగా యాభైఏళ్లు పైబడిన వాళ్లలో ఈ నొప్పులు మొదలవుతాయి.ఈ వ్యాధి ఉన్న వారిలో లక్షణాల తీవ్రతలో చాలా రకాల మార్పులు కన్పిపిస్తుంటాయి. వ్యాధి యాక్టివ్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్‌ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకేకీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్లు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్లలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్‌’ అంటారు.రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్‌ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్‌ ప్రిస్క్రిప్షన్‌ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్‌ కిల్లర్స్, స్టెరాయిడ్స్‌ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా  ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా ఈ వ్యాధిని పూర్తిగానియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు. 
డాక్టర్‌ టి.కిరణ్‌ కుమార్, డైరెక్టర్, 
పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement