సాక్షి, హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్‌పేట తహసీల్దార్ సుజాత భర్త అజయ్‌కుమార్ ఆత్మహత్య రెవెన్యూ ఉద్యోగుల్లో కలకలం సృష్టించింది. ఏసీబీ అధికారుల దాడిలో ఇంట్లో దొరికిన నగదుకు లెక్క చూపినా.. విచారణ పేరిట కుటుంబసభ్యులను వేధించడంతోనే అజయ్‌కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న రెవెన్యూ ఉద్యోగసంఘాలు.. ఈ వ్యవహారంలో ఏసీబీ వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతున్నారు. వివాదాస్పద భూ వ్యవహారంలో ఆర్‌ఐ, ఎస్‌ఐలను అరెస్టు చేసిన పోలీసులు.. ఎలాంటి ప్రమేయంలేని తహసీల్దార్‌ను అరెస్టు చేయడమేగాకుండా తప్పులు ఒప్పుకోవాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూను అవినీతి శాఖగా చిత్రీకరించడంలో భాగంగానే పద్ధతి ప్రకారం ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సజీవదహనం చేసిన సంఘటనలోనూ ఆమెదే తప్పిదం అన్నట్లుగా ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యలు చేసిన తీరును గుర్తు చేస్తున్న ఉద్యోగ సంఘాలు.. తాజా ఘటన నేపథ్యంలో ఆందోళనబాట పట్టాలని యోచిస్తున్నారు.
పార్ట్–బీ కేటగిరీలో చేర్చిన భూముల వ్యవహారంలో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో ఉద్యోగులపై దాడులు జరిగాయని, మాన్యువల్ పహాణీగాకుండా.. ఏకంగా ఆన్‌లైన్‌లోనే రికార్డులు నమోదు చేయడంతో ఆనేక తప్పు లు దొర్లాయని, వీటిని సవరించడానికి అనుమతినివ్వాలని కోరినా పట్టించుకోని అధికారు లు.. తప్పంతా రెవెన్యూ ఉద్యోగులదే అన్నట్లుగా ప్రవర్తించడం విడ్డూరంగా ఉందన్నారు. స్పష్టమైన మార్గదర్శకాలు లేకుండా.. అడ్డగోలు నిర్ణయాలతో రాత్రికి రాత్రే అమలు చేయాలనే ఉన్నతాధికారుల వ్యవహారశైలితో రెవెన్యూశాఖకు చెడ్డ పేరు వస్తోందని వాపోతున్నారు. ఈ క్రమం లోనే వీఆర్వోల వ్యవస్థ రద్దు, రెవెన్యూ శాఖ ప్రక్షాళన అంటూ సీఎం కేసీఆర్ ప్రకటనలు చేయడంతో మానసిక ఆందోళనకు గురవుతున్న ఉద్యోగులపై ఏసీబీ అధికారులు అవినీతి ముద్ర వేస్తుండటం మరింత కుంగదీస్తోందని అంటున్నారు.
ఏసీబీ వేధింపులతోనే: ట్రెసా
షేక్‌పేట్ తహసీల్దార్ సుజాత భర్త ప్రొఫెసర్ అజయ్‌కుమార్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శులు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్ మాట్లాడుతూ.. ఏసీబీ అధికారుల వేధింపుల వల్లే అజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి కేసులో ఆధారాలు లేకపోయిన అరెస్ట్ చేసిన తహసీల్దార్ సుజాతకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేస్తే బాగుండేదని, ఇప్పటికైనా ఆమెను విడుదల చేసి కేసును విచారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ట్రెసా అసోసియేట్ అధ్యక్షుడు మన్నె ప్రభాకర్, ఉపాధ్యక్షుడు కె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment