నెన్నెల: ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని కుమ్మరివాగు ప్రాజెక్టు నీటిలో మునిగి మంగళవారం 42 గొర్రెలు మృతి చెందాయి. ప్రాజెక్టు నీటి నుంచి అవతలి ఒడ్డుకు మందను తోలే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. భీమిని మండలం వీగాంకు చెందిన గొర్రెల పెంపకం దారులు వారి గ్రామాల్లో మేత లేకపోవడంతో నెన్నెల ప్రాంతానికి వలస వచ్చారు.
పది కుటుంబాల వారు ఇక్కడే నివాసం ఉంటూ గొర్రెలు మేపుకుంటున్నారు. తడిసిన తర్వాత బూరు కత్తిరించేందుకు దాదాపు 2500 గొర్రెలను ప్రాజెక్టులోకి తోలారు. కొన్ని ఏటవాలు ప్రాంతం నుంచి గట్టెక్కాయి. మిగతావి దారితప్పి ఒడ్డెత్తు ఉన్న ప్రాంతానికి వెళ్లాయి. అక్కడ వాటికి ఒడ్డు ఎక్క రాక నీటిలో మునిగి వృతి చెందినట్లు గొర్రెలకాపరులు వాపోయారు. వందల గొర్రెలకు ముగ్గురమే కాపర్లం ఉన్నందున వాటిని కాపాడలేక పోయామన్నారు. బర్సుల బీరయ్యకు చెందిన 11 గొర్రెలు, బర్సుల భీమయ్యకు చెందిన 8, జాతరకొండ రాజయ్యకు చెందిన 9, మేకల భీమయ్యకు చెందిన 6, మేకల మల్లేశ్‌కు చెందిన 6, మేకల రాజయ్యకు చెందిన 2 గొర్రెలు నీట మునిగి వృతి చెందాయి. మృత్యువాత పడ్డ గొర్రెల విలువ దాదాపు రూ. 2.5 లక్షల వరకు ఉంటుందని బాధితులు పేర్కొన్నారు. బతుకుదెరువు కోసం ఇక్కడికి వస్తే జీవనాధారమైన గొర్రెలు ప్రమాదంలో మృతిచెందాయని కంటనీరు పెట్టారు. ఆర్థికంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.
ప్రాజెక్టులో మునిగి 42 గొర్రెలు మృతి
Published Wed, Feb 4 2015 8:51 AM | Last Updated on Sat, Sep 2 2017 8:47 PM
Advertisement
Advertisement