Nennela
-
ఆదిలాబాద్: బ్యాంకు సిబ్బందికి షాకిచ్చిన దొంగ
నెన్నెల: ఓ ఆగంతకుడు ఆశగా అర్ధరాత్రి బ్యాంకులో చొరబడ్డాడు. ఆబగా నగదు కోసం వెతికాడు. క్యాష్కౌంటరేమో ఖాళీగా కనిపించింది. స్ట్రాంగ్‌రూం తాళం యమా స్ట్రాంగ్‌గా ఉండటంతో తెరుచుకోలేదు. ఎక్కడ వెతికినా ఏమీ దొరకలేదు. ఆనక చేసేదేమీలేక ‘గుడ్ బ్యాంక్.. ఒక్క రూపాయి కూడా దొరకలేదు’అని కితాబు ఇస్తూ ఓ పేపర్‌పై రాసి వెళ్లిపోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో చోటు చేసుకుంది. ముసుగు వేసుకుని గురువారం అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిన ఓ దుండగుడు బ్యాంకు తలుపు తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించాడు. క్యాష్ కౌంటర్లో చిల్లిగవ్వ కూడా లభించలేదు. ఎంత ప్రయత్నించినా స్ట్రాంగ్‌రూమ్ తాళం తెరుచుకోలేదు. ఇలా 15 నిమిషాలు బ్యాంకులో ఉండి చోరీకి యత్నించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోతుపోతూ టేబుల్‌పై ఉన్న ఓ పేపర్ మీద ‘గుడ్ బ్యాంకు, రూపాయి కూడా దొరకలేదు. నన్ను పట్టుకోవద్దు. నా ఫింగర్‌ప్రింట్ కూడా దొరకదు’అని మార్కర్‌తో రాశాడు. శుక్రవారం ఉదయం బ్యాంకు ఆవరణలో ఊడ్చేందుకు వచ్చిన స్వీపర్ రాములు బ్యాంక్ తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి మేనేజర్ వెంకటేశ్వర్‌రెడ్డికి సమాచారం ఇచ్చాడు. మేనేజర్ వెంటనే బ్యాంకుకు చేరుకుని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు నగదు చోరీ కాకపోవడంతో సిబ్బంది, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బెల్లంపల్లి ఏసీపీ సదయ్య బ్యాంక్‌ను సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
రెండ్రోజుల్లో యువకుడు వివాహం.. పెళ్లి పత్రికలు పంచుతూ..
సాక్షి, మంచిర్యాల: మరో రెండ్రోజుల్లో ఆ యువకుడు పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. భాగస్వామితో కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్న కలలు కల్లలయ్యాయి. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కాసిపేట మండలం సోమగూడెం వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో నెన్నెల మండలం చిన్నలంబాడితండాకు చెందిన దరావత్ రమేష్(23) మృతిచెందాడు. సోమవారం ఎస్సై నరేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెన్నెల మండలం చిన్నలంబాడితండాకు చెందిన దరావత్ రమేష్ పెళ్లి ఈ నెల 20న జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలు పంచడానికి మోటార్‌సైకిల్‌పై వెళ్లాడు. సోమగూడెంలో తమ బంధువులకు పత్రికలు పంచి తిరిగి మోటార్‌సైకిల్‌పై నెన్నెలకు బయల్దేరాడు. కాసిపేట మండలం పెద్దనపల్లి శివారులో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో రమేష్ అక్కడికక్కడే చనిపోయాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. చదవండి: రేకుల ఇంటికి ఏడు లక్షల రూపాయల కరెంట్ బిల్లు.. అసలు విషయమిదే! -
వేటకత్తితో తమ్ముడిపై అన్న దాడి
సాక్షి, భీమిని(నెన్నెల) : నెన్నెల మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డిపై అన్న బాపురెడ్డి బుధవారం నెన్నెల తహసీల్దార్ కార్యాలయంలోనే వేట కత్తితో హత్యాయత్నం చేశాడు. భూతగాదనే అన్నదమ్ముల మధ్య గొడవకు దారితీసింది. బొప్పారం గ్రామశివారులో సర్వేనంబర్707/1లో 3.14ఎకరాలు, 708 సర్వే నంబర్లో 4.36ఎకరాలు ఉన్న ఈ భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గతకొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బాపురెడ్డి తన వాటలోని కొంత భూమిని ఇతరులకు అమ్ముకున్నాడు. ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయించేందుకు తమ్ముడు సంతకం చేయాల్సి ఉంది. కాగా బుధవారం రిజిస్ట్రేషన్ కోసం నెన్నెల తహసీల్దార్ కార్యాలయానికి అన్నదమ్ములిద్దరు వేర్వేరుగా వచ్చారు. తమ్ముడు అభ్యంతరం చెప్పాడని ముందుగానే ఊహించిన బాపురెడ్డి పథకం ప్రకారం తన వెంట ఓ కవర్లో కారంపొడి, వేటకత్తి తెచ్చుకున్నాడు. తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ విషయమై మాటమాట పెరిగి గొడవకు దిగారు. అంతలోనే అందరు చూస్తుండగానే లక్ష్మారెడ్డి కళ్లలో కారంకొట్టిన బాపురెడ్డి కత్తితో దాడిచేశాడు. ఇంతలోనే కొందరు యువకులు తేరుకొని బాపురెడ్డిని అడ్డుకున్నారు. అప్పటికే లక్ష్మారెడ్డి తలపై రెండుచోట్ల గాయాలయ్యాయి. యువకులు ధైర్యం చేసి అడ్డుకోకపోతే లక్ష్మారెడ్డి ప్రాణాలు దక్కేవి కావని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే తహసీల్దార్ రాజలింగు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాపురెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మారెడ్డికి నెన్నెల పీహెచ్సీలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నెన్నెల ఎస్సై చందర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రాజెక్టులో మునిగి 42 గొర్రెలు మృతి
నెన్నెల: ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని కుమ్మరివాగు ప్రాజెక్టు నీటిలో మునిగి మంగళవారం 42 గొర్రెలు మృతి చెందాయి. ప్రాజెక్టు నీటి నుంచి అవతలి ఒడ్డుకు మందను తోలే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. భీమిని మండలం వీగాంకు చెందిన గొర్రెల పెంపకం దారులు వారి గ్రామాల్లో మేత లేకపోవడంతో నెన్నెల ప్రాంతానికి వలస వచ్చారు. పది కుటుంబాల వారు ఇక్కడే నివాసం ఉంటూ గొర్రెలు మేపుకుంటున్నారు. తడిసిన తర్వాత బూరు కత్తిరించేందుకు దాదాపు 2500 గొర్రెలను ప్రాజెక్టులోకి తోలారు. కొన్ని ఏటవాలు ప్రాంతం నుంచి గట్టెక్కాయి. మిగతావి దారితప్పి ఒడ్డెత్తు ఉన్న ప్రాంతానికి వెళ్లాయి. అక్కడ వాటికి ఒడ్డు ఎక్క రాక నీటిలో మునిగి వృతి చెందినట్లు గొర్రెలకాపరులు వాపోయారు. వందల గొర్రెలకు ముగ్గురమే కాపర్లం ఉన్నందున వాటిని కాపాడలేక పోయామన్నారు. బర్సుల బీరయ్యకు చెందిన 11 గొర్రెలు, బర్సుల భీమయ్యకు చెందిన 8, జాతరకొండ రాజయ్యకు చెందిన 9, మేకల భీమయ్యకు చెందిన 6, మేకల మల్లేశ్‌కు చెందిన 6, మేకల రాజయ్యకు చెందిన 2 గొర్రెలు నీట మునిగి వృతి చెందాయి. మృత్యువాత పడ్డ గొర్రెల విలువ దాదాపు రూ. 2.5 లక్షల వరకు ఉంటుందని బాధితులు పేర్కొన్నారు. బతుకుదెరువు కోసం ఇక్కడికి వస్తే జీవనాధారమైన గొర్రెలు ప్రమాదంలో మృతిచెందాయని కంటనీరు పెట్టారు. ఆర్థికంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. -
ఆదిలాబాద్‌పై ప్రత్యేక శ్రద్ధ
నెన్నెల, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కోదండరాం ఆయన స్వగ్రామమైన నెన్నెల మండలం జోగాపూర్‌కు బుధవారం వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తూర్పు జిల్లాలో మామిడి మార్కెట్ ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసి నిధుల కోసం పోరాటాలు చేయాలన్నారు. ఈ ప్రాంతంలో పాల శీథలీకరణ కేంద్రం అవసరం ఎంతైన ఉందన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామస్థులు, స్థానిక నాయకులతో ఆయన పిచ్చాపాటిగా మాట్లాడారు. వృద్ధుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో గ్రామానికి వచ్చిన ప్రతి సారి ఒకటి రెండు గంటలు మాత్రమే ఉండే ఆయన రోజంత ఉండటంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. కొదండరాంతో పాటు మండల జేఏసీ చైర్మన్ టీ. రణవీర్ సింగ్, పీఏసీఎస్ చైర్మన్ ఇందూరి రమేష్, నాయకులు మల్లాగౌడ్, నాగపూరి శంకరి, చెన్నోజి శంకరయ్య, సర్పంచులు తిరుపతి గౌడ్, రమేష్‌గౌడ్ ఉన్నారు.