మైగ్రేన్‌కు మందులున్నాయా? | sakshi health councling | Sakshi
Sakshi News home page

మైగ్రేన్‌కు మందులున్నాయా?

Published Mon, Jan 30 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

sakshi    health councling

హోమియో కౌన్సెలింగ్‌

నాకు విపరీతమైన తలనొప్పి వస్తోంది. వారంలో ఒకటి, రెండు సార్లు తీవ్రంగా వస్తోంది. ఎన్నో రక్తపరీక్షలు, ఎక్స్‌–రే, స్కానింగ్‌ పరీక్షలు చేయించాను. డాక్టర్లు దీన్ని మైగ్రేన్‌గా నిర్ధారణ చేశారు. జీవితాంతం వస్తుంటుందని చెప్పారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా?
– శ్రీరామ్మూర్తి, నిడదవోలు

నేటి ఆధునికయుగంలో శారీరక, మానసిక ఒత్తిడి, అనిశ్చితి, ఆందోళనలు తలనొప్పికి ముఖ్యమైన కారణాలు. ఇంకా రక్తపోటు, మెదడు కణుతులు, మెదడు రక్తనాళాల్లో రక్తప్రసరణల్లో మార్పులు, సైనసైటిస్‌ మొదలైన వాటివల్ల తలనొప్పి వచ్చేందుకు ఆస్కారం ఉంది. తలనొపి ఏ రకానికి చెందినదో నిర్ధారణ తర్వేత ఖచ్చితమైన చికిత్స చేయడం సులువవుతుంది. కారణాలు, అది ఏరకమైనది అయినప్పటికీ తరచూ తలనొప్పి వస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. మైగ్రేన్‌ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధికప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్‌ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. పురుషులతో పోలిస్తే ఇది స్త్రీలలోనే ఎక్కువ.

మైగ్రేన్‌లో దశలూ, లక్షణాలు : సాధారణంగా మైగ్రేన్‌ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్‌ మైగ్రేన్‌ అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి.

వ్యాధి నిర్ధారణ: రక్తపరీక్షలు, రక్తపోటును పరీక్షించడం, సీటీస్కాన్, ఎంఆర్‌ఐ పరీక్షల ద్వారా మైగ్రేన్‌ను నిర్ధారణ చేయవచ్చు.

నివారణ: మైగ్రేన్‌ రావడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు మనం తినే ఆహారంలో మార్పులు, మనం ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావారణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి.

చికిత్స: మైగ్రేన్‌ను పూర్తిగా తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. శారీరక, మానసిక, కుటుంబ, అనువంశీక, వాతావరణ, వృత్తిసంబంధమైన కారణాలను అంచనా వేసి, వాటిని అనుగుణంగా మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారి జెనెటిక్‌ కన్‌స్టిట్యూటషన్‌ సిమిలియమ్‌ వంటి అంశాలన పరిగణనలోకి తీసుకొని బెల్లడోనా, ఐరిస్, శ్యాంగ్యునేరియా, ఇగ్నీషియా, సెపియా వంటి కొన్ని మందులు మైగ్రేన్‌కు అద్భుతంగా పనిచేస్తాయి.

డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో)
స్టార్‌ హోమియోపతి
హైదరాబాద్‌

ఏడాదిలో నాలుగుసార్లు యూరినరీ ఇన్‌ఫెక్షన్‌
పీడియాట్రిక్‌ నెఫ్రాలజీ కౌన్సెలింగ్‌

మా అబ్బాయి వయసు రెండేళ్లు. వాడికి తరచూ యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ వస్తోంది. గత ఏడాదిలో నాలుగు సార్లు వాడికి యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చింది. తరచూ వాడికి ఇలా ఇన్ఫెక్షన్‌ రావడం మమ్మల్ని ఆందోళనలో పడేస్తోంది. దయచేసి వాడి విషయంలో మాకు తగిన సలహా ఇవ్వండి.– ప్రవీణ్‌కుమార్, వరంగల్‌
మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్‌ను యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ అంటారు. ఇది మూత్ర విసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రావచ్చు. అంటే మూత్రం తయారయ్యే మూత్రపిండాల వద్ద గానీ లేదా మూత్రపిండాల నుంచి మూత్రాశయానికి (బ్లాడర్‌కు) తీసుకువచ్చే నాళాల్లో (యురేటర్స్‌లో) గానీ లేదా మూత్రాశయం నుంచి మూత్రాన్ని  బయటకు విసర్జించేందుకు ఉపయోగపడే నాళమైన యురెథ్రాలో గానీ... ఇలా ఎక్కడైనా ఇన్ఫెక్షన్‌ వస్తే దాన్ని యురినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌గా చెబుతారు. అంటే... ఇన్ఫెక్షన్‌కు కలగజేసే సూక్ష్మక్రిములు ఈ మూత్రవిసర్జన వ్యవస్థలోకి చేరి ఎక్కడైనా ఇన్ఫెక్షన్‌ కలిగిస్తాయన్నమాట. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్‌ కలిగించే జీవులు బ్లాడర్‌ నుంచి పై వైపునకు ప్రసరించి మూత్రపిండాలకు (కిడ్నీలకు) హాని చేయవచ్చు.

కిడ్నీలలో అబ్‌నార్మాలిటీ ఉన్న పిల్లల్లో (ఉదాహరణకు అబ్‌స్ట్రక్షన్, విసైకో యురెటెరిక్‌ రిఫ్లక్స్‌), కిడ్నీలలో రాళ్లు, మూత్రాశయం (బ్లాడర్‌) పూర్తిగా ఖాళీ కాకుండా అక్కడ  కొంత మూత్రం మిగిలిపోవడం, మలబద్దకం వంటి సమస్యలు ఉన్న పిల్లల్లో మిగతావారి కంటే ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ.

యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌కు గురైన పిల్లల్లో తీవ్రమైన జ్వరం మొదలుకొని అనేక లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, కడుపునొప్పి వంటివి కనిపించవచ్చు. ఈ ఇన్ఫెక్షన్‌ కిడ్నీకి పాకి అక్కడ కిడ్నీని దెబ్బతీయడం జరిగితే అది కిడ్నీని శాశ్వతంగా దెబ్బతీయవచ్చు. అందుకే యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లల్లో మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్‌ కనిపిస్తే... అందునా అది దీర్ఘకాలికంగా ఉండే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన మందులు తీసుకోవాలి. డాక్టర్లు ఈ సమస్యను అదుపు చేయడానికి నోటి ద్వారా తీసుకునేవి లేదా నరం (రక్తనాళం) ద్వారా ఇచ్చే యాంటీబయాటిక్స్‌ను ఇస్తారు. ఒకవేళ తగినంత మెరుగుదల కనిపించనప్పుడు గానీ లేదా వైద్య పరీక్షల తర్వాతగానీ  అవసరాన్ని బట్టి డాక్టర్లు 48 నుంచి 72 గంటల్లో యాంటీబయాటిక్స్‌ను మార్చి ఉపయోగిస్తారు. ఇలా మార్చి మార్చి యాంటీబయాటిక్స్‌ను ఉపయోగిస్తూ, వాటి కోర్సు పూర్తయ్యాక మళ్లీ వైద్య పరీక్షలు చేయిస్తూ ఫలితాలను సమీక్షిస్తూ, చికిత్సను కొనసాగిస్తుంటారు. మీ బాబు విషయంలో మీరు పీడియాట్రిక్‌ నెఫ్రాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి.

డాక్టర్‌ వి.వి.ఆర్‌. సత్యప్రసాద్, కన్సలెట్‌ పీడియాట్రిక్‌ నెఫ్రాలజిస్ట్,
రెయిన్‌బో చిల్డ్రెన్స్‌ హాస్పిటల్, హైదరాబాద్‌

గుండె జబ్బులున్నవారు పాటించాల్సిన జాగ్రత్తలివి!
కార్డియాలజీ కౌన్సెలింగ్‌

నా వయసు 36 ఏళ్లు. మా దూరపు బంధువుల్లో ఇద్దరుముగ్గురు చాలా కొద్దికాలంలోనే గుండెజబ్బుతో చనిపోయారు. దాంతో నాకు ఆందోళన పెరిగింది. గుండెజబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయగలరు. – వెంకటరామ్, మహబూబ్‌నగర్‌
గుండెజబ్బులు ఉన్న కుటుంబ చరిత్ర గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ప్రధాన సూచనలివి...
► మీలా చిన్న వయసు వారైనప్పటికీ ఇప్పట్నుంచే తరచూ కొలెస్ట్రాల్‌ పరీక్షలు చేయిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ ఉండటం మేలు. డాక్టర్‌ సలహాల మేరకు కొన్ని మందులు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకుంటూ ఉండాలి.
►గుండెపోటు రావడానికి డయాబెటిస్‌ ఒక ప్రధాన కారణం. అందుకే ఆ సమస్య ఉన్నవారు రక్తంలోని చక్కెరను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి. రోజూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ,  డాక్టర్‌ సూచన మేరకు వారు సూచించిన వ్యవధిలో క్రమం తప్పకుండా రక్తంలోని చక్కెరలను పరీక్షించుకుంటూ ఉండాలి.
►కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాన్ని బాగా తగ్గించాలి.
► పొగ తాగే అలవాటును పూర్తిగా వదిలేయాలి. అలాగే పొగాకుకు సంబంధించిన ఉత్పాదనలు, వస్తువులను పూర్తిగా మానేయాలి. గుండెజబ్బుల నివారణలో ఇది చాలా ప్రధానం.
► డాక్టర్‌ సూచనల మేరకు శరీరానికి మరీ శ్రమ కలిగించకుండా చేసే వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి.
► మన ఒంటి బరువును పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
► రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి.
► మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఒంటికి అందేలా సమతులాహారం తీసుకోవాలి.
►ఆరోగ్యకరమైన జీవనశైలిని తప్పనిసరిగా పాటించాలి.

ఈ కొన్ని జాగ్రత్తలతోనే చాలావరకు గుండెజబ్బులను నియంత్రించవచ్చు. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు తమ డాక్టర్లు సూచించిన మందులను తప్పక వాడుతుండాలి. ఆరోగ్యంలో ఏమాత్రం తేడా ఉన్నట్లు అనిపించినా డాక్టర్‌ను  తప్పక సంప్రదించాలి. ఈ కొద్దిపాటి సూచనలు పాటిస్తే గుండెపోటు వంటి ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులను నివారించడం చాలావరకు నివారించవచ్చు.

డాక్టర్‌
హేమంత్‌ కౌకుంట్ల కార్డియోథొరాసిక్‌ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement