సాక్షి, సిటీబ్యూరో: స్క్రీన్‌టైమ్స్. అదేపనిగా మొబైల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కు అతుక్కుపోయే అలవాటు. సాధారణంగా ఇది అతి పెద్ద సవాల్. ఈ అలవాటు ఒక పరిమితిని దాటడడం వల్ల అనేక రకాల అనర్థాలు చోటుచేసుకుంటాయి. ప్రస్తుత కరోనా కాలంలో ఈ ‘స్క్రీన్‌టైమ్స్’ ఒక సిండ్రోమ్ దశకు చేరుకుందని మానసిక వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు దీని బారినపడి చాలా నష్టపోతున్నట్లు చెబుతున్నారు. ప్రత్యేకించి ఇది ‘ లాక్‌డౌన్ స్క్రీన్‌టైమ్స్’గా యువతను పట్టి పీడిస్తోంది. ఆన్‌లైన్ తరగతుల వల్ల స్కూల్‌కు వెళ్లే పిల్లల నుంచి కాలేజీకి వెళ్లే యువత వరకు లాక్‌డౌన్ స్క్రీన్‌టైమ్స్ వ్యసనంలా వేధిస్తోంది. ఒకవైపు స్కూళ్లు, కాలేజీలు లేకపోవడం వల్ల మానసిక వికాసంలో స్తబ్దత కనిపిస్తుండగా ‘స్క్రీన్‌టైమ్స్’ దానికి మరింత ఆజ్యం పోస్తోందని డాక్టర్లు పేర్కొంటున్నారు. దీనివల్ల పలు మానసిక సమస్యలు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. కరోనా ఉధృతం కావడం, సాధారణ జనజీవితంపై నెలకొన్న అనిశ్చితి ఇందుకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ‘స్క్రీన్‌టైమ్స్’ టీనేజ్ పిల్లలకు అతి పెద్ద సవాల్‌గా మారింది.
రోజుకు 7 గంటలు దాటితే అంతే..
చిక్కడపల్లికి చెందిన పదో తరగతి అమ్మాయి కొంతకాలంగా ఆన్‌లైన్ క్లాస్‌లకు హాజరవుతోంది. రెండు గదుల ఇంట్లో కుటుంబమంతా కలిసి ఉంటారు. తాను ఒక గదికి పరిమితమై ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆన్‌లైన్ క్లాస్‌లు వింటుంది. ఆ తర్వాత మొబైల్ ఫోన్‌లోనే పలు ఫీచర్లు వీక్షిస్తూ గడిపేస్తుంది. అదేపనిగా ఫోన్ చూస్తుండడంతో తల్లి ఆంక్షలు విధించింది. దీంతో ఆ అమ్మాయిలో విపరీతమైన కోపం, అసహనం, చికాకు పెరిగాయి. ఈ నేపథ్యంలో వైద్యుడిని సంప్రదించగా ‘తనకు జీవితంలో ఫ్రీడమ్ లేకుండా పోయిందని, చనిపోవాలనిపిస్తోందని’ సదరు అమ్మాయి డాక్టర్ వద్ద ఏకరువు పెట్టింది. కావలసినంత సమయం మొబైల్‌ఫోన్ చూసేందుకు తల్లి అంగీకరించకపోవడమే ఇందుకు కారణం.
ఆ ఒక్క అమ్మాయి మాత్రమే కాదు. చాలా మంది పిల్లల పరిస్థితి ఇలాగే ఉంది. లాక్‌డౌన్ టైమ్‌లో ఇది మరింత ఆందోళన కలిగిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. మానసిక వైద్య నిపుణుల విశ్లేషణ ప్రకారం 18 నెలల వయస్సు వరకు పిల్లలు ‘స్క్రీన్‌టైమ్స్’కు దూరంగా ఉండాలి. 5 ఏళ్లలోపు పిల్లలు గంట సేపు వీక్షించవచ్చు. ఎదుగుతున్న పిల్లలు 3 గంటల వరకు మొబైల్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, టీవీ వంటివి చూడవచ్చు. టీనేజ్ పిల్లలు, యువత 7 గంటల కంటే ఎక్కువ సమయం ‘స్క్రీన్‌టైమ్స్’తో గడిపితే మానసిక సమస్యలను ఎదుర్కోక తప్పదు. సాధారణంగానే గంటల తరబడి మొబైల్ ఫోన్‌లకు అతుక్కుపోయే కుర్రకారు లాక్‌డౌన్ టైమ్‌లో 15 గంటలకు పైగా ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నట్లు వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి ఒంటిగంట వరకు కూడా ‘స్క్రీన్‌టైమ్స్’లోనే కొట్టుకుపోతున్నారు.
అనర్థాలు అనేకం...
లాక్‌డౌన్ కారణంగా ఇప్పుడు ఆన్‌లైన్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న బాలుడు కొద్ది రోజులుగా తన గదికే పరిమితమయ్యాడు. ఎవరితోనూ మాట్లాడడం మానేశాడు. తనకు తాను పూర్తిగా ఐసోలేట్ కావడంతో పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. వైద్యులను సంప్రదించగా శారీరకంగా ఎలాంటి అనారోగ్యం లేదని నిర్ధారించారు. చివరకు సికింద్రాబాద్‌లో ఒక సైకియాట్రిస్టును సంప్రదించగా రాత్రింబవళ్లు ఫోర్న్‌సైట్స్ చూస్తున్నట్లు కౌన్సెలింగ్‌లో వెల్లడైంది. సాధారణంగా ఉదయం టిఫిన్ చేసి కాలేజీకి లేదా స్కూల్‌కు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి ఆట, పాటలతో సరదాగా గడపాల్సిన పిల్లలు అందుకు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో ఉండడం వల్ల అనేక రకాల అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. స్క్రీన్‌టైమ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. తమకు తెలియకుండానే రకరకాల తప్పులు చేస్తున్నారు.
మూర్తిమత్వ వికాసానికి విఘాతం ..
♦సాధారణంగా ఏ వయస్సులో రావలసిన మార్పు ఆ వయస్సులో రాకపోతే ‘డెవలప్‌మెంటల్ డిలే’ అంటారు. స్క్రీన్‌టైమ్స్ వల్ల మానసిక ఎదుగుదల కొరవడుతుంది. మూర్తిమత్వ వికాసానికి ఇది విఘాతం కలిగిస్తుంది.
♦ఇరువై నాలుగు గంటలు స్క్రీన్స్‌కు అతుక్కుపోవడం వల్ల భావప్రకటనా నైపుణ్యం (కమ్యూనికేషన్స్ స్కిల్) కోల్పోతున్నారు.
♦ మొదడులో ఆలోచనా శక్తిని, చైతన్యాన్ని పెంచే న్యూరాన్స్‌లో మార్పుల వల్ల ప్రవర్తనలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి.
♦ఆపదలో ఉన్నవారిని ఆదుకొనే స్వభావాన్ని కోల్పోతున్నారు. తోటి వారి పట్ల, కుటుంబం పట్ల ఉండవలసిన ప్రేమ, దయ, సానుభూతి, ఆప్యాయత సానుభూతి వంటివి కొరవడడం ‘స్క్రీన్‌టైమ్స్’ అనర్థాల్లో మరికొన్ని.
అభిరుచుల్లో మార్పు అవసరం
మెబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్స్‌కు కేటాయించే సమయాన్ని తగ్గించుకోవాలి. మనస్సుకు నచ్చే అభిరుచులను అలవర్చుకోవాలి. సంగీతం, సినిమా, ఆటలు, పాటలు మంచిదే. ఈ లాక్‌డౌన్ టైమ్‌లో వ్యాయామం, యోగ, ప్రాణాయామం వంటివి అలవాటు చేసుకోవడం వల్ల మానసిక వికాసం మెరుగుపడుతుంది. పఠనాశక్తి పెరుగుతుంది. విషయాన్ని గ్రహించే నైపుణ్యం, భావప్రకటన కూడా బాగుంటాయి. – డాక్టర్ సంహిత, సీనియర్ సైకియాట్రిస్టు, పద్మారావునగర్
Comments
Please login to add a commentAdd a comment