Kanala hindola: ఆటలకు మానసిక బలం | Mind Lead: Contribute to the development of athletes | Sakshi
Sakshi News home page

Kanala hindola: ఆటలకు మానసిక బలం

Published Tue, Oct 11 2022 3:59 AM | Last Updated on Tue, Oct 11 2022 3:59 AM

Mind Lead: Contribute to the development of athletes - Sakshi

క్రీడాకారుల శిక్షణా కార్యక్రమంలో...; కె.హిందోళ, స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌

ఆటల్లో ఒకరు గెలిస్తే మరొకరు ఓడాలి. గెలిచినప్పుడు పొంగిపోకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా ఉండగలిగేవారు స్పోర్టివ్‌ స్పిరిట్‌ ఉన్నావారు. కాని అందరూ అలా ఉండరు. ఆటల్లో రాణించాలంటే వారిని ఓటమి భయం వెంటాడుతూ ఉంటుంది. ప్రత్యర్థి గురించి ఆందోళనలు ఉంటాయి.

చిన్నపిల్లల దగ్గరి నుంచి సీనియర్‌ ఆటగాళ్ల వరకూ ఈ ఒత్తిడి తప్పించుకోని వారు ఉండరు. మరి వీరికి సాయం? హిందోళ వంటి స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌ను కలవడమే. ‘మైండ్‌ లీడ్‌’ అనే ప్రోగ్రామ్‌ ద్వారా ఆటగాళ్ల ఒత్తిడిని తొలగిస్తూ వారికి అవసరమైన మానసిక బలం అందిస్తోంది హైదరాబాద్‌ వాసి హిందోళ.

‘స్పోర్ట్స్‌ సైకాలజీ అనేది ఒకటుంటుందని మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. దాని అవసరం ఏముందిలే అనుకోవచ్చు. కానీ ఈ రంగంలో ఈ సైకాలజీ అవసరం ఎంతో ఉంది’ అంటోంది  హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఉంటున్న హిందోళ. అందుకు డియర్‌ కామ్రెడ్‌లోని ఒక సీన్‌ను ఉదాహరిస్తూ..

‘లిల్లీ క్రికెటర్‌గా రాణిస్తున్న అమ్మాయి. రాష్ట్రస్థాయి క్రీడాకారిణి. మంచి నైపుణ్యం ఉన్న అమ్మాయి సడెన్‌గా డిప్రెషన్‌ బారిన పడుతుంది. ఎవరికీ అర్థం కాదు. ఎవరూ అర్థం చేసుకోలేరు. క్రికెట్టే లోకంగా బతికిన ఆ అమ్మాయి మూడేళ్లపాటు మానసికంగా ఒంటరైపోతుంది. ఆసుపత్రి పాలైన ఆ అమ్మాయిని హీరో వచ్చి ఆమెను మానసిక వేదన నుంచి బయటికి తీసుకొస్తాడు. అందరి జీవితాల్లోనూ అలాంటి హీరోలు ఉండకపోవచ్చు. కానీ, మానసిక స్థైర్యం ఇవ్వగలిగేవాళ్లు ఉండాలి.  

ఇటీవల తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ అమ్మాయి బ్యాడ్మింటన్‌ చాలా బాగా ఆడేది. సడెన్‌గా అకాడమీకి రావడం మానేసింది. ఆ స్పోర్ట్స్‌ అకాడమీకి సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్న నేను ఏమైందని తెలుసుకోవడానికి వారి తల్లిదండ్రులను సంప్రదించాను. తనను కష్టపెడుతున్న సమస్యలు ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేకపోయింది. తోటి వారి నుంచి వస్తున్న కామెంట్స్‌ ఆమెను ఆ ఆట నుంచి తప్పుకునేలా చేశాయి. ఈ విషయంపై కొన్నిరోజుల పాటు చేసిన కౌన్సెలింగ్‌ ఆమెలో మార్పు తీసుకువచ్చింది. లేదంటే, ఇదే ప్రభావం ఆమె చదువుమీద ఆ తర్వాత తన కెరియర్‌ మీద పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకు బయటకు చెప్పుకోలేని ఎన్నో సమస్యలు ఉంటాయి. అవి కోచ్‌ల ద్వారా కావచ్చు, తోటి క్రీడాకారుల ద్వారా కావచ్చు, ఆత్మన్యూనత కావచ్చు, మరేవిధమైన మానసిక సంఘర్షణ అయినా కావచ్చు. ఇలాంటప్పుడు స్పోర్ట్స్‌ సైకాలజిస్టుల మద్దతు అవసరం అవుతుంది’ అని వివరించింది ఈ మైండ్‌లీడ్‌ ఛాంపియన్‌.

అకాడమీలో సైకాలజిస్ట్‌గా..
తను చేస్తున్న వర్క్స్, ప్రణాళికల గురించి వివరిస్తూ – ‘బెంగళూరులోని పదుకొనే ద్రావిడ్‌ సెంటర్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌’లో పనిచేస్తున్నాను. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అథ్లెట్స్‌తోనూ మాట్లాడుతుంటాను. దీంతో ఏ స్థాయిలో స్పోర్ట్‌ సైకాలజీ అవసరం అనేది మరింత క్షుణ్ణంగా అర్ధమవుతుంది. చాలామంది క్రీడలలో మానసిక అంశాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ పక్కన పెట్టేస్తారు. మన దేశంలో అయితే చాలా వరకు దీనిని విస్మరిస్తుంటారు. అందుకే, క్రీడాకారులందరికీ మానసిక శిక్షణను అందుబాటులో ఉంచాలని ఆన్‌లైన్‌లో మైండ్‌లీడ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తున్నాను.  

బలమైన స్థితి
క్రీడలకు మానసిక బలం అవసరమని విదేశీయులకు బాగా తెలుసు. అందుకే వారు ప్రతి పోటీలో స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌ల గైడెన్స్‌ తప్పక తీసుకుంటారు. మన దేశంలో కూడా దీనిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర ఇంకా రకరకాల భావజాలాలు ఉన్నాయి. అమ్మాయిలను ఓ స్థాయి వరకే క్రీడలకు పరిమితం చేస్తుంటారు. కుటుంబం, బయట, అకాడమీ, స్కూల్, కాలేజీ.. ప్రతిచోటా వెనక్కి లాగడానికే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ విధానంలో మార్పులు తీసుకురావడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాను. దీని ద్వారా అథ్లెట్లు, కోచ్‌లు, బృందాలు, తల్లిదండ్రులకు, సహాయక సిబ్బందికి వినూత్నమైన విధానంలో మానసిక శిక్షణతో పాటు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాను.

రాహుల్‌ ద్రావిడ్‌తో...

ఈ భిన్నమైన కోర్సును ఎంచుకున్నప్పుడు మా అమ్మ మాలతి, నాన్న సుధాకర్‌ల మద్దతుగా నిలిచారు. వారి వల్లే ఈ రంగంలో మరింతగా కృషి చేయగలుగుతున్నాను. ఈ మైండ్‌ లీడ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా స్కూల్స్‌ కాలేజీలలో వర్క్‌షాప్స్‌ నిర్వహించబోతున్నాను. గ్రామీణ స్థాయి క్రీడాకారులలోనూ మానసిక చైతన్యం నింపే దిశగా కృషి చేస్తున్నాను’ అని వివరించింది ఈ యువ స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌.

ఆటలు పరిచిన బాట
‘చిన్నప్పటి నుంచి నాకు ఆటల్లో ఆసక్తి ఎక్కువ. బహుశా కేంద్రీయ విద్యాలయంలో చదవడం, అక్కడ అన్ని ఆటల్లో పోటీపడటం వల్ల క్రీడలు నా జీవితంలో కీలకమయ్యాయి. నా దృష్టి ఎక్కువగా బ్యాడ్మింటన్‌పై ఉండేది. అదే నన్ను ప్రొఫెషనల్‌ స్పోర్ట్స్‌ పర్సన్స్‌కి పరిచయం చేసింది. ఈ రంగంలో కొత్త కొత్త వ్యక్తులను కలిశాను. గెలుపు కోసం ప్రయత్నించేవారితో కలిసి ఉండటం వల్ల ప్రతిరోజూ నన్ను నేను కొత్తగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఇందులో ఉండే చేదు అనుభవాలు, పంచుకున్నవారి వేదనలు.. ఇవన్నీ నా కెరియర్‌ని డిసైడ్‌ చేసుకునేలా చేశాయి. అందుకే, స్కూల్‌ చదువు పూర్తవగానే స్పోర్ట్స్‌ సైకాలజీ దిశగా అడుగులు వేశాను. దీనికోసం బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకాలజీ అండ్‌ రీసెర్చ్‌ నుండి సైకాలజీ, జర్నలిజం అండ్‌ ఉమన్‌ స్టడీస్‌లో డిగ్రీ చేశాను. ఆ తర్వాత స్పోర్ట్స్‌ సైకాలజీలో మాస్టర్స్‌ చేయడానికి మణిపూర్‌ వెళ్లాను. ఇక్కడే క్రీడలలో మైండ్‌ఫుల్‌నెస్‌పై ప్రయోగాత్మక పరిశోధన చేశాను. భారతదేశంలోని అథ్లెట్ల కోసం సొంతంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించాను.’
కె.హిందోళ, స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌

– నిర్మలారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement