టెండనైటిస్‌ తగ్గుతుందా?  | Complete SolutionTthrough Tandanitis Homeo Counseling | Sakshi
Sakshi News home page

టెండనైటిస్‌ తగ్గుతుందా? 

Published Thu, May 2 2019 12:53 AM | Last Updated on Thu, May 2 2019 12:53 AM

Complete SolutionTthrough Tandanitis Homeo Counseling - Sakshi

నా వయసు 35 ఏళ్లు. నేను క్రీడాకారుణ్ణి కావడంతో అన్ని రకాల ఆటలు బాగా ఆడుతుంటాను. నాకు కొంతకాలంగా చేయి కదిలించినప్పుడు భుజంలో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే టెండన్స్‌కి సంబంధించిన వ్యాధి అని చెప్పారు. మందులు వాడుతున్నా సమస్య నుంచి ఉపశమనం లభించడం లేదు. అసలు ఈ సమస్య ఎందుకు కలుగుతుంది? హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి. 

మీరు వివరంగా తెలిపిన లక్షణాలను బట్టి మీరు టెండినైటిస్‌ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి హోమియో ద్వారా పూర్తి పరిష్కారం లభిస్తుంది. సాధారణంగా మన శరీరంలోని కండరాలను ఎముకలతో జతపరిచే తాడు లాంటి కణజాలాన్ని టెండన్స్‌ అని అంటారు. ఇవి ఫైబ్రస్‌ కణజాలంతో ఏర్పడతాయి. వీటికి సాగే గుణం ఉండటం వల్ల ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. కాబట్టి అవి కండరాలు ముడుచుకునే సమయంలో, ఎముకలు, కీళ్ల కదలికలకు సహకరిస్తాయి. ఏ కారణం చేతనైనా వీటికి హానికలిగితే, కదలికలు ఇబ్బందికరంగా మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. 

ఈ టెండన్స్‌ ఇన్ఫెక్షన్‌కు గురికావడాన్ని టెండినైటిస్‌ అంటారు. శరీరంలో ఎక్కడైనా ఏర్పడే ఈ సమస్య... భుజాలలో, మోచేతుల్లో, మణికట్టు, బొటనవేలు మొదటి భాగంలో, తుంటి, మోకాలు, మడమలు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏ వయసు వారిలోనైనా కనిపించే ఈ సమస్య ఎక్కువగా పెద్దవయసు వారిలో (ముఖ్యంగా 40 ఏళ్లు పైబడినవారిలో) కనిపిస్తుంది. ఆ వయసు వారిలో సాధారణంగా టెండాన్స్‌ సాగేతత్వం, ఒత్తిడిని తట్టుకునే శక్తి తగ్గిపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. 

కారణాలు 
వయసు పెరగడం, గాయం కావడం, వృత్తిరీత్యా లేదా హాబీల కారణంగా టెండన్స్‌పై అధిక ఒత్తిడి కలిగించే ఒక రకమైన కదలికలను ఎక్కువగా కొనసాగించడం. ఉదా: కంప్యూటర్‌ కీ–బోర్డులు, మౌస్‌లు ఎక్కువగా వాడటం, కార్పెంటింగ్, పెయింటింగ్‌ మొదలైనవి. 

క్రీడల వల్ల :
►పరుగెత్తడం, టెన్నిస్, బాస్కెట్‌బాల్, గోల్ఫ్, బౌలింగ్‌ మొదలైనవాటివల్ల. 
►డయాబెటిస్, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్, స్థూలకాయం వంటి ఇబ్బందులతో  బాధపడేవారిలో ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది. 
►కొన్ని ఇన్ఫెక్షన్‌ల వల్ల కూడా ఈ టెండినైటిస్‌ సంభవించే అవకాశం ఉంది. 

లక్షణాలు 
టెండినైటిస్‌కి గురైన ప్రదేశంలో నొప్పి, బిగువుగా ఉండటం, ఆ భాగాన్ని కదిలించినప్పుడు నొప్పి అధికమవ్వడం, కొన్ని రకాల శబ్దాలు వినిపించడం, వాపు, చేతితో తాకితే ఆ ప్రదేశం వేడిగా అనిపించడం, ఎర్రగా మారడంవంటి లక్షణాలను గమనించవచ్చు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
►కంప్యూటర్లను, కీబోర్డులను, మౌస్‌లను సరైన పొజిషన్‌లో సర్దుబాటు చేసుకోవడం. 
►పనిలో కొంత విశ్రాంతి తీసుకోవడం 
►వ్యాయామాలు ఒకేసారి అధిక ఒత్తిడికి గురిచేసేలా కాకుండా నెమ్మదిగా ప్రారంభించడం 
►క్రీడలలో కోచ్‌ సలహా మేరకు జాగ్రత్తలు పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు. 

చికిత్స
జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషన్‌ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శారీరక పరిస్థితులు, తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం ద్వారా రోగి తాలూకు రోగ నిరోధకశక్తిని సరిచేయడం వల్ల ఎలాంటి ఇన్‌ఫ్లమేషన్‌ ఉన్నా దానిని నయం చేయడమే కాకుండా టెండన్స్‌ను దృఢపరచి సమస్యను సమూలంగా దూరం చేయడం జరుగుతుంది. 

డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

మైగ్రేన్‌కు చికిత్స ఉందా?

నా వయసు 25 ఏళ్లు. నాకు విపరీతమైన తలనొప్పి వస్తోంది. వారంలో ఒకటి, రెండు సార్లు తీవ్రంగా వస్తోంది. ఎన్నో రక్తపరీక్షలు, ఎక్స్‌–రే, స్కానింగ్‌ పరీక్షలు చేయించాను. డాక్టర్లు దీన్ని మైగ్రేన్‌గా నిర్ధారణ చేశారు. జీవితాంతం వస్తుంటుందని చెప్పారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? 

తరచూ తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. నేటి ఆధునికయుగంలో శారీరక, మానసిక ఒత్తిడి, అనిశ్చితి, ఆందోళనలు తలనొప్పికి ముఖ్యమైన కారణాలు. ఇంకా రక్తపోటు, మెదడు కణుతులు, మెదడు రక్తనాళాల్లో రక్తప్రసరణల్లో మార్పులు, సైనసైటిస్‌ మొదలైన వాటివల్ల తలనొప్పి వచ్చేందుకు ఆస్కారం ఉంది. తలనొప్పి ఏ రకానికి చెందినదో నిర్ధారణ తర్వాత ఖచ్చితమైన చికిత్స చేయడం సులువవుతుంది. మైగ్రేన్‌ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధిక ప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్‌ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. పురుషులతో పోలిస్తే ఇది స్త్రీలలోనే ఎక్కువ. 

మైగ్రేన్‌లో దశలూ, లక్షణాలు
సాధారణంగా మైగ్రేన్‌ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్‌ మైగ్రేన్‌ అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. 

వ్యాధి నిర్ధారణ
రక్తపరీక్షలు, రక్తపోటును పరీక్షించడం, సీటీస్కాన్, ఎంఆర్‌ఐ పరీక్షల ద్వారా మైగ్రేన్‌ను నిర్ధారణ చేయవచ్చు. మైగ్రేన్‌ రావడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు మనం తినే ఆహారంలో మార్పులు, మనం ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావారణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి. 

చికిత్స
మైగ్రేన్‌ను పూర్తిగా తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. శారీరక, మానసిక, కుటుంబ, అనువంవశిక, వాతావరణ, వృత్తిసంబంధమైన కారణాలను అంచనా వేసి, వాటిని అనుగుణంగా మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారి జెనెటిక్‌ కన్‌స్టిట్యూషన్‌ సిమిలియమ్‌ వంటి అంశాలన పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తారు. బెల్లడోనా, ఐరిస్, శ్యాంగ్యునేరియా, ఇగ్నీషియా, సెపియా వంటి కొన్ని మందులు మైగ్రేన్‌కు అద్భుతంగా పనిచేస్తాయి. 

డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, 
ఎండీ (హోమియో), 
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

ఒళ్లంతా తెల్లమచ్చలు... తగ్గేదెలా?

నా వయసు 39 ఏళ్లు. నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. మొదట్లో కాస్త చిన్నవిగా ఉండి, ఇప్పుడు క్రమంగా పెద్దవవుతూ అందరూ గమనించేలా ఉంటున్నాయి. ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాను. నాకు హోమియోలో పరిష్కారం సూచించండి.  


శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్‌ కూడా ఉంటాయి. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. ఇప్పుడు మీరు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్‌ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్‌ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్‌ అనే ఎంజైమ్‌ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో  మెలనిన్‌ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది.
 
►బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు.  డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్‌ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు. 

►పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు. 

►జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు. 

దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్‌ సమస్యలు : ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు. 

►మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్‌ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. 

►కొన్ని ఎండోక్రైన్‌ గ్రంథులు స్రవించే హర్మోన్స్‌ లోపాలు, డయాబెటిస్‌లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది. 

►వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్‌ డిసీజెస్‌ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది. 

లక్షణాలు 
మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. 

చికిత్స
తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్‌ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్‌ ఆల్బమ్, లాపిస్‌ అల్బా, రస్టాక్స్‌ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. 

డాక్టర్‌ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, 
పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement