పిల్లల్లోనూ మానసిక ఒత్తిడి! | Mental stress to children with Lockdown | Sakshi
Sakshi News home page

పిల్లల్లోనూ మానసిక ఒత్తిడి!

Published Thu, Jun 25 2020 4:45 AM | Last Updated on Thu, Jun 25 2020 4:45 AM

Mental stress to children with Lockdown - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పన్నెండేళ్ల శివాని గతంలో హోంవర్క్‌ అయ్యాక.. ఇంటి పనిలో సాయపడేది. లాక్‌డౌన్‌ తరువాత అస్సలు సాయం చేయడం లేదు. చిన్న పని చెప్పినా చికాకుపడుతోంది. పదహారేళ్ల శివ లాక్‌డౌన్‌కు ముందు చలాకీగా ఉండేవాడు. సాయంకాలం వారి హోటల్లో పనులు చక్కబెట్టేవాడు. లాక్‌డౌన్‌ కారణంగా బాగా బరువు పెరిగి లావయ్యాడు. చీటికీ మాటికీ చికాకుపడుతున్నాడు.

ఇదీ..ప్రస్తుతం విద్యార్థుల మానసిక పరిస్థితి. లాక్‌డౌన్‌ సమస్త మానవాళి జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటి నుంచి కాలు బయట పెడితే.. కరోనా కాటు వేస్తుందన్న భయంతో అంతా ఇంటికే పరిమితమయ్యాం. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించాక కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదవుతుండటంతో ఇప్పుడు కూడా పిల్లల్ని బయటికి పంపే పరిస్థితి లేదు. దీంతో వారు ఆంక్షల మధ్య జీవిస్తూ ఒత్తిడికి గురవుతున్నారు. మునుపటిలా స్నేహితులను కలవలేకపోవడం, కలిసి ఆడుకోలేకపోవడం వల్ల చికాకుపడుతున్నారు. అందుకే, చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటున్నారు. పిల్లల్లో ఈ ఆకస్మిక ప్రవర్తన చూసి తల్లిదండ్రులు విస్మయపోతున్నా.. లాక్‌డౌన్‌ కావడంతో చేసేదిలేక సర్దుకుపోతున్నారు.

వాస్తవానికి పిల్లల్లో కనిపిస్తోన్న ఈ విపరీత ధోరణికి కారణం వారికి తగినంత శారీరక శ్రమ లేకపోవడమే. వాస్తవానికి ప్రతిరోజూ పిల్లలు ఇంటి వద్ద లేదా బడిలో ఎంతోకొంత సమయం ఆడుకునేవారు. ఆటల వల్ల శరీరంలో ఒత్తిడిని తగ్గించే ఎండార్ఫిన్‌ లాంటి పలు హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి శరీరాన్ని ఒత్తిడి నుంచి దూరంగా ఉంచి, మానసిక ప్రశాంతత చేకూరుస్తాయి. అంతేకాదు, ఆటల వల్ల శరీరం అలసి మంచి నిద్ర కూడా వస్తుంది. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకపోవడంతో విద్యార్థుల లైఫ్‌స్టైల్‌ పూర్తిగా మారిపోయింది. శారీరక శ్రమ అస్సల్లేదు. ఎప్పుడు పడుకుంటున్నారో.. ఎప్పుడు లేస్తున్నారో.. ఎప్పుడు తింటున్నారో.. వారికే తెలియడం లేదు. వేళాపాళా లేని జీవనశైలి వల్ల చిన్న విషయాలకే ఒత్తిడికి గురవుతున్నారు. 24 గంటలు ఇంటికే పరిమితమవడంతో బరువు కూడా పెరిగి లావవుతున్నారు.

చికాకు పెరిగితే చిక్కులే
లాక్‌డౌన్‌ పరిస్థితులను పిల్లలు అర్థం చేసుకుం టున్నారు కాబట్టి. పిల్లల్లో ఈ చికాకు అప్పుడప్పుడు మాత్రమే బయటపడుతోందని ప్రముఖ సైకాలజిస్టు వీరేందర్‌ అంటున్నారు. దేశంలో అధిక శాతం పేద, దిగువ, మధ్యతరగతి కుటుంబాలే. వీరిలో చాలామందివి సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లే. లాక్‌డౌన్‌లో బయటికి వెళితే.. ప్రాణాల మీదకు వస్తుందన్న భయంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి అనుమతించడం లేదు. పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కానీ, అప్పుడప్పుడు వచ్చే కోపాన్ని, చికాకును నియంత్రించుకోలేక ఇలా బయట పడుతున్నారని వివరిస్తున్నారు. తల్లిదండ్రులు ఇలాంటి ఘటనలను పెద్దగా పట్టించుకోకుండా.. వారి పరిస్థితిని అర్థం చేసుకుని, అనునయించే యత్నం చేయాలని హితవు పలుకుతున్నారు. లేకపోతే ఇవే పెద్ద గొడవలుగా మారి, బంధాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు.      
–వీరేందర్, సైకాలజిస్టు 

ఏం జరుగుతోంది..?
► మార్చి 22 నుంచి అంటే దాదాపుగా 105 రోజులుగా విద్యార్థులంతా ఇంట్లోనే ఉంటున్నారు.
► టీవీలు, ఇంటర్‌నెట్, సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేస్తున్నారు.
► ఆటపాటలు లేకపోవడంతో శరీరానికి వ్యాయామం దూరమైంది. పలువురు పిల్లలు తమ శరీర బరువులో మార్పు రావడాన్ని స్వయంగా గ్రహిస్తున్నారు.
► ఒత్తిడిని అధిగమించే హార్మోన్లు సరిగా విడుదల కాకపోవడంతో కోపం, చికాకు తెచ్చుకుంటున్నారు.
► ఇంకొందరు తల్లిదండ్రులతో వాదనలకు దిగుతూ నానా హంగామా చేస్తున్నారు.

ఏం చేయాలి?
► ఇంట్లో పిల్లలకు యోగాసనాలు, ప్రాణాయామం నేర్పించాలి.
► ప్రతిరోజూ పిల్లలతో కనీసం 45 నిమిషాలపాటు చిన్న చిన్న వర్కవుట్లు చేయించాలి. 
► రోజూ తింటున్న కేలరీలకు, ఖర్చు చేస్తున్న కేలరీల మధ్య వ్యత్యాసం ఎక్కువైతే శరీర బరువు పెరిగిపోతుందన్న విషయం వివరించాలి.
► వర్క్‌ ఫ్రం హోం చేసే తల్లిదండ్రులు తమ పిల్లలకు కథలు వినిపించడం, రాయమని ప్రోత్సహించడం చేయాలి.
► లాక్‌డౌన్, కరోనా వైరస్‌ తదనంతర పరిస్థితులపై వారి భయాల్ని పోగొట్టాలి.
► ఆన్‌లైన్‌ క్లాసులు ముగిసిన వెంటనే చదువు అంటూ పదేపదే పోరుపెట్టకూడదు.
► ఒకవేళ పిల్లలు సబ్జెక్టు అర్థం కాలేదని చికాకు పడుతుంటే.. ఆ విషయాలను వారితో చర్చించి స్కూలు ఉపాధ్యాయులతో మాట్లాడించండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement