
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న నాయకపోడులు
చండ్రుగొండ : మండలకేంద్రం చండ్రుగొండలోని ప్రభుత్వ కార్యాలయాలు మంగళవారం ఆదివాసీ నాయకపోడు ఆందోళనతో ప్రభుత్వ కార్యాలయాలను ఆదివాసీలు దిగ్బంధించారు. అసైన్డ్ భూములను సర్వే చేసి తమకు స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తూ 190 రోజులుగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్న ఆది వాసీ నాయకపోడులు ఉగ్రరూపం దాల్చారు. ఎండనక .. వాననక న్యాయమైన సమస్య పరిష్కరించాలని కోరుతూ దీక్షలు చేస్తున్న ఆదివాసీలు ఒక్కసారిగా జూలు విదిల్చారు. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, యువకులు అందరూ ఏకమయ్యారు.
వేకువజామునే ప్రభుత్వ కార్యాలయ ఎదుట బైఠాయించారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, ఐకేపీ కార్యాలయాల్లోకి అధికారులు, సిబ్బంది లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గంటల తరబడి ఆందోళన సాగింది. ఈ క్రమంలో తహసీల్దార్ గన్యానాయక్ అక్కడి చేరుకున్నారు. ఆందోళనకారులు తహసీల్దార్‌ను లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందితో కలిసి ఆయన లోపలికి వెళ్లి తన గదిలో ఆసీనులయ్యారు.
వెనుక నుంచి ఆదివాసీలు నినాదాలు చేసుకుంటూ కార్యాలయంలోకి ప్రవేశించించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎస్‌ఐ కడారి ప్రసాద్ ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. మూడు గంటల ఆందోళన అనంతరం అధికారుల హామీల నేపథ్యంలో ఆదివాసీలు శాంతించారు. దామరచర్లలోని భూములను తహసీల్దార్ గన్యానాయక్ సందర్శించారు. గిరిజనేతరులతో ఆయ న మాట్లాడారు. సమస్య పరిష్కరించేంత వరకు సంయమనం పాటించాలని వారికి సూచించారు.
అసలు విషయం ఏమిటంటే..
మండలంలోని దామరచర్లలో ఉన్న 130 ఎకరాల సీలింగ్ భూములను 1990లో సీతాయిగూడెం, అయన్నపాలెం గ్రామాలకు చెందిన 40 ఆదివాసీ నాయక పోడులకు ఎసైన్‌మెంట్ పట్టాలను రెవెన్యూ అధికారులు ఇచ్చారు. అయితే అప్పటికే ఆ భూములు గిరిజనేతర పేదల ఆధీనంలో ఉన్నాయి. దీంతో ఆ భూములు నాయకపోడులకు చెందలేదు.
అనంతరం పలుమార్లు నాయకపోడు ప్రతి అధికారికి, ప్రజాప్రతినిధికి తమ భూములు ఇప్పించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాలంగా గడిచిన 190 రోజులుగా ఆందోళన ముమ్మరం చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి రాజిన్ని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇక్కడి తహసీల్దార్ కార్యాలయం ఎదుట, జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని కలెక్టరేట్ ఎదురుగా ధర్నాచౌక్‌లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment