
సర్వేపై గుడిపాల మండలం, పాపసముద్రం గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు (ఫైల్)
చిత్తూరు కలెక్టరేట్: ‘భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలి. పచ్చని గ్రామాల మధ్య కక్షలు, కార్పణ్యాలకు తావులేకుండా చూడాలి. అన్నదాతల మధ్య అనుబంధాన్ని నెలకొల్పాలి. సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసి వారి భూములకు సర్వహక్కులు కల్పించాలి. ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు పత్రం ఇవ్వాలి. రికార్డులను సైతం సమూలంగా మార్పు చేయాలి’.. అన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న భూ రక్ష– శాశ్వత భూ హక్కు పథకానికి శ్రీకారం చుట్టింది. వందేళ్ల తర్వాత దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా సమగ్ర భూ రీ సర్వేని ప్రారంభించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొదటి దశ సర్వేను దిగ్విజయంగా పూర్తి చేసి.. రెండో దశ సర్వేకు శ్రీకారం చుట్టింది.
27 రెవెన్యూ గ్రామాల్లో రెండో దశ
ఉమ్మడి జిల్లాలో చంద్రగిరి, గుడిపాల, జీడీనెల్లూరు, వాల్మీకిపురం మండలాల్లోని నరసింగాపురం, ముత్తుకూరుపల్లె, అగరమంగళం, జమ్మాలపల్లెల్లో మొదటి దశలో పైలెట్ ప్రాజెక్టు కింద భూ రీసర్వే పూర్తిచేశారు. ప్రస్తుతం రెండో దశలో 27 రెవెన్యూ గ్రామాల్లో సర్వే ప్రారంభించగా, ఇప్పటికి ఆరు గ్రామాల్లో పూర్తిచేశారు. రోవర్లకు సంబంధించి జిల్లాలో 7 కార్స్‌బేస్ స్టేషన్లు అనుసంధానం చేశారు. 2023 డిసెంబర్ నాటికి సచివాలయాల్లో రికార్డులు, సేవలు అందుబాటులోకి రావడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడుతున్నారు. మొదటి దశలో పూర్తి చేసిన భూ రికార్డులను గత జనవరి 18న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అంకితం చేశారు.
అత్యాధునిక సాంకేతికత
భూ రీ సర్వేకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ప్రతి భూ కమతానికి విడిగా అక్షాంశ, రేఖాంశాలు, విశిష్ట గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూ వివరాలు తెలిపే క్యూఆర్‌కోడ్‌తో కూడిన భూ కమత పటాన్ని జారీచేస్తారు. గ్రామ స్థాయిలో భూ రికార్డులను క్రోడీకరించి, మ్యాప్‌లు (భూ కమతాలతో కూడిన గ్రామ పటం) ఇతర భూ రికార్డులు గ్రామాల్లోనే అందుబాటులో ఉంచనున్నారు. మీ భూమి మా హామీ (మహాయజ్ఞాన్ని) చేపట్టి భూములు, ఆస్తుల రక్షణకు చర్యలు చేపడుతున్నారు.
ప్రయోజనం ఇలా...
శాశ్వత భూహక్కు: సింగిల్ విండో పద్ధతిలో ప్రతి ఆస్తికి ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూ హక్కు పత్రం జారీచేస్తారు. భూ లావాదేవీలు, బ్యాంకు రుణాలు సులభం అవుతాయి.
భూ రక్ష : ప్రతి భూ కమతానికి ఉచితంగా భూ రక్ష హద్దు రాళ్లు వేస్తారు. డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు తావుండదు. దళారీ వ్యవస్థ కనుమరుగు అవుతుంది. లంచాలకు చోటుఉండదు.
భద్రత : నకిలీ పత్రాలకు ఇక తావు ఉండదు. భూ యజమానికి తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులకు వీలుపడదు. అవసరమైన చోట సబ్ డివిజన్ మార్పులు చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్లు.
పారదర్శకత : సర్వే ప్రతి అడుగులో భూ యజమానుల భాగస్వామ్యం, మండల మొబైల్ మేజిస్ట్రేట్ బృందాల ద్వారా అభ్యంతరాల పరిష్కారం, తొలిసారిగా గ్రామ కంఠాల్లోని స్థిరాస్తులు సర్వే, యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తారు.
గ్రామాల చెంతకే సేవలు : ఇకపై గ్రామ సర్వేయర్ల ద్వారానే ఎఫ్‌లైన్ దరఖాస్తులు 15 రోజుల్లో, పట్టా, సబ్‌డివిజన్ దరఖాస్తులు 30 రోజుల్లో పరిష్కరించనున్నారు.గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తులు రిజిస్ట్రేషన్లు భూ సమాచారాన్ని ఎవరైనా, ఎప్పుడైనా పొందవచ్చు. గ్రామాల్లో తరతరాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు ఇక తీరినట్లే.
రీ సర్వే బృహత్తర పథకం
జగనన్న శాశ్వత భూ హక్కు– భూరక్ష పథకం రాష్ట్ర చరిత్రలో వందేళ్ల తర్వాత చేపట్టిన ఒక బృహత్తర పథకం. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. రైతులకు శాశ్వత భూ హక్కుతో పాటు వారి భూములకు రక్షణ కల్పించే పథకం ఇది. ఈ సర్వేని మూడు దశల్లో 1/3 వంతు గ్రామాల్లో నిర్వహిస్తున్నాం. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి సర్వే పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నాం.
– హరినారాయణన్, కలెక్టర్
నాలుగు బృందాల ద్వారా సర్వే
గుడిపాల మండలం, పాపసముద్రం గ్రామంలో నాలుగు బృందాలు రీ సర్వే చేస్తున్నాయి. రోజుకు కనీసం ఒక బృందం 20 ఎకరాలు రీ సర్వే చేయాల్సి ఉంటుంది. సరిహద్దు రాళ్లు నాటడం, వాటిలో గ్రామ సరిహద్దులు తెలిపే విధంగా, గ్రామాల కూడలి అయితే సరిహద్దు తెలిపే విధంగా మూడు సరిహద్దు రాళ్లు నాటి తెలియజేస్తున్నాం. ప్రభుత్వ భూమి, పట్టా భూమి, కాలువలు, చెరువులు గుర్తింపు చేసి సంబం«ధిత శాఖకు సమాచారం అందిస్తున్నాం.
– కిరణ్‌కుమార్, సర్వేయర్, పాపసముద్రం, గుడిపాల మండలం.
Comments
Please login to add a commentAdd a comment