డీబార్‌ దానయ్యకు కోటు తొడిగి..! ఈనాడు పరువు తీసిన సీఎం జగన్‌ | CM Jagan Comments On Dotted Lands At Kavali Public Meeting | Sakshi
Sakshi News home page

అప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడు రైతు బాంధవుల వేషంలో బాబు, దత్తపుత్రుడి డ్రామాలు..

Published Sat, May 13 2023 3:43 AM | Last Updated on Sat, May 13 2023 10:09 AM

CM Jagan Comments On Dotted Lands At Kavali Public Meeting - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం మనది. నా ప్రతి అడుగులోనూ రైతు సంక్షేమం ఉంటుంది. భూమితో వారికున్న అనుబంధం తెలిసిన వ్యక్తిగా రైతన్నలకు మేలు చేసే కార్యక్రమాలను చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 97 వేలకుపైగా రైతు కుటుంబాలకు మంచి చేస్తూ చుక్కల భూములపై సర్వ హక్కులు కల్పించే కార్య­క్రమానికి శ్రీకారం చుట్టాం’’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో చుక్కల భూము­లపై రైతులకు హక్కుపత్రాలపంపిణీ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ఆ వివరాలివీ..

సర్వ హక్కులు కల్పిస్తూ..
రాష్ట్రంలో దాదాపు లక్ష కుటుంబాలకు మేలు చేస్తూ దేవుడి దయతో ఇవాళ మరో మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో తగిన మార్పులు చేసి రైతులకు సర్వ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్‌ చట్టం సెక్షన్‌ 22–ఏ నుంచి వాటిని తొలగిస్తూ మంచి చేస్తున్నాం. ఇన్నాళ్లూ 22–ఏలో ఉన్న ఈ భూముల రిజిస్ట్రేషన్‌ విలువ దాదాపు రూ.8 వేల కోట్లు. బయట వీటి మార్కెట్‌ విలువ కనీసం రూ.20 వేల కోట్లు ఉంటుంది. 



పుండుపై కారం చల్లిన చంద్రబాబు
దాదాపు వందేళ్ల క్రితం ఆంగ్లేయుల హయాంలో జరిగిన భూముల సర్వేలో ఒక భూమిని ప్రభుత్వ భూమా? లేక ప్రైవేట్‌ భూమా? అనే విషయాన్ని సరిగా నిర్ధారణ చేయలేదు. రెవెన్యూ రికార్డుల్లో అంటే రీ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌)లో ఆ పట్టాదారుడి గడిలో చుక్కలు పెట్టి వదిలేశారు. బ్రిటీష్‌ వారి కాలంలో ఇలా చుక్కలు పెట్టి లెక్కలు తేల్చకుండా వదిలేసిన భూములను రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ వస్తున్నారు. తరతరాలుగా సాగు చేస్తున్నా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరగని అధ్వాన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.

రైతన్నల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే పరిష్కారం చూపాల్సిన చంద్రబాబు ప్రభుత్వం 2016లో పుండుమీద కారం చల్లినట్లుగా రిజిస్ట్రేషన్లు జరగకుండా ఒక మెమో ద్వారా 22–ఏ నిషేధిత జాబితాలో చేర్చి అన్నదాతల జీవితాలతో ఆడుకుంది. ఇలా అన్యాయానికి గురైన రైతులు తమ పిల్లల పెళ్లిళ్లు, వైద్యం, ఇతర అవసరాలకు భూమిని విక్రయించేందుకు వీలులేని పరిస్థితి ఏర్పడింది.

చుక్కల భూముల యజమానులు నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేయించుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో పడ్డ కష్టాలను నా సుదీర్ఘ పాదయాత్రలో స్వయంగా చూశా. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 43 వేల ఎకరాలు, పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలో మరో 37 వేల ఎకరాలు, కడప, అన్నమయ్య జిల్లాల్లో 22 వేల ఎకరాల చుక్కల భూములున్నాయి. చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 

ప్రదక్షిణలు, లంచాలతో పని లేకుండా...
కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఒక్క రూపాయి కూడా ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా కలెక్టర్ల ద్వారా ఈ భూములన్నీ గుర్తించాం. 22–ఏ నిషేధిత జాబితా నుంచి చుక్కల భూములకు విముక్తి కల్పిస్తూ రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి 2 లక్షల ఎకరాలకు చెందిన దాదాపు లక్ష రైతు కుటుంబాలకు మంచి చేస్తూ వారికి ఈ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తున్నాం.

షరతులు గల పట్టా భూములూ పరిష్కారం
చుక్కల భూముల మాదిరిగానే సమస్యలు ఎదుర్కొంటున్న షరతులు గల పట్టా భూములు మరో 35 వేల ఎకరాలకు సంబంధించి 22 వేల మంది రైతులకు మేలు చేస్తూ ఆర్నెళ్ల క్రితమే అవనిగడ్డ నియోజకవర్గంలో అందించాం. నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తొలగిస్తూ ఆ ప్రాంత రైతులందరికి మంచి చేశాం. ఇది కూడా మీ బిడ్డ హయాంలోనే జరిగింది. 

భూ వివాదాలు శాశ్వతంగా పరిష్కారం
ఎప్పుడో వందేళ్ల నాటి భూముల సర్వే తర్వాత రికార్డులు అప్‌డేట్‌ కాకపోవడంతో గ్రామాల్లో నెలకొన్న విభేదాలు, వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో సమగ్ర సర్వే చేపట్టాం. 17,476 రెవెన్యూ గ్రామాలకి సంబంధించి ప్రతి గ్రామంలో సర్వే చేస్తూ రైతులందరికి హక్కు పత్రాలిచ్చే కార్యక్రమానికి నాంది పలికాం. ఇప్పటికే రెండు వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేసి హక్కు పత్రాలిచ్చే కార్యక్రమం వేగంగా జరుగుతోంది.

సుమారు 7 లక్షలకు పైగా భూహక్కు పత్రాలను అప్‌డేట్‌ చేసి రైతులకు అందించాం. సరిహద్దు రాళ్లను కూడా ఉచితంగా పాతే కార్యక్రమాన్ని రెండు వేల గ్రామాల్లో మే 20 నాటికి పూర్తి చేస్తాం. ఆ తర్వాత మే నెలాఖరు నుంచి మరో 2 వేల గ్రామాల చొప్పున మూడు నెలలకు ఒకసారి రెండు వేల గ్రామాల్లో పూర్తి చేసుకుంటూ వెళతాం. మనసున్న ప్రభుత్వంగా, రైతులకు మంచి జరగాలన్న ఆలోచనతో మనస్ఫూర్తిగా ఇవన్నీ చేస్తున్నాం. 

రైతు బాంధవుల వేషం.. రావణ సైన్యం
నాలుగేళ్లుగా ప్రతి అడుగులో రైతులకు మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో అడుగులు వేశాం. రైతులను చేయి పట్టుకుని నడిపించే విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. వైఎస్సార్‌ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, పగటి పూటే 9 గంటలు  నాణ్యమైన ఉచిత విద్యుత్, సీజన్‌ ముగియక ముందే అదే సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నా వడ్డీ, భూరక్ష, ఈ–క్రాప్‌తోపాటు దళారులు లేకుండా ఆర్బీకేల స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నాం. పంట నష్టపోయి¯నా ధాన్యం తడిసినా, రంగు మారినా కొనుగోలు చేస్తామని చెప్పాం.

కేంద్రం ఎంఎస్‌పీ ఇవ్వని పంటలకు సైతం కనీస మద్దతు ధర ప్రకటించి ఆర్బీకేల్లో బోర్డులు ఏర్పాటు చేశాం. రైతన్నల కోసం మన ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారు. ఏటా కనీసం 300 మండలాల్లో కరువు తాండవిస్తున్నా రైతులను గాలికి వదిలేసిన చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇస్తున్న దత్తపుత్రుడు ఇవాళ రైతు బాంధవుల వేషంలో రోడెక్కారు. వారికి మద్దతుగా రావణ సైన్యం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వీళ్లంతా రామాయణంలో శూర్పణక మాదిరిగా రైతులపై దొంగ ప్రేమ నటిస్తున్నారు.

ప్యాకేజీలు.. పొలిటికల్‌ యాక్షన్‌
అక్షరాలా రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను తొలి సంతకంతో మాఫీ చేస్తానన్న చంద్రబాబు రైతులను నమ్మించి దగా చేశాడు. రుణమాఫీ దేవుడెరుగు.. చివరకు సున్నా వడ్డీ కూడా ఎగ్గొట్టిన ఘనుడు ఆయనే. వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల భయంతో రోడ్డెక్కుతున్నారు. చంద్రబాబుకి డేట్లు ఇచ్చి ఆయన స్క్రిప్ట్‌ ప్రకారం డైలాగులు చెబుతూ పొలిటికల్‌ యాక్షన్‌ చేస్తూ ప్యాకేజీలు తీసుకుని నటిస్తున్న స్టార్‌ ఒకవైపు.. వారి డ్రామాలను రక్తి కట్టించేందుకు ఎల్లో మీడియా మరోవైపు పోటీ పడుతున్నాయి. ఎవరి డ్రామా వారు ఆడుతున్నారు. 

నాలుగేళ్లుగా కొన్నదెవరు మరి?
ప్రతి రైతన్నకూ చెబుతున్నా. వీళ్ల డ్రామాలను నమ్మొద్దు. తాము వస్తేగానీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని చెబుతున్నారు. మరి నాలుగేళ్లుగా కొన్నది ఎవరు? రైతన్నలకు తోడుగా జగన్‌ ప్రభుత్వం కనిపిస్తున్నా వక్రీకరిస్తున్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా ఏకంగా రూ.2.10 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. చివరికి మీ జగనన్నకు ఓటు వేయకపోయినా సరే.. అర్హత ఉంటే చాలు తోడుగా నిలిచాడు. ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ అడుగులు పడుతున్నాయి. 

సంక్షేమ పథకాలు దండగట!
పేదలకు జగన్‌ ఉచితంగా డబ్బులు పంచిపెడుతున్నారని, ఇదంతా బాధ్యతారాహిత్యమంటూ టీడీపీ, గజదొంగల ముఠా చేస్తున్న ప్రచారాలను గమనించండి. వారి టీవీ డిబేట్లలోనూ ఇవే వార్తలు చూస్తున్నాం. గతంలో ఇదే ఈనాడు, ఎల్లో మీడియాలో సంక్షేమ పథకాలను రద్దు చేయాలని ఇద్దరు మాజీ ఐఏఎస్‌లతో  చెప్పించారు. చంద్రబాబు మాటగా సంక్షేమ పథకాలు దండగని మొదటి పేజీలో అచ్చు వేసి చెప్పారు. అంటే చంద్రబాబుకు ఓటు వేయడమంటే ఇక పేదలెవరికీ పథకాలు రావనే దాని అర్థం. అందరూ దీనిపై ఆలోచన చేయండి.


 
కులాల యుద్ధం కాదు.. క్లాస్‌వార్‌
ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది  కులాల మధ్య యుద్ధం కాదు. క్లాస్‌ వార్‌ జరుగుతోంది. పేదవాడు ఒకవైపు, పెత్తందారీ మనస్తత్వం ఉన్నవారు మరోవైపున యుద్ధం జరుగుతోంది. పేదల ప్రతినిధిగా ఇక్కడ మీ జగన్‌ ఉన్నాడు. పేదరికం నుంచి ఎలా బయటకు తేవాలని మీ బిడ్డ అడుగులు వేస్తున్నాడు. అందుకే ప్రతి గ్రామంలో సచివాలయాలు కనిపిస్తున్నాయి. ప్రతి 50 ఇళ్లకు వలంటీర్‌ కనిపిస్తాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేని పాలన కనిపిస్తోంది. మన పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కావాలి.

నైపుణ్యం ఉన్న వ్యక్తులుగా మారాలని చదువులపై పెట్టుబడులు పెడుతున్నాం. హ్యూమన్‌ క్యాపిటల్‌ ఇండెక్స్‌లో మన రాష్ట్రం దేశానికే దిక్సూచి అవుతుంది. నైపుణ్యం ఉన్నవారు లేక జర్మనీ ఇబ్బంది పడుతోందని ఓ ఆర్టికల్‌ చదివా. నిపుణులైన మానవ వనరులు ఉండాలంటే ఒక విత్తనం పడి వృక్షం కావాలి. మీరంతా ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మీ ఇంట్లో మంచి జరిగిందా..? లేదా..? అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైన్యంగా నిలబడండి.

డీబార్‌ దానయ్యకు కోటు తొడిగి..!
రెండు రోజుల క్రితం ఈనాడులో జీవీ రావు అనే వ్యక్తి ఇంటర్వ్యూ ప్రచురించారు. ఆ పెద్ద మనిషి ఎవరని ఆరా తీస్తే.. చార్టెడ్‌ అకౌంటెంట్‌ (సీఏ)గా ఆయనకు ప్రాక్టీసు రద్దైంది. చార్టెడ్‌ అకౌంటెన్సీ వారు ఆయన సర్టిఫికెట్‌ను రద్దు చేసి డీబార్‌ చేశారు. అలాంటి డీబార్‌ అయిన దానయ్యను పట్టుకుని ఓ కోటు తొడిగి ఆర్థిక నిపుణుడిగా చూపిస్తూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఉండడానికి వీల్లేదని ఆయనతో చెప్పిస్తారు.

అది ఈనాడు రాస్తుంది. ఎల్లో మీడియా డిబేట్లు పెడుతుంది. జగన్‌ మాదిరిగా పరిపాలన చేస్తే రాష్ట్రం దివాళా తీస్తుందట.. అప్పులు పాలవుతుందని చెప్పిస్తారు. అబద్ధాలు చెప్పించడానికి వీరంతా అలా వాడుకుంటారు. 

కావలి కరువుతీరేలా వరాలు!
కావలి నియోజకవర్గానికి సంబంధించి టౌన్‌లో ట్యాంకు కెపాసిటీ పెంచి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ చేస్తే మంచి జరుగుతుందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కోరారు. అందుకు రూ.35 కోట్లు మంజూరు చేస్తున్నాం. కావలికి హైలెవల్‌ కెనాల్‌ నుంచి నీళ్లు రావడంలో ఇబ్బందులు ఉన్నందున సంగం బ్యారేజీ నుంచి లింక్‌ కెనాల్‌కు రూ.20 కోట్లు అడిగారు.

అది కూడా మంజూరు చేస్తున్నాం. రూ.56 కోట్లతో కావలి ట్రంక్‌ రోడ్డు పనులు జరుగుతున్నాయి. మరో రూ.15 కోట్లు అదనంగా మంజూరు చేస్తున్నాం. కావలి మున్సిపాలిటీ 16 వార్డులో ఇందిరమ్మ కాలనీలో మౌలిక సదుపాయాలకు మరో రూ.80 కోట్లు ఖర్చు చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నాం.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement