
సాక్షి, హైదరాబాద్: భూ సమస్యలపై నిరంతర ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. అందులో భాగంగానే ధరణి పోర్టల్ లొసుగులను ఎత్తిచూపుతూ సెప్టెంబర్ 3న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్న ట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు. అలాగే జీవో 58 ప్రకారం పేదలకు పట్టాలు, డబుల్ బెడ్రూంల సాధనకు సెప్టెంబర్ 10లోపు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ నెల 25, 26 తేదీల్లో జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం, కార్యవర్గ సమావేశ వివరాలను పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషాతో కలిసి చాడ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. మోదీ ప్రభు త్వం అన్ని రంగాల్లో విఫలమైందని, చట్టాల ఉల్లంఘనతో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. జాతీయస్థాయిలో 19 ప్రతిపక్ష పార్టీల పిలుపు మేరకు సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు తెలంగాణ లో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని చెప్పా రు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను సంప్రదించి, నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కన్నుసన్నల్లోనే అసైన్డ్, పట్టా, వక్ఫ్, దేవాదాయ, భూదాన్ భూములు కబ్జాకు గుర య్యాయని ఆరోపించారు. 2014లో 125 గజాల ఇళ్ల స్థలాలకు పట్టా సర్టిఫికెట్ ఇస్తామని ప్రభుత్వం 58 జీవో విడుదల చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్కరికీ కూడా పట్టా ఇవ్వలేదని విమర్శించారు.
11న బస్సుయాత్ర
కృష్ణా–గోదావరి జలాలపై రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించిందని చాడ ధ్వజమెత్తారు. జల వివాదంపై సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించకపోతే తామే రాష్ట్రస్థాయిలో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించి, ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చాడ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. పోడు భూముల అంశంపైనా అన్ని పార్టీలతో కలిసి పోరాటాల్లో పాల్గొనాలని నిర్ణయించినట్లు వివరించారు. తెలంగాణ సాయుధ పోరాట స్మృతులను గుర్తుచేస్తూ సెప్టెంబర్ 11న బస్సుయాత్రను నిర్వహించనున్నట్లు చెప్పారు. 11 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment