సాక్షి, సిటీబ్యూరో: పాపం పుణ్యం.. ప్రపంచమార్గం.. కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు. ఏమీ ఎరగని పూవులు వారు. అయిదారేడుల పాపలు వారు. వాన కురిస్తే.. మెరుపు మెరిస్తే..ఆకసమున హరివిల్లు విరిస్తే అవి తమకోసమేననిఆనందించే అమాయకులు వారు. పదుల ప్రాయం నిండినా అభమూ శుభమూ తెలియని పసివాళ్లే వారు. నిన్నటికి, నేటికి, రేపటికి తేడా తెలుసుకోలేని దయనీయ పరిస్థితి వారిది. రాత్రీ పగలూ, దిక్కులు, వారాలు, తేదీల లెక్కలు ఎరగరు వారు. తామెక్కడున్నామో. ఎలా ఉన్నామో కూడా తెలుసుకోలేని అభాగ్యులు వారు. మానసిక ఎదుగుదల లోపంతో బాధపడుతున్న పిల్లలు. ఎంత వయసొచ్చినాఇంకా తల్లిచాటు బిడ్డలే వారు. బుద్ధిమాంద్యంతోనేబాధపడుతున్న వీరికి లాక్‌డౌన్ మరింత కఠిన శిక్షవిధించింది. అమ్మఒడి లాంటి శిక్షణ సంస్థలకు దూరంచేసింది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌సడలింపుతో కొన్ని రంగాల్లో మినహాఅంతటా సాధారణ జనజీవనం నెలకొంది.
విద్యాసంస్థలు తెరుచుకోకపోయినా ఆన్‌లైన్‌లో పిల్లలకు పాఠాలను బోధిస్తున్నారు. కానీ మానసిక వికలాంగులైన పిల్లలకు మాత్రం లాక్‌డౌన్ శాపంగా మారింది. గ్రేటర్ పరిధిలో సుమారు 88 సంస్థలు బుద్ధిమాంద్యత పిల్లలకు శిక్షణనిస్తున్నాయి. వీటిలో సుమారు 5 వేల మంది పిల్లలు ట్రెయినింగ్ పొందుతున్నారు. ప్రస్తుతం ఆయా సంస్థలన్నీ మూసివేసి ఉన్నాయి. ప్రతి క్షణం నిపుణులైన టీచర్లు, వలంటీర్ల పర్యవేక్షణలో దైనందిన జీవితాన్ని కొనసాగించే బుద్ధిమాంద్యత పిల్లలు కోవిడ్ కారణంగా మూడున్నర నెలలుగా ఇళ్లకే పరిమితమయ్యారు. తల్లిదండ్రుల ఆదరణ, పోషణ ఉన్నప్పటికీ.. శాస్త్రీయమైన పద్ధతిలో పిల్లలకు మార్గనిర్దేశం చేసే వ్యవస్థ అందుబాటులో లేకుండాపోయింది. దీంతో ‘ప్రత్యేకమైన పరిస్థితులు’ కలిగిన ఆ పిల్లల మనుగడ తీవ్రమైన ఇబ్బందులనెదుర్కొంటున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా సాధారణ పిల్లలే స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు అవకాశం లేక ఇళ్లల్లో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడుపుతుండగా బుద్ధిమాంద్యులైన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ పరిస్థితులు మరికొంత కాలం ఇలాగే కొనసాగితే వీరి పెంపకం తల్లిదండ్రులకు కూడా భారంగా మారే అవకాశముందని పేర్కొంటున్నారు.
నడిపించే వారెవరు..?
బుద్దిమాంద్యులైన పిల్లల కోసం పనిచేస్తున్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబుల్ (ఎన్‌ఐఈపీఐడీ) జాతీయ సంస్థతో పాటు, స్వీకార్ ఉపకార్, ఆత్మీయ, ఠాకూర్, శ్రీవిద్య వంటి సుమారు 88 స్వచ్ఛంద సంస్థల్లో 5 వేల మందికిపైగా పిల్లలు ఉన్నారు. ఉదయం నిద్ర లేవగానే బాత్రూంకు వెళ్లడం నుంచి బ్రష్ చేసుకోవడం, స్నానం, వస్త్రధారణ, భోజనం తదితర దైనందిన కార్యకలాపాలకు సంబంధించిన 12 అంశాల్లో ఈ సంస్థలు శిక్షణనిస్తున్నాయి. మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారికి 50 ఏళ్లు వచ్చినా పిల్లలుగానే పరిగణిస్తారు. వీరి మానసిక సామర్థ్యం మేరకు అక్షరాలు దిద్దిస్తారు. చదువు చెబుతారు. అలా చదువుకున్న పిల్లలు కంఫ్యూటర్ పరిజ్ఞానాన్ని కూడా అలవర్చుకుంటున్నారు. మార్కెట్‌కు వెళ్లి సరుకులు తెస్తున్నారు. టైమ్ మేనేజ్‌మెంట్, మనీ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై ఈ సంస్థలే శిక్షణనిస్తాయి. ‘గత మూడున్నర నెలలుగా అలాంటి శిక్షణ కార్యకలాపాలన్నీ నిలిచిపోవడంతో బుద్ధిమాంద్యులైన పిల్లల జీవితం కొన్ని సంవత్సరాలపాటు వెనక్కి వెళ్లినట్లయింది’ అని శ్రీవిద్య సెంటర్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్ నిర్వాహకులు శాంతి వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లోని ఈ ఇనిస్టిట్యూట్‌లో కాలకృత్యాలు తీర్చుకోవడం మొదలుకొని అన్ని అంశాల్లో శిక్షణనిస్తున్నారు. ‘ఫిజియో థెరపీ, స్పీచ్ థెరపీ నిరంతరం లభిస్తేనే మార్పు వస్తుంది. కానీ చాలా మంది వాటికి దూరమయ్యారు’ అని చెప్పారు.
అక్కడే ఆగిపోతారు..
సాధారణంగా మానసిక నిపుణుల అంచనా మేరకు ఐక్యూ 70 శాతం కంటే తక్కువగా ఉంటే వికాసం తక్కువగా ఉన్నట్లు పరిగణిస్తారు. ఐక్యూ స్థాయిని అనుసరించి మైల్డ్, మోడరేట్, సివియర్ వంటి కేటగిరీలుగా విభజించి అవసరమైన ప్రత్యేక శిక్షణనిస్తారు. దీంతో క్రమంగా బుద్ధి వికాసం జరిగి పిల్లల్లో మార్పులు వస్తాయి. ఇందుకు నిరంతర శిక్షణ అవసరం. ఇప్పుడు అది లోపించింది.దీంతో ఎంతో కొంత మార్పు సాధించినవాళ్లు మరింత ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
ప్రత్యేక నైపుణ్యం అవసరం..
ఇరవై నాలుగు గంటలు పిల్లలను కనిపెట్టుకొని ఉండటమంటే తల్లిదండ్రులకు చాలా కష్టం. పైగా ఆ పిల్లల పెంపకానికి ప్రత్యేక నైపుణ్యం అవసరం. ఇళ్లల్లో అది సాధ్యం కాదు. లాక్‌డౌన్ పరిస్థితులు ఇలాంటి పిల్లల మనుగడకు ప్రమాదకరంగా మారాయి. – శాంతి వెంకట్, శ్రీవిద్య ఇనిస్టిట్యూట్
చాలా కష్టంగా ఉంది..
మా అమ్మాయికి 16 ఏళ్లు. మానసిక వికాసం తక్కువ. కరోనా నేపథ్యంలో పాఠశాలలను మూసివేశారు. దీంతో రాత్రింబవళ్లూ ఆమెను కనిపెట్టుకొని ఉండడం చాలా కష్టంగా ఉంది. స్కూల్లో శిక్షణ తీసుకున్న రోజులు చాలా బాగా గడిచాయి.– ఎంఎస్‌ఆర్ మూర్తి, పద్మారావునగర్
Comments
Please login to add a commentAdd a comment