పైసా వసూల్‌..! | Some of the revenue officers involving in land issues | Sakshi
Sakshi News home page

పైసా వసూల్‌..!

Published Wed, Jan 10 2018 9:02 AM | Last Updated on Wed, Jan 10 2018 9:02 AM

Some of the revenue officers involving in land issues - Sakshi

జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళన సర్వే పూర్తి అయింది. ఎన్నో సంవత్సరాలుగా వివాదాల్లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించేందుకు బాధితులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అదునుగా భావించిన కొంత మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది డబ్బుల వసూళ్లకు తెరలెపినట్లు ప్రచారం జరుగుతోంది.

సాక్షి, వరంగల్‌ రూరల్‌:
వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 90 రోజులపాటు నిర్వహించిన భూసర్వే డిసెంబర్‌ 31న ముగిసింది. జిల్లాలోని 15 మండలాల్లో 269 గ్రామ పంచాయతీల్లో సర్వే చేశారు. 4,24,382 సర్వే నంబర్లలో 5,18,951 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 3,07,127 ఎకరాలు వివాదాలు లేని భూమిగా, 2,11, 827 ఎకరాల భూమి పలు వివాదాల్లో ఉన్నట్లుగా అ«ధికారులు నిర్ధారించారు. సర్వే పూర్తి కావడంతో 1బీ, పహణీలు జారీ చేసేందుకు అధికారులు ప్రక్రియను ప్రారంభించారు. జనవరి 26న అందించాలని ప్రభుత్వ లక్ష్యంతో ముందుకు సాగుతోంది. భూ రికార్డుల ప్రక్షాళన సర్వేను కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది, బ్రోకర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సంవత్సరాలుగా వివాదాల్లో ఉన్న భూముల సమస్యలు పరిష్కరించేందుకు బాధితులు సైతం ఎంతో కొంత ముట్టజెప్పుతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో కొందరు బ్రోకర్లు అదేపనిగా తహసీల్దార్‌ కార్యాలయాల్లో వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూ రికార్డుల ప్రక్షాళన కొంతమంది రెవెన్యూ సిబ్బంది, బ్రోకర్ల కారణంగా అభాసుపాలవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు.

రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళ్లు..
తప్పుడు సర్వే నంబర్లు సృష్టించి కొందరు రెవెన్యూ అధికారులు గొడవలు సృష్టిస్తున్నారు. మోకా మీద తప్పుడు సర్వే నంబర్‌లో ఉన్నారు. రికార్డుల్లో మీ పేరు రాదు అని రైతులని భయాందోళనలకు గురిచేస్తున్నారు. సర్వే నంబర్లను సరి చేసేందుకు ఒక్కో రైతు నుంచి ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. అలాగే మోకాలో 20 సంవత్సరాలుగా ఉన్నా సైతం కాస్తులో రావడం లేదు. మళ్లీ సర్వే చేయించుకో అని రైతులకు ఉచితంగా సలహాలు ఇస్తున్నారు. సర్వే చేసినందుకు ఒక్కో రైతు నుంచి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు.

రైతులు, రెవెన్యూ సిబ్బందికి మధ్యవర్తులుగా స్థానికులు, రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారని సమాచారం. జిల్లాలో టెక్స్‌టైల్‌ పార్కు స్థలం పోయిన రైతులు అదే గ్రామంలో ఇతర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. మీ దగ్గర భూమి కోల్పోయిన డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బులతో ఉన్న భూమిని సరిచేసుకో అని రెవెన్యూ సిబ్బంది, దళారులు అంటున్నారు. దీంతో ఇప్పటికే కొంత భూమి టెక్స్‌టైల్‌ పార్కుకు పోయింది, ఉన్న భూమినైనా డబ్బులు ఇచ్చి మరి సరిచేయించుకుంటున్నారు. టెక్స్‌టైల్‌ పార్కు కోసం భూములు కోల్పోయిన గ్రామం బస్టాండ్‌లో వీరి సంప్రదింపులు జరుగుతున్నాయి. రోజుకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నామని విశ్వనీయ సమాచారం.

ఇప్పటికే ఒక తహసీల్దార్‌ సస్పెన్షన్‌..
భూ ప్రక్షాళనలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలతో పర్వతగిరి తహసీల్దార్‌ విజయలక్ష్మీని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ అమ్రపాలి సస్పెండ్‌ చేశారు. ఒక అధికారిపై వేటు పడినా అధికారులు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డబ్బుల వసూళ్లను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.

నా దృష్టికి రాలేదు
వివాదాల్లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులు డబ్బులు ఎవరికీ ఇవ్వొద్దు.  – ఎం.హరిత, జాయింట్‌ కలెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement