ఇంకా పూర్తికాని రైతు భరోసా విధివిధానాల రూపకల్పన కసరత్తు
సాగయిన భూమికే పెట్టుబడి
సాయం ఆలోచనపై ఉప సంఘం సభ్యుల భిన్నాభిప్రాయాలు
వానాకాలం, యాసంగి సీజన్లలో పంటల హెచ్చుతగ్గుల అంశంపై చర్చ
ఖరీఫ్‌లో పత్తి వేసి, రబీలో నీరులేక పంట వేయని భూములకు సాయం ఎలా?
ఆయిల్ పామ్, మామిడి, ఇతర తోటలకు పెట్టుబడి సాయం ఎలా ఇవ్వాలి
రైతు భరోసా ఎంత మేర, ఎలా ఇవ్వాలి?.. ఒకేసారా? రెండు సీజన్లకు విడివిడిగానా?
మంత్రి వర్గ ఉపసంఘంలో సుదీర్ఘంగా చర్చలు.. త్వరలో మరోమారు భేటీకి నిర్ణయం
పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రైతులకు పెట్టుబడి సాయం అందించే ‘రైతు భరోసా’పై కాంగ్రెస్ సర్కారు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. సంక్రాంతి నుంచే రైతు భరోసా సొమ్మును రైతులకు అందిస్తామని సర్కారు ప్రకటించినా.. విధి విధానాల రూపకల్పన ఇంకా ఓ కొలిక్కి రాలేదు. రైతు భరోసాకు ఎవరు అర్హులు? ఎవరు అనర్హులనే దానిపై ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నా.. ఎలా ఇవ్వాలి, ఎంత మేర ఇవ్వాలి, ఉద్యాన పంటలకు పెట్టుబడి సాయం ఎలా అందించాలి, ఇందుకోసం ఏ విధానాన్ని అనుసరించాలన్న అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ క్రమంలో రైతుభరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆదివారం మళ్లీ సమావేశమై చర్చించింది.
అధికాదాయ వర్గాలు మినహా..
ఐటీ చెల్లింపుదారులు, సివిల్ సర్వీస్, గ్రూప్–1 స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు వంటి వారికి మినహా సాగుభూమి ఉన్న ప్రతి ఒక్కరికీ రైతు భరోసా అందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినట్టు సమాచారం. ఎన్ని ఎకరాలకు సీలింగ్ అమలు చేయాలనే అంశాన్ని సీఎంకే వదిలేసినట్టు తెలిసింది. అయితే 10 ఎకరాల్లోపు సొంత భూమి ఉన్న రైతులందరికీ సాగు చేసిన కమతాలను లెక్కకట్టి పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఎంత భూమి ఉన్నా ప్రభుత్వ నిర్ణయించిన సీలింగ్ లోపు అందరికీ రైతుభరోసా ఇవ్వాల్సిందేనని ఉప సంఘం సభ్యులు పేర్కొన్నట్టు తెలిసింది. కుటుంబం యూనిట్‌గా రైతు భరోసాను అమలు చేయాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని... పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మార్గదర్శకాలను రైతుభరోసాకు వర్తింపజేస్తే వ్యతరేకత వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడినట్టు సమాచారం.
సాగుభూములకు సరే.. పక్కాగా నిర్ధారణ ఎలా?
సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. సాగును నిర్ధారించే అంశంపైనా ఉప సంఘం భేటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. ఖరీఫ్‌లో సాగు ఎక్కువగా ఉంటే రబీలో తగ్గుతుందని.. ఖరీఫ్‌లో పత్తి సాగు చేసే రైతులు రబీలో నీరు లేక ఏ పంట వేయక బీడు పెట్టే పరిస్థితి మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాద్ తదితర ఉమ్మడి జిల్లాల్లో ఉందని సభ్యులు గుర్తు చేసినట్టు తెలిసింది. వారికి ఎలా రైతు భరోసా వర్తింపజేస్తారనే అంశం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. అంతేగాకుండా ఆయిల్ పామ్, మామిడి, ఇతర పండ్ల తోటలకు సంబంధించి రైతు భరోసాను ఎలా వర్తింపజేస్తారనే విషయంలోనూ స్పష్టత రాలేదని తెలిసింది.
ఒకసారి పంట వేస్తే మళ్లీ పెట్టుబడి అవసరం ఉండదు కాబట్టి ఇలాంటి భూములకు రైతుభరోసా ఎలాగనే సందేహాలు వ్యక్తమైనట్టు సమాచారం. ఇక ఖరీఫ్ సీజన్‌లో మాత్రమే సాగయ్యే భూములకు రెండు సీజన్లలో రైతుభరోసా ఇవ్వడంపైనా సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలిసింది. మరోవైపు సీజన్‌కు రూ.7,500 చొప్పున ఒకేసారి రూ.15 వేలు ఇవ్వాలా? లేక విడివిడిగా ఇవ్వాలా అన్న అంశం ప్రస్తావనకు వచ్చిందని... రూ.7,500 కాకుండా సీజన్‌కు రూ.6,000 చొప్పున ఒకేసారి రెండు సీజన్ల మొత్తాన్ని రైతు ఖాతాల్లో వేయాలనే ప్రతిపాదన కూడా వచ్చినట్టు సమాచారం.
రోడ్లు, నాలా కన్వర్షన్లు, కొత్త రిజిస్ట్రేషన్లపై ఫోకస్!
రోడ్లు, నాలా కన్వర్షన్ అయిన భూములు, పెద్ద మొత్తంలో కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన భూములకు రైతు భరోసా నిలిపివేయాలని ఉపసంఘం నిర్ణయించినట్టు తెలిసింది. అలాగే గుట్టలు, కొండలు, చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో రిజిస్టరైన భూములకు కూడా ఇవ్వొద్దనే భావనకు వచ్చినట్టు సమాచారం. మొత్తంగా ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలు వేసిన భూములకు సంబంధించి మాత్రమే రైతు భరోసా అందించేలా విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.
రైతులెవరూ నష్టపోకుండా ‘రైతుభరోసా’: భట్టి
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.72,659 కోట్లు కేటాయించడమే తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు మాట ఇచ్చిన విధంగా రైతు భరోసా ఇచ్చి తీరుతామన్నారు. రైతులెవరూ నష్టపోకుండా రైతు భరోసా విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఆదివారం సచివాలయంలో రైతు భరోసా మంత్రివర్గ ఉపసంఘం భేటీ కేబినెట్ సబ్‌కమిటీ భేటీ అయింది. భట్టితోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు వ్యవసాయ శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. యాసంగి పంటకు రైతు భరోసా ఇచ్చేందుకు ఖరారు చేయాల్సిన విధివిధానాలపై రెండు గంటల పాటు చర్చించారు. గతంలో పెట్టుబడి సాయం పథకం అమలు నుంచి నేటి వరకు ఏం జరిగింది? రైతుల అభిప్రాయాలు ఏమిటన్న అంశాలను పరిశీలించారు.
పలు అంశాలపై వ్యవసాయ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రుణమాఫీ కింద ఇప్పటికే రూ.21వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామని, రైతు కమిషన్‌ను నియమించామని, రైతు వేదికలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పాలన చేయడం కాంగ్రెస్ పేటెంట్ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment