సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. 1971 నాటి ఆర్‌వోఆర్ చట్టం స్థానంలో 2020 అక్టోబర్ 30 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ఇంకా బాలారిష్టాలను దాటని పరిస్థితి. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ విషయంలో కొత్త చట్టంతో మేలు జరిగినా.. అదే సమయంలో భూముల సమస్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం చట్టంలో మరిన్ని మార్పులు చేయాల్సి ఉందని, స్పష్టమైన అధికారాలను కల్పించి రెవెన్యూ యంత్రాంగాన్ని పటిష్టం చేసినప్పుడే ఈ చట్టం మంచి ఫలితాలు ఇస్తుందని పేర్కొంటున్నారు.
కొత్త చట్టం లక్ష్యం ఇదీ..
రాష్ట్రంలో మొత్తం 124 రెవెన్యూ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇందులో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్) చట్టం భూసంబంధిత అంశాల్లో చాలా ప్రధానమైంది. 1971 నుంచి 2020 అక్టోబర్ 29 వరకు అమల్లో ఉన్న ఈ చట్టానికే రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. భూముల మ్యుటేషన్, రిజి్రస్టేషన్ ప్రక్రియలను సులభతరం చేయడం.. భూసంబంధ సమస్యలన్నీ పరిష్కరించడం.. రెవెన్యూ పాలనలో పారదర్శకత తీసుకురావడం.. రెవెన్యూ యంత్రాంగానికి ఉన్న విచక్షణాధికారాలు ఎత్తివేసే విధంగా మార్పులు చేయడం లక్ష్యంగా కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది.
మరి ఏం జరిగింది?
ఈ చట్టం అమల్లోకి వచ్చిన రెండేళ్లలో రైతులకు జరిగిన ప్రయోజనం ఏమిటంటే.. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు వేగంగా జరిగి పాసు పుస్తకాలు త్వరగా చేతికి అందడమే. రిజిస్ట్రేషన్ల తర్వాత గతంలోలా నెలల తరబడి మ్యుటేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. రికార్డు పూర్తిగా కంప్యూటర్‌లో నిక్షిప్తమవుతోంది. కానీ ఈ చట్టం పరిధిలోకి వచ్చే ధరణి పోర్టల్ కారణంగా సమస్యలు భారీగా పెరిగాయి. 2006లో వచ్చిన కోనేరు రంగారావు కమిటీ నివేదిక ప్రకారం 2012–13లో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తుల ప్రకారం ప్రతి గ్రామంలో 50 నుంచి 100 వరకు భూసమస్యలు ఉండగా.. అవి ఇప్పుడు 200 వరకు చేరాయన్నది ఓ అంచనా.
సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామంలో దరఖాస్తులు స్వీకరిస్తే 277 భూసంబంధిత సమస్యల దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. గతంలో ఉన్న ఆర్డీవో, జేసీ కోర్టులు రద్దు కావడంతో భూసమస్యలు వస్తే సివిల్ కోర్టులకు వెళ్లడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. ఇక ధరణి పోర్టల్‌లో నమోదవుతున్న సమస్యలను పరిష్కరించే అధికారాలు చ ట్టం ప్రకారం కలెక్టర్లకు లేవు. అయినా వారు పరిష్కరిస్తున్నారు. కానీ లక్షలకొద్దీ సమస్యలను 33 మంది కలెక్టర్లు పరిష్కరించడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఇక కొత్త చట్టంలో సాదాబైనామాల క్రమబదీ్ధకరణకు ఎలాంటి నియమం పొందుపరచలేదని, దీంతో దాదాపు 9లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయని తెలుస్తోంది.
ఎన్నో రకాల సమస్యలతో..
ఇక భూయజమాని బయోమెట్రిక్ లేకుండా రికార్డుల్లో మార్పులు జరగవని, కొత్త చట్టం అమలుతో కోర్ బ్యాంకింగ్ తరహాలో రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటవుతుందని ప్రభుత్వం చెప్పింది. కానీ భూయజమానికి తెలియకుండానే రికార్డులు మారిన ఘటనలు అనేకం కనిపించాయి. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో పార్ట్–బి కింద నమోదు చేసిన సుమారు 10లక్షల ఎకరాల భూముల సమస్యలు ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. ఇనాం, పీవోటీ కేసులు, 38(ఈ) కింద రక్షిత కౌలుదారులకిచ్చే సర్టిఫికెట్, ఎల్‌టీఆర్ (భూబదలాయింపు చట్టం) అధికారాలను ఈ చట్టం తమకు కల్పించలేదని రెవెన్యూ యంత్రాంగం చెప్తోంది. గత చట్టంలో రెవెన్యూ సిబ్బందికి ఉన్న అధికారాలను కొత్త చట్టం ద్వారా ఎత్తివేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటోంది.
ఇప్పుడేం చేయాలి?
కొత్త చట్టం ద్వారా రాష్ట్రంలోని భూసమస్యల పరిష్కారానికి వెంటనే కొన్ని మార్పులు చేయాల్సి ఉందని భూచట్టాల నిపుణులు చెప్తున్నారు. ఆర్‌వోఆర్ చట్టం కింద రాసుకునే రికార్డు (ధరణి రికార్డు)ను సవరించే అధికారాన్ని క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించాలని.. ఈ అధికారాలు ఇప్పుడున్న అధికారులకు అప్పగించడమా లేక ట్రిబ్యునల్ లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడమా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఆర్‌వోఆర్ చట్టంలో నియమాన్ని అత్యవసరంగా చేర్చాలని, 1971 ఆర్‌వోఆర్ చట్టంలో ఉన్న సెక్షన్ 5(ఏ)ను యథాతథంగా కొత్త చట్టంలోకి సంగ్రహించాలని.. ఈ చట్టం కింద ధరణిలో మార్పులను గ్రామాలకు పంపి సవరించాలని స్పష్టం చేస్తున్నారు.
ఆ చట్టాల అనుభవాలను పరిగణనలోని తీసుకోవాలి..
ఇప్పటివరకు రాష్ట్రంలో నాలుగు ఆర్‌వోఆర్ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాల అమలు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఆర్‌వోఆర్ చట్టం మాత్రమే కాకుండా మిగతా 123 చట్టాలను కూడా మార్చి ఒకే చట్టాన్ని అమల్లోకి తేవాలి. అప్పుడే భూసమస్యలకు పరిష్కారం దొరుకుతుంది
– భూమి సునీల్‌కుమార్, భూచట్టాల నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment