కత్తితో బాపురెడ్డి, గాయపడ్డ లక్ష్మారెడ్డిని ఆటోలో తరలిస్తున్న స్థానికులు
సాక్షి, భీమిని(నెన్నెల) : నెన్నెల మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డిపై అన్న బాపురెడ్డి బుధవారం నెన్నెల తహసీల్దార్ కార్యాలయంలోనే వేట కత్తితో హత్యాయత్నం చేశాడు. భూతగాదనే అన్నదమ్ముల మధ్య గొడవకు దారితీసింది. బొప్పారం గ్రామశివారులో సర్వేనంబర్707/1లో 3.14ఎకరాలు, 708 సర్వే నంబర్‌లో 4.36ఎకరాలు ఉన్న ఈ భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గతకొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బాపురెడ్డి తన వాటలోని కొంత భూమిని ఇతరులకు అమ్ముకున్నాడు. ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయించేందుకు తమ్ముడు సంతకం చేయాల్సి ఉంది.
కాగా బుధవారం రిజిస్ట్రేషన్ కోసం నెన్నెల తహసీల్దార్ కార్యాలయానికి అన్నదమ్ములిద్దరు వేర్వేరుగా వచ్చారు. తమ్ముడు అభ్యంతరం చెప్పాడని ముందుగానే ఊహించిన బాపురెడ్డి పథకం ప్రకారం తన వెంట ఓ కవర్‌లో కారంపొడి, వేటకత్తి తెచ్చుకున్నాడు. తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ విషయమై మాటమాట పెరిగి గొడవకు దిగారు. అంతలోనే అందరు చూస్తుండగానే లక్ష్మారెడ్డి కళ్లలో కారంకొట్టిన బాపురెడ్డి కత్తితో దాడిచేశాడు. ఇంతలోనే కొందరు యువకులు తేరుకొని బాపురెడ్డిని అడ్డుకున్నారు. అప్పటికే లక్ష్మారెడ్డి తలపై రెండుచోట్ల గాయాలయ్యాయి. యువకులు ధైర్యం చేసి అడ్డుకోకపోతే లక్ష్మారెడ్డి ప్రాణాలు దక్కేవి కావని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే తహసీల్దార్ రాజలింగు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాపురెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మారెడ్డికి నెన్నెల పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నెన్నెల ఎస్సై చందర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment