
మరణంలోనూ వీడని బంధం
బషీరాబాద్(రంగారెడ్డి జిల్లా): ఒకే గడియలో భార్యాభర్తలు మృతి చెందిన ఘటన బషీరాబాద్ మండలం దామర్‌చెడ్‌లో గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పగిడ్యాల ఆశన్న(65), బుగ్గమ్మ(60) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. బుగ్గమ్మ భర్త ఆశన్నకు విరేచనాలు కావడంతో మంగళవారం ఉదయం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
భర్త అపస్మారక స్థితిలో ఉండటంతో బుగ్గమ్మ భర్త వద్దే ఉండి సేవలు చేసింది. ఈ క్రమంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన బుగ్గమ్మ ఆస్పత్రిలోనే కుప్పకూలి మృత్యువాత పడింది. దీంతో కుటుంబీకులు ఆమెను ఆస్పత్రి నుంచి గ్రామానికి తరలిస్తుండగానే ఆశన్న సైతం మృతి చెందాడు. గంట వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.