
సచివాలయ కొలువులకు భద్రత లభించనుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా మారాలన్న సిబ్బంది కల సాకారం కానుంది. ఉద్యోగుల భవితకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రొబేషన్‌ను పూర్తి చేసుకున్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేసేందుకు అధికారం యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత పొందిన వారి జాబితాను సిద్ధం చేసింది. దీంతో సచివాలయ సిబ్బంది ఆనంద డోలికల్లో మునిగితేలుతున్నారు. ప్రజలకు సేవలందించే భాగ్యంతోపాటు భవితకు భరోసా లభించిందని హర్షిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని స్పష్టం చేస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్: ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రలో నిలిచిపోయే సువర్ణ అధ్యాయానికి నాంది పలికారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతూ జిల్లా వ్యాప్తంగా 1,312 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. అందులో 11,969 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. రెండు విడతల్లో సచివాలయ ఉద్యోగాలకు ఎంపిక పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,319 మంది ఉద్యోగాలు సాధించారు.
1,650 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రామ సచివాలయాల్లో 11 పోస్టుల్లో పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్–6, వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, ఏఎన్‌ఎం, వెటర్నరీ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, సర్వేయర్, వీఆర్వో, మహిళా పోలీస్, ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల్లో ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది.
వార్డు సచివాలయాల్లో 10 పోస్టుల్లో అడ్మిని్రస్ట్రేటివ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సెక్రటరీ, హెల్త్‌సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ, శానిటేషన్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ, అమెనిటీస్ సెక్రెటరీ, ఎనర్జీ సెక్రటరీలను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ప్రొబేషన్ కసరత్తును ఉన్నతాధికారులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. కలెక్టర్ హరి నారాయణన్ ఇటీవల ఈ కసరత్తుపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమా వేశం నిర్వహించి పలు సూచనలు జారీచేశారు. ప్రొబేషన్ వివరాల నివేదికను ఈ నెల 31లోపు ప్రభుత్వానికి పంపనున్నారు.
రెండేళ్లు పూర్తయిన వారికి ప్రొబేషన్
జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండేళ్లు పూర్తి చేసుకున్న సచివాలయ ఉద్యోగుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఆయా శాఖల పరిధిలో సచివాలయ ఉద్యోగుల యాంటిసిడెంట్ వెరిఫికేషన్‌ను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. రెండవ విడత పరీక్షలో ఎంపికైన వారికి రెండేళ్ల ప్రొబేషన్ ఇంకా పూర్తి కాకపోవడంతో వారికి వచ్చే దశలో ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ కసరత్తును జెడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి, అర్బన్ ప్రాంతాల్లోని వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ కసరత్తును చిత్తూరు మున్సిపల్ కమిషనర్ అరుణ పర్యవేక్షించాలని కలెక్టర్ హరినారాయణన్ ఆదేశాలు జారీ చేశారు.
పకడ్బందీగా కసరత్తు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కసరత్తును పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నాం. మొదటి దశలో ఉద్యోగాల్లో చేరిన వారికి నిబంధనల ప్రకారం ప్రొబేషన్‌కు అర్హులుగా గుర్తిస్తాం. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పకడ్బందీగా కసరత్తు నిర్వహించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించాం. ఇటీవల సమావేశం నిర్వహించి ప్రొబేషన్ కసరత్తుపై పలు సూచనలు చేశాం.
– హరి నారాయణన్, కలెక్టర్, చిత్తూరు
నా పేరు హరిబాబు. పూతలపట్టు నియోజకవర్గం నాగవాండ్లపల్లి గ్రామ సచివాలయంలో సెక్రటరీగా పనిచేస్తున్నా. ప్రొబేషన్ పూర్తి చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది. ప్రజల ఇంటి వద్దకే పరిపాలన కోసం సచివాలయాలను ఏర్పాటు చేసి మాకు ఉద్యోగాలు కల్పించిన సీఎంకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలను అర్హులకు అందజేయడంలో పారదర్శకత పాటిస్తాం.
నా పేరు జీఎస్.మధురవాణి. ఎంఎస్‌సీ పూర్తయింది. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం–2 గ్రామ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నా. గతంలో ప్రైవేట్ కళాశాలలో పనిచేశా. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం లభించింది. నా జీవితానికి భరోసా దక్కింది. తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. నేను విధుల్లో చేరి రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి చేసుకున్నా. త్వరలో నన్ను రెగ్యులర్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆశయాల మేరకు రైతు భరోసా కేంద్రం ద్వారా దేశానికి వెన్నెముక అయిన రైతులకు సేవ చేయడం ఆనందంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment