ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ప్రజలకు ఎన్నెన్నో హామీలతో కూడిన మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నా, వాటిలో ఎక్కడా కూడా భూమి ఎజెండా కావడం లేదు. ఇందుకు కారణాలేవైనా తెలంగాణలో భూమి చుట్టూ తిరగాల్సిన రాజకీయం డబ్బు చుట్టూ తిరుగుతోందని వర్తమాన పరిస్థితులను బట్టి అర్థమవుతోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, రాజకీయ పార్టీలు దృష్టి సారించాల్సిన అంశాలపై తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టో–2023 పేరుతో తెలంగాణ సమాఖ్య 15 కీలక అంశాలను తెరపైకి తెచ్చింది. లీఫ్స్ సంస్థ, గ్రామీణ న్యాయపీఠం, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం నిర్వహించిన తెలంగాణ భూమి కారవాన్, భూన్యాయ శిబిరాలు, న్యాయగంట, చర్చా వేదికల ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల అభిప్రాయాల ఆధారంగా ఈ డిమాండ్లను పార్టీల ముందుంచింది.
మూడే కీలకం..
ఆ ఒకటే రికార్డు–ఒకటే పట్టా–ఒకటే చట్టం నినాదాన్ని ఎన్నికల ఎజెండా చేయాలని భూచట్టాల నిపుణులు చెబుతున్నారు. ఇది సాధ్యమైతే 90 శాతం సమస్యలు పరిష్కారమైనట్లేనని అంటున్నారు. ఒకటే రికార్డు కావాలంటే భూముల సమగ్ర సర్వే జరగాలి. ఒకటే పట్టా కావాలంటే ప్రభుత్వమే టైటిల్ గ్యారంటీ ఇవ్వాలి. ఒకటే చట్టం కావాలంటే రెవెన్యూ కోడ్ అమల్లోకి రావాలి. ఇవి మూడూ జరగాలంటే రాజకీయ నిబద్ధత కావాల్సిందే.
వీటితో పాటు లా కమిషన్, సర్వీస్ కమిషన్, స్టేట్‌ఫైనాన్స్ కమిషన్ తరహాలో భూ కమిషన్ ఏర్పాటు డిమాండ్ కూడా ఉంది. కౌలు–వ్యవసాయ భూముల చట్టం (1950) ప్రకారం అధికారులు, నిపుణులు, ప్రజాప్రతినిధులతో ఈ కమిషన్ ఏర్పాటు తప్పనిసరి. అయితే 1950 నుంచి ఓ దశాబ్దంపాటు అమల్లో ఉన్న ఈ కమిషన్ ఆ తర్వాత క్రమంగా కనుమరుగైంది.
భూమికి సంబంధించిన ఇతర డిమాండ్లు ఇవి
♦ ఆర్‌ఓఆర్ చట్టాన్ని సవరించి పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించి పట్టాలివ్వాలి.
♦ పోడు సాగు చేస్తున్న అర్హులైన గిరిజనులందరికీ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి హక్కు పత్రాలను అందించాలి.
♦ భూపంపిణీకి ప్రత్యేక పథకం రూపొందించాలి. సీలింగ్ చట్టంతో మిగులు భూమిని భూమిలేని వ్యవసాయ పేద కుటుంబాలకు పునఃపంపిణీ చేయాలి.
♦ భూవివాదాల పరిష్కారానికి జిల్లాకో భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. రాష్ట్ర స్థాయిలో అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటుతోపాటు పేదలకు ఉచిత న్యాయ సాయం, పారాలీగల్ పథకాలను అమలు చేయాలి.
♦ ధరణి సమస్యల పరిష్కారం కోసం గ్రామ స్థాయిలో రెవెన్యూ కోర్టులు నిర్వహించాలి. కంప్యూటర్‌లో ఉన్న భూరికార్డులు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండాలి. రికార్డుల్లో తప్పులను సత్వరమే సవరించేలా సాఫ్ట్‌వేర్ రూపొందించాలి. కంప్యూటర్‌లో ఉన్న రికార్డులకు భద్రత కల్పించాలి.
♦ నిషేధిత జాబితా (22ఏ)లో పొరపాటున నమోదైన పట్టా భూములను వెంటనే జాబితా నుంచి తొలగించాలి.
♦ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భూపరిపాలన యంత్రాంగాన్ని పటిష్టపర్చాలి. అవసరాలకు తగినట్టు వారికి తగిన శిక్షణ ఇవ్వడం కోసం భూ అకాడమీని ఏర్పాటు చేయాలి.
♦ భూవిధానం, భూమి వినియోగ విధానం, 2014లో చేసిన భూసేకరణ చట్టం యథాతథంగా అమలు చేయాలి.
♦ కౌలుదారులను సాగుదారులుగా గుర్తించి వారికి పట్టా రైతులుగా అందాల్సిన అన్ని రకాల సాయం అందించాలి. కొత్త కౌలు చట్టం రూపొందించాలి.
‘సర్వే’జనా..!
భూముల సమగ్ర సర్వే కూడా రాజకీయ ఎజెండా కావాల్సిందేననేది రైతుహితుల అభిప్రాయం. గుజరాత్‌తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్‌లలో భూసర్వే జరిగింది. ఏపీలో జరుగుతున్న సర్వే దక్షిణాదిలో ఉత్తమమైన సర్వేగా గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశంలోనే భూముల సమగ్ర సర్వే చేసిన మొదటి రాష్ట్రంగా గుర్తింపు పొందుతుంది. తెలంగాణలో ఈ సర్వే చేసేందుకు 2016లో రూ.580 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇప్పుడు అది రూ.800 కోట్లకు చేరింది.
శాటిలైట్, డ్రోన్, డీజీపీఎస్ (డిజిటల్ జియో పొజిషనింగ్ సిస్టమ్స్)ల ద్వారా గ్రామ సరిహద్దులు, హైస్కేల్ మెజర్‌మెంట్స్ తీసుకొని యునీక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఎల్‌పిన్) లేదా ల్యాండ్ పార్సిల్ నంబర్ ఇవ్వడం ద్వారానే భూమి హక్కులకు భద్రత కలగనుంది. ఇక మరో కీలకాంశం అసైన్డ్ భూములకు పట్టా హక్కుల కల్పన. ప్రస్తుతం బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో, కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌లో ఈ అంశం పొందుపర్చారు.
భూ బదలాయింపు (పీఓటీ) చట్టాన్ని సవరించడం ద్వారా ఆ భూములు కేటాయించిన 20 ఏళ్ల తర్వాత ఏపీ, కర్ణాటకల్లో, 15 ఏళ్ల తర్వాత తమిళనాడులో పూర్తిస్థాయి యాజమాన్య హక్కులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయి. తెలంగాణలో కూడా 1950 నుంచి పేదలకు అసైన్ చేసిన 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. ఈ భూములపై హక్కులకల్పన రాజకీయ ఎజెండా అయితే పేదల ఆర్థిక ముఖచిత్రంలో ఊహించని మార్పులు రానున్నాయి.
-మేకల కళ్యాణ్ చక్రవర్తి
Comments
Please login to add a commentAdd a comment