యోగాతో చలికి చెక్!
విశాఖపట్నం: శారీరక శ్రమకన్నా మానసిక ఒత్తిడి నేటి యువతకు అధికం అవుతోంది. అదికాస్తా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఒత్తిడులను తగ్గించి శారీరక, సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సాధన ఒక్కటే మార్గమని ఆధారాలతో సహా యోగా గురువులు నొక్కి చెబుతున్నారు. వ్యాధులు విజృంభించే కాలంగా ముద్రపడిన చలికాలంలో వ్యాధుల నుంచి విముక్తి కావాలంటే యోగా ఒక్కటే మార్గమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో యోగా, ప్రకృతి వైద్యంపట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా పలువురు యోగా మాస్టర్లు ప్రత్యేకంగా వింటర్ యోగాను అందుబాటులోకి తెచ్చి ఇళ్ల వద్దకే వచ్చి నేర్పిస్తున్నారు. ఇందుకు అపార్ట్‌మెంట్లు, కాలనీ కమ్యూనిటీ హాల్‌లు వేదికలుగా మారుతున్నాయి.
వీటికి మహిళలు, పురుషుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. మారిన ఆహారపు అలవాట్లు, కాలానుగుణంగా వస్తున్న మార్పులతో సోకుతున్న దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, ఉబ్బసం, గుండెపోటు, మెడ, నడుం నొప్పులు, జీర్ణ సంబంధిత వ్యాధులు చలికాలంలో ఎక్కువగా ముసురుకుంటాయి. ఈ వ్యాధులను ముందస్తుగానే అరికట్టేందుకు, అవి దరిచేరకుండా కట్టడి చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించేందుకు చలికాలంలో శారీరక వ్యాయామం, యోగాసనాలు, ధ్యానం ఎంతో అవసరమని యోగా శిక్షకులు చెబుతున్నారు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ల కారణంగా ఓపిక సన్నగిల్లుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పునరుత్తేజం పొందాలంటే, కొత్త శక్తులు తిరిగి పొందాలంటే యోగాను ఆశ్రయించాలని యోగా శిక్షకులు అంటున్నారు. తీవ్ర సమస్యలను, వ్యాధులను పారదోలే శక్తి యోగా సొంతమని పేర్కొంటున్నారు. శారీరక వ్యాయామం, మానసిక ప్రశాంతత పొందేందుకు ఉపయోగపడే గర్భాసనం, వ్యాగ్రాసనం, త్రికోణాసనం, మత్స్యాసనం, ప్రాణాయామం, సూర్యనమస్కారాలను ఇప్పుడు బాగా నేర్పిస్తున్నారు.
తీసుకోవాల్సిన ఆహారపు జాగ్రత్తలు, భోజనంలో పాటించాల్సిన విషయాలపై అవగాహన కూడా కలిగిస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాతనే ప్రాణాయామాలు, సూర్యనమస్కారాలు చేయాలని, ఆ తర్వాత స్నానం చేయాలని వీరు పేర్కొంటున్నారు. ఉదయం 5 గంటలకు కచ్చితంగా నిద్రలేచి వెంటనే ఒకటి నుంచి 5 గ్లాసులు నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని కూడా సూచిస్తున్నారు. రాత్రి ఏడు గంటలకే భోజనం చేయడం, 9 నుంచి 10 గంటల మధ్య పడుకోవాలంటున్నారు.
అన్నింటికీ పరిష్కారం
ధ్యానంలో కూర్చున్న ప్రతిసారి అలసట తగ్గి చింతలు, బాధలు తొలగిపోతాయి. మానవుడు ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటాడో అప్పుడే శక్తిసంపన్నులుగా తయారవుతారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పావుగంట పాటు చేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ద్యానం చేసే సమయంలో మనం ఇతరుల నుంచి ఏకాంతంగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ధ్యానం శరీరం నుంచి అన్ని మలినాలను శుభ్రపరుస్తుంది. ఇప్పుడు అన్ని ప్రాంతాలలో అందుకే యోగాకు ప్రాధాన్యతనిస్తున్నారు. యోగాసనాలు బలాన్ని, శక్తిని ఇస్తాయి.
- పి.ప్రశాంతి.. యోగా కౌన్సెలర్