Lands Survey
-
హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల రీ సర్వే.. రంగంలోకి సర్వేయర్లు
హైదరాబాద్ రెవెన్యూ యంత్రాంగం సర్కారు భూములపై రీ సర్వేకు సిద్ధమైంది. ప్రభుత్వ భూముల కబ్జాల కట్టడికి ఉపక్రమించింది. ఇప్పటికే ల్యాండ్ బ్యాంకులో ఉన్న పార్శిల్స్ సైతం ఆక్రమణకు గురవుతుండడాన్ని తీవ్రంగా పరిగణించింది. సర్వేయర్లను రంగంలోకి దింపి మరోమారు ప్రభుత్వ భూములు రీ సర్వే చేయించాలని నిర్ణయించింది. క్షేత్ర స్థాయిలో పార్శిల్స్ వారిగా భూములను పరిశీలించి సమగ్ర నివేదికలు రూపొందించాలని నిర్ణయించింది. రెండు రోజుల క్రితం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటాచారి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో మండలాల సర్వేయర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమీక్షించారు. తాజాగా ప్రభుత్వ భూములన్నింటిని పరిశీలించి సంబంధిత స్థలంలో కొలతలు చేసి వివరంగా మ్యాపులను తయారుచేయాలని ఆదేశించారు.రంగంలో 17 మంది సర్వేయర్లు అధికార యంత్రాంగం సర్కారు భూముల రీ సర్వే కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జిల్లాలోని 16 మండలాల్లో సుమారు 17 మంది సర్వేయర్లు ఉన్నారు. గోల్కొండ మండలానికి మాత్రం ఇద్దరు సర్వేయర్లు ఉన్నారు. క్షేత్ర స్థాయిలో పార్శిల్ వారిగా సర్వే నిర్వహించి ఈ నెల 31 వరకు నివేదిక సమర్పించేలా ఆదేశించారు.ఇదీ పరిస్థితి u హైదరాబాద్ జిల్లా రెవెన్యూ పరిధిలో సుమారు 16 మండలాలు ఉన్నాయి. వాటి పరిధిలో సుమారు 1075 ల్యాండ్ పార్శిల్స్లున్నట్లు రెవెన్యూ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. u అందులో 890 ల్యాండ్ పార్శిల్స్‌లో ఎలాంటి వివాదాలు లేకుండా 40,66,914.08 చదరపు గజాల విస్తీర్ణం గల ఖాళీ స్థలం ఉంది. u మిగితా పార్శిల్స్‌లో సుమారు 11,45,334.95 చదరపు గజాల విసీర్ణం గల ఖాళీ స్థలం ఆక్రమణకు గురై ఉన్నట్లు తెలుస్తోంది. u సుమారు 169 పార్శిల్స్లోని దాదాపు 11,93,595.12 చదరపు గజాల విస్తీర్ణ గల ఖాళీ స్ధలంతోపాటు 445098.64 చదరపు గజాలా ఆక్రమిత భూమి కోర్టు కేసుల్లో ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. చదవండి: ‘బిల్డర్ల’ బాధితులకు హైడ్రా అండ -
‘రీ సర్వే’ను మోడల్‌గా తీసుకున్న ఉత్తరాఖండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీ సర్వే ప్రాజెక్టును ఉత్తరాఖండ్ ప్రభుత్వం మోడల్‌గా తీసుకుంది. ఆ రాష్ట్రంలో నిర్వహిస్తున్న భూ రికార్డుల ఆధునికీకరణ నేపథ్యంలో ఏపీలో రీ సర్వే జరుగుతున్న తీరును పూర్తిగా అధ్యయనం చేసింది. ఉత్తరాఖండ్ అధికారులకు సైతం ఏపీ అధికారులతో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించింది. ఇందులో భాగంగా శుక్రవారం డెహ్రాడూన్‌లో జరిగిన వర్క్‌షాప్‌లో ఏపీ సర్వే అకాడమీ వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్వీఎస్ఎన్ కుమార్ రీ సర్వే ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ముస్సోరిలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలోని బీఎన్ యుగంధర్ సెంటర్ ఫర్ రూరల్ స్టడీస్ ఈ వర్క్‌షాప్ నిర్వహించింది. హైబ్రీడ్ టెక్నాలజీ ద్వారా ఆధునిక భూముల సర్వే నిర్వహణలో ఏపీకి అపారమైన అనుభవం ఉన్న దృష్ట్యా తాము నిర్వహించే వర్క్‌షాప్‌లో ఉత్తరాఖండ్ రెవెన్యూ అధికారులకు దీనిపై శిక్షణ ఇవ్వాలని ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో సీహెచ్వీఎస్ఎన్ కుమార్‌ను భూపరిపాలన శాఖ అధికారులు అక్కడికి పంపడంతో ఆయన రీసర్వే ప్రాజెక్టుపై ప్రజెంటేషన్‌తోపాటు వారికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. డ్రోన్లు, విమానాల ద్వారా సర్వే నిర్వహిస్తున్న తీరు, గ్రౌండ్ ట్రూతింగ్, వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మొబైల్ మెజిస్ట్రేట్లు, భూ హక్కు పత్రాల పంపిణీ వంటి పలు అంశాల గురించి వివరించారు. -
డీబార్ దానయ్యకు కోటు తొడిగి..! ఈనాడు పరువు తీసిన సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం మనది. నా ప్రతి అడుగులోనూ రైతు సంక్షేమం ఉంటుంది. భూమితో వారికున్న అనుబంధం తెలిసిన వ్యక్తిగా రైతన్నలకు మేలు చేసే కార్యక్రమాలను చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 97 వేలకుపైగా రైతు కుటుంబాలకు మంచి చేస్తూ చుక్కల భూములపై సర్వ హక్కులు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో చుక్కల భూములపై రైతులకు హక్కుపత్రాలపంపిణీ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ఆ వివరాలివీ.. సర్వ హక్కులు కల్పిస్తూ.. రాష్ట్రంలో దాదాపు లక్ష కుటుంబాలకు మేలు చేస్తూ దేవుడి దయతో ఇవాళ మరో మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో తగిన మార్పులు చేసి రైతులకు సర్వ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22–ఏ నుంచి వాటిని తొలగిస్తూ మంచి చేస్తున్నాం. ఇన్నాళ్లూ 22–ఏలో ఉన్న ఈ భూముల రిజిస్ట్రేషన్ విలువ దాదాపు రూ.8 వేల కోట్లు. బయట వీటి మార్కెట్ విలువ కనీసం రూ.20 వేల కోట్లు ఉంటుంది. పుండుపై కారం చల్లిన చంద్రబాబు దాదాపు వందేళ్ల క్రితం ఆంగ్లేయుల హయాంలో జరిగిన భూముల సర్వేలో ఒక భూమిని ప్రభుత్వ భూమా? లేక ప్రైవేట్ భూమా? అనే విషయాన్ని సరిగా నిర్ధారణ చేయలేదు. రెవెన్యూ రికార్డుల్లో అంటే రీ సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్)లో ఆ పట్టాదారుడి గడిలో చుక్కలు పెట్టి వదిలేశారు. బ్రిటీష్ వారి కాలంలో ఇలా చుక్కలు పెట్టి లెక్కలు తేల్చకుండా వదిలేసిన భూములను రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ వస్తున్నారు. తరతరాలుగా సాగు చేస్తున్నా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరగని అధ్వాన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. రైతన్నల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే పరిష్కారం చూపాల్సిన చంద్రబాబు ప్రభుత్వం 2016లో పుండుమీద కారం చల్లినట్లుగా రిజిస్ట్రేషన్లు జరగకుండా ఒక మెమో ద్వారా 22–ఏ నిషేధిత జాబితాలో చేర్చి అన్నదాతల జీవితాలతో ఆడుకుంది. ఇలా అన్యాయానికి గురైన రైతులు తమ పిల్లల పెళ్లిళ్లు, వైద్యం, ఇతర అవసరాలకు భూమిని విక్రయించేందుకు వీలులేని పరిస్థితి ఏర్పడింది. చుక్కల భూముల యజమానులు నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేయించుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో పడ్డ కష్టాలను నా సుదీర్ఘ పాదయాత్రలో స్వయంగా చూశా. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 43 వేల ఎకరాలు, పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలో మరో 37 వేల ఎకరాలు, కడప, అన్నమయ్య జిల్లాల్లో 22 వేల ఎకరాల చుక్కల భూములున్నాయి. చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రదక్షిణలు, లంచాలతో పని లేకుండా... కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఒక్క రూపాయి కూడా ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా కలెక్టర్ల ద్వారా ఈ భూములన్నీ గుర్తించాం. 22–ఏ నిషేధిత జాబితా నుంచి చుక్కల భూములకు విముక్తి కల్పిస్తూ రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి 2 లక్షల ఎకరాలకు చెందిన దాదాపు లక్ష రైతు కుటుంబాలకు మంచి చేస్తూ వారికి ఈ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తున్నాం. షరతులు గల పట్టా భూములూ పరిష్కారం చుక్కల భూముల మాదిరిగానే సమస్యలు ఎదుర్కొంటున్న షరతులు గల పట్టా భూములు మరో 35 వేల ఎకరాలకు సంబంధించి 22 వేల మంది రైతులకు మేలు చేస్తూ ఆర్నెళ్ల క్రితమే అవనిగడ్డ నియోజకవర్గంలో అందించాం. నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తొలగిస్తూ ఆ ప్రాంత రైతులందరికి మంచి చేశాం. ఇది కూడా మీ బిడ్డ హయాంలోనే జరిగింది. భూ వివాదాలు శాశ్వతంగా పరిష్కారం ఎప్పుడో వందేళ్ల నాటి భూముల సర్వే తర్వాత రికార్డులు అప్డేట్ కాకపోవడంతో గ్రామాల్లో నెలకొన్న విభేదాలు, వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో సమగ్ర సర్వే చేపట్టాం. 17,476 రెవెన్యూ గ్రామాలకి సంబంధించి ప్రతి గ్రామంలో సర్వే చేస్తూ రైతులందరికి హక్కు పత్రాలిచ్చే కార్యక్రమానికి నాంది పలికాం. ఇప్పటికే రెండు వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేసి హక్కు పత్రాలిచ్చే కార్యక్రమం వేగంగా జరుగుతోంది. సుమారు 7 లక్షలకు పైగా భూహక్కు పత్రాలను అప్డేట్ చేసి రైతులకు అందించాం. సరిహద్దు రాళ్లను కూడా ఉచితంగా పాతే కార్యక్రమాన్ని రెండు వేల గ్రామాల్లో మే 20 నాటికి పూర్తి చేస్తాం. ఆ తర్వాత మే నెలాఖరు నుంచి మరో 2 వేల గ్రామాల చొప్పున మూడు నెలలకు ఒకసారి రెండు వేల గ్రామాల్లో పూర్తి చేసుకుంటూ వెళతాం. మనసున్న ప్రభుత్వంగా, రైతులకు మంచి జరగాలన్న ఆలోచనతో మనస్ఫూర్తిగా ఇవన్నీ చేస్తున్నాం. రైతు బాంధవుల వేషం.. రావణ సైన్యం నాలుగేళ్లుగా ప్రతి అడుగులో రైతులకు మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో అడుగులు వేశాం. రైతులను చేయి పట్టుకుని నడిపించే విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, పగటి పూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్, సీజన్ ముగియక ముందే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ, భూరక్ష, ఈ–క్రాప్‌తోపాటు దళారులు లేకుండా ఆర్బీకేల స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నాం. పంట నష్టపోయి¯నా ధాన్యం తడిసినా, రంగు మారినా కొనుగోలు చేస్తామని చెప్పాం. కేంద్రం ఎంఎస్పీ ఇవ్వని పంటలకు సైతం కనీస మద్దతు ధర ప్రకటించి ఆర్బీకేల్లో బోర్డులు ఏర్పాటు చేశాం. రైతన్నల కోసం మన ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారు. ఏటా కనీసం 300 మండలాల్లో కరువు తాండవిస్తున్నా రైతులను గాలికి వదిలేసిన చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇస్తున్న దత్తపుత్రుడు ఇవాళ రైతు బాంధవుల వేషంలో రోడెక్కారు. వారికి మద్దతుగా రావణ సైన్యం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వీళ్లంతా రామాయణంలో శూర్పణక మాదిరిగా రైతులపై దొంగ ప్రేమ నటిస్తున్నారు. ప్యాకేజీలు.. పొలిటికల్ యాక్షన్ అక్షరాలా రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను తొలి సంతకంతో మాఫీ చేస్తానన్న చంద్రబాబు రైతులను నమ్మించి దగా చేశాడు. రుణమాఫీ దేవుడెరుగు.. చివరకు సున్నా వడ్డీ కూడా ఎగ్గొట్టిన ఘనుడు ఆయనే. వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల భయంతో రోడ్డెక్కుతున్నారు. చంద్రబాబుకి డేట్లు ఇచ్చి ఆయన స్క్రిప్ట్ ప్రకారం డైలాగులు చెబుతూ పొలిటికల్ యాక్షన్ చేస్తూ ప్యాకేజీలు తీసుకుని నటిస్తున్న స్టార్ ఒకవైపు.. వారి డ్రామాలను రక్తి కట్టించేందుకు ఎల్లో మీడియా మరోవైపు పోటీ పడుతున్నాయి. ఎవరి డ్రామా వారు ఆడుతున్నారు. నాలుగేళ్లుగా కొన్నదెవరు మరి? ప్రతి రైతన్నకూ చెబుతున్నా. వీళ్ల డ్రామాలను నమ్మొద్దు. తాము వస్తేగానీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని చెబుతున్నారు. మరి నాలుగేళ్లుగా కొన్నది ఎవరు? రైతన్నలకు తోడుగా జగన్ ప్రభుత్వం కనిపిస్తున్నా వక్రీకరిస్తున్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా ఏకంగా రూ.2.10 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. చివరికి మీ జగనన్నకు ఓటు వేయకపోయినా సరే.. అర్హత ఉంటే చాలు తోడుగా నిలిచాడు. ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ అడుగులు పడుతున్నాయి. సంక్షేమ పథకాలు దండగట! పేదలకు జగన్ ఉచితంగా డబ్బులు పంచిపెడుతున్నారని, ఇదంతా బాధ్యతారాహిత్యమంటూ టీడీపీ, గజదొంగల ముఠా చేస్తున్న ప్రచారాలను గమనించండి. వారి టీవీ డిబేట్లలోనూ ఇవే వార్తలు చూస్తున్నాం. గతంలో ఇదే ఈనాడు, ఎల్లో మీడియాలో సంక్షేమ పథకాలను రద్దు చేయాలని ఇద్దరు మాజీ ఐఏఎస్‌లతో చెప్పించారు. చంద్రబాబు మాటగా సంక్షేమ పథకాలు దండగని మొదటి పేజీలో అచ్చు వేసి చెప్పారు. అంటే చంద్రబాబుకు ఓటు వేయడమంటే ఇక పేదలెవరికీ పథకాలు రావనే దాని అర్థం. అందరూ దీనిపై ఆలోచన చేయండి. కులాల యుద్ధం కాదు.. క్లాస్‌వార్ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. క్లాస్ వార్ జరుగుతోంది. పేదవాడు ఒకవైపు, పెత్తందారీ మనస్తత్వం ఉన్నవారు మరోవైపున యుద్ధం జరుగుతోంది. పేదల ప్రతినిధిగా ఇక్కడ మీ జగన్ ఉన్నాడు. పేదరికం నుంచి ఎలా బయటకు తేవాలని మీ బిడ్డ అడుగులు వేస్తున్నాడు. అందుకే ప్రతి గ్రామంలో సచివాలయాలు కనిపిస్తున్నాయి. ప్రతి 50 ఇళ్లకు వలంటీర్ కనిపిస్తాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేని పాలన కనిపిస్తోంది. మన పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కావాలి. నైపుణ్యం ఉన్న వ్యక్తులుగా మారాలని చదువులపై పెట్టుబడులు పెడుతున్నాం. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్‌లో మన రాష్ట్రం దేశానికే దిక్సూచి అవుతుంది. నైపుణ్యం ఉన్నవారు లేక జర్మనీ ఇబ్బంది పడుతోందని ఓ ఆర్టికల్ చదివా. నిపుణులైన మానవ వనరులు ఉండాలంటే ఒక విత్తనం పడి వృక్షం కావాలి. మీరంతా ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మీ ఇంట్లో మంచి జరిగిందా..? లేదా..? అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైన్యంగా నిలబడండి. డీబార్ దానయ్యకు కోటు తొడిగి..! రెండు రోజుల క్రితం ఈనాడులో జీవీ రావు అనే వ్యక్తి ఇంటర్వ్యూ ప్రచురించారు. ఆ పెద్ద మనిషి ఎవరని ఆరా తీస్తే.. చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ)గా ఆయనకు ప్రాక్టీసు రద్దైంది. చార్టెడ్ అకౌంటెన్సీ వారు ఆయన సర్టిఫికెట్‌ను రద్దు చేసి డీబార్ చేశారు. అలాంటి డీబార్ అయిన దానయ్యను పట్టుకుని ఓ కోటు తొడిగి ఆర్థిక నిపుణుడిగా చూపిస్తూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఉండడానికి వీల్లేదని ఆయనతో చెప్పిస్తారు. అది ఈనాడు రాస్తుంది. ఎల్లో మీడియా డిబేట్లు పెడుతుంది. జగన్ మాదిరిగా పరిపాలన చేస్తే రాష్ట్రం దివాళా తీస్తుందట.. అప్పులు పాలవుతుందని చెప్పిస్తారు. అబద్ధాలు చెప్పించడానికి వీరంతా అలా వాడుకుంటారు. కావలి కరువుతీరేలా వరాలు! కావలి నియోజకవర్గానికి సంబంధించి టౌన్లో ట్యాంకు కెపాసిటీ పెంచి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తే మంచి జరుగుతుందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కోరారు. అందుకు రూ.35 కోట్లు మంజూరు చేస్తున్నాం. కావలికి హైలెవల్ కెనాల్ నుంచి నీళ్లు రావడంలో ఇబ్బందులు ఉన్నందున సంగం బ్యారేజీ నుంచి లింక్ కెనాల్‌కు రూ.20 కోట్లు అడిగారు. అది కూడా మంజూరు చేస్తున్నాం. రూ.56 కోట్లతో కావలి ట్రంక్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. మరో రూ.15 కోట్లు అదనంగా మంజూరు చేస్తున్నాం. కావలి మున్సిపాలిటీ 16 వార్డులో ఇందిరమ్మ కాలనీలో మౌలిక సదుపాయాలకు మరో రూ.80 కోట్లు ఖర్చు చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నాం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
AP: వెయ్యి గ్రామాల్లో పూర్తయిన రీసర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే వెయ్యికిపైగా గ్రామాల్లో పూర్తయింది. మిగిలిన గ్రామాల్లోనూ త్వరితగతిన సర్వేను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత సంవత్సరం 51 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సర్వే విజయవంతం కావడంతో మరో 1,034 గ్రామాలను రీసర్వే కోసం ఎంపిక చేశారు. వీటిలో మొదటి విడత 650 గ్రామాలు, రెండో విడత 384 గ్రామాల్లో సర్వే ప్రారంభించారు. 513 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. సర్వే ముగింపునకు సంబంధించిన నంబర్–13 నోటిఫికేషన్లు కూడా ఈ గ్రామాల్లో జారీ చేశారు. మిగిలిన 598 గ్రామాల్లో ఈ నెలాఖరుకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 108 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశారు. త్వరలో మరో 118 గ్రామాల్లో నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. అల్లూరి సీతారామరాజు, గుంటూరు, విశాఖ, కోనసీమ జిల్లాల్లో తక్కువ గ్రామాల్లో సర్వే పూర్తయింది. మలి దశలో ఈ జిల్లాల్లోని ఎక్కువ గ్రామాల్లో సర్వేకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటివరకు 1,854 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది. అందులో 1,142 గ్రామాల డ్రోన్ చిత్రాలు (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ –ఓఆర్ఐ)లు రెవెన్యూ బృందాలకు చేరాయి. మిగిలినవి కూడా అందగానే ఆ గ్రామాల్లో సర్వేను ముమ్మరం చేస్తామని సర్వే సెటిల్మెంట్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు. రీసర్వే అనుకున్న దానికంటె వేగంగా జరుగుతోందని చెప్పారు. 3 నెలల్లోనే 1034 గ్రామాల్లో సర్వేను తుది దశకు తీసుకొచ్చినట్లు తెలిపారు. గ్రామాల్లో భూయజమానుల నుంచి వస్తున్న అభ్యంతరాలను సాధ్యమైనంత వరకు సర్వే బృందాలే పరిష్కరిస్తున్నాయి. చాలా తక్కువ సంఖ్యలోనే అభ్యంతరాలు తహశీల్దార్ వరకు వెళుతున్నాయి. 9,278 అభ్యంతరాలు రాగా 8,933 అభ్యంతరాలను సర్వే బృందాలు పరిష్కరించాయి. -
రెండ్రోజుల్లో పీఆర్సీ ప్రకటన: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో రెండు మూడు రోజుల్లో గౌరవప్రదంగా ఉండే ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులకు మెరుగైన వేతనాలిచ్చే పద్ధతి కొనసాగుతోందన్న వాస్తవం మరోసారి ప్రపంచానికి స్పష్టమవుతుందని చెప్పారు. విభజన తర్వాత ఏర్పడే తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని, అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు మంచి జీతాలు అందుతాయని తాను అప్పట్లో చెప్పానని గుర్తు చేశారు. తాజా వేతన సవరణ ఫిట్మెంట్తో అది మరోసారి తేటతెల్లం అవుతుందని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ, శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. కరోనా ప్రభావం వల్ల గత ఏడాది కాలంలో రాష్ట్రం రూ.లక్ష కోట్లమేర నష్టపోయిందని.. అందులో రూ.52 వేల కోట్ల మేర ప్రత్యక్ష ఆదాయాన్ని కోల్పోయామని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పీఆర్సీ విషయంలో కట్టుబడి ఉన్నామని.. రెండు మూడు రోజుల్లో అసెంబ్లీ వేదికగానే ప్రకటన ఉంటుందని వెల్లడించారు. ఈసారీ ధాన్యం కొంటాం.. కరోనా కష్టకాలంలోనూ రైతులకు మేలు చేయడం కోసం ధాన్యం కొనుగోలు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. దాని ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, మారుమూల ఊర్లలో పొలాల వద్దనే ధాన్యం కొనే ఏర్పాటుపై యోచిస్తున్నామని తెలిపారు. మిగతా ప్రాంతాల్లో మార్కెట్ యార్డుల్లోనే కొనుగోలు చేస్తామన్నారు. అయితే రైతులు కూడా న్యాయబద్ధంగా ఆలోచించాలని పేర్కొంటూ తేమ విషయాన్ని ప్రస్తావించారు. మార్కెట్లకు పచ్చివడ్లు తెచ్చి కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేయటం సరికాదన్నారు. ధాన్యాన్ని ఆరబెట్టి తేమలేకుండా చేశాకే మద్దతు ధరకు కొననున్నట్టు తేల్చి చెప్పారు. కేంద్ర వ్యవసాయ చట్టానికి సంబంధించి రైతులు ఆందోళనలు చేస్తున్నారని.. అయితే ఆ చట్టం రైతుల మేలుకేనని తనతో ప్రధాని చెప్పారని వివరించారు. ప్రస్తుతం ఆ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున దానిపై ఎక్కువగా మాట్లాడటం సరికాదని చెప్పారు. కొత్త చట్టంలో భాగంగా మార్కెట్ యార్డులను మూసే యాలని కేంద్రం నిర్ణయిస్తే.. రాష్ట్రంలో మాత్రం కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. కేంద్ర అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ కొన్ని రాష్ట్రాలు అసెంబ్లీల్లో తీర్మానాలు చేసినందున.. రాష్ట్రంలోనూ చేయాలన్న కాంగ్రెస్‌పక్ష నేత భట్టి విక్రమార్క సూచనను సీఎం కేసీఆర్ కొట్టిపడేశారు. కేంద్ర చట్టాన్ని అసెంబ్లీ తీర్మానాలు నిలువరించలేవని గుర్తు చేశారు. త్వరలో భూముల సమగ్ర సర్వే.. రాష్ట్రంలోని భూములన్నింటిపై సమగ్ర సర్వే చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు డిజిటల్ సర్వే కోసం బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు. అక్షాంశ రేఖాంశాల ఆధారంగా భూముల హద్దులను నిర్ధారిస్తామని.. ఇకపై ఎవరూ భూముల రికార్డులను ట్యాంపర్ చేయలేరని తేల్చి చెప్పారు. దేశంలోనే ‘ధరణి’ఓ విప్లవాత్మక ప్రాజెక్టు అని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. దీనిపై కేంద్ర విభాగాలతోపాటు 16 రాష్ట్రాల బృందాలు అధ్యయనం చేస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో 2.77 కోట్ల ఎకరాల భూమి ఉండగా.. అందులో 1.50 కోట్ల ఎకరాల వివరాలు ధరణి వెబ్సైట్లో నమోదయ్యాయని చెప్పారు. అప్పట్లో రికార్డులు సరిగా లేక వీఆర్వో రాసిందే రాత, ఎమ్మార్వో గీసిందే గీతగా ఉండేదని.. ఇక ముందు ఎమ్మార్వో కార్యాలయాల్లో భూలావాదేవీలు జరిగే వీలు లేకుండా చేస్తున్నామని పేర్కొన్నారు. కొత్త విధానంతో ఇప్పటివరకు 3.30 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. 1.08 లక్షల పెండింగ్ మ్యూటేషన్స్‌ను కూడా క్లియర్ చేశామని తెలిపారు. ధరణిలో చిన్నచిన్న సమస్యలున్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. దాదాపు నాలుగైదు లక్షల మంది రైతులకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని.. వాటి పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పామని.. ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని వివరించారు. మళ్లీ కరోనా పంజా.. స్కూళ్లపై త్వరలో నిర్ణయం కొద్దిరోజులుగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలో విద్యా సంస్థలు కొనసాగించాలా, వద్దా అన్నదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొన్నిరోజులుగా పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు కోవిడ్ సోకుతున్న నేపథ్యంలో భయాంతోళనలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన విషయమైనందున దీనిపై రెండుమూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ కొనసాగుతుంది ఉమ్మడి రాష్ట్రం నాటి సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లను సమూలంగా మార్చి.. రీడిజైన్‌తో చేపట్టిన పనులు అద్భుత ఫలితాలనిస్తున్న విషయం అంతా గమనిస్తున్నారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇక ముందు కూడా రీడిజైనింగ్ కొనసాగిస్తామన్నారు. 2014లో తెలంగాణ ప్రాంతంలో 12.23 లక్షల ఎకరాలు సాగులో ఉంటే.. ఇప్పుడు 52.28 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయని గుర్తు చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ కంటే రెండున్నర రెట్లు ఎక్కువన్నారు. ఈ విషయంగా దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. ఈ ఘనత ఉపన్యాసాలతో వచ్చింది కాదని, వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, కష్టపడితే వచ్చిందని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఉచిత విద్యుత్ పథకం మొదలైందన్న విషయాన్ని ఒప్పుకొంటామని.. దాన్ని తాము మరింత మెరుగ్గా అమలు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. నిండుగా నీరు పారుతున్న వరద కాల్వలపై రైతులు వేల సంఖ్యలో మోటార్లు పెట్టుకుని నీరు లాగుతున్నా.. వారు పాకిస్థానీయులు కాదు మనవాళ్లే అన్న ఉద్దేశంతో కొనసాగించేందుకు సహకరిస్తున్నామన్నారు. ప్రస్తుత యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయని.. తాను, తన కొడుకు కేటీఆర్ కలిపి 70 ఎకరాల్లో నాట్లు వేయించామని వెల్లడించారు. గతంలో 58 ఏళ్లలో 128 ఎకరాల్లో పాలీహౌజ్‌లు ఏర్పాటు చేయిస్తే.. ఇప్పుడా సంఖ్య 1,325 ఎకరాలకు పెరిగిందని, సబ్సిడీ పరిమితి కూడా పెంచామని కేసీఆర్ గుర్తు చేశారు. ఫసల్ బీమా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేస్తామన్నారు. రుణ మాఫీని వందశాతం అమలు చేస్తున్నామన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం స్వయంగా తానే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తానని, పకడ్బందీ చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. కోవిడ్ వల్ల కొంత జాప్యం జరిగిందన్నారు. పేదరికంలో మగ్గుతున్న దళిత, గిరిజనుల పరిస్థితి చూస్తే బాధగా ఉంటుందని, వారికి న్యాయం కలిగేలా ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తున్నామని చెప్పారు. నిధులను దారి మళ్లించకుండా, మిగిలినవి క్యారీ ఫార్వర్డ్ అయ్యేలా చూస్తున్నామన్నారు. చమురు ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పాత్ర ఉండదని స్పష్టం చేశారు. న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐకి ఇవ్వం న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితులెవరైనా వదిలే ప్రసక్తే లేదని, ఈ కేసును నిస్పాక్షికంగా దర్యాప్తు చేయిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ కేసులో టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడి పేరు రాగానే.. పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, ఆ వ్యక్తి ప్రస్తుతం జైలులో ఉన్నాడని గుర్తు చేశారు. ఇప్పటికే పోలీసులు కుంట శ్రీను, శ్రీనివాస్, చిరంజీవి, అక్కప్ప కుమార్, లచ్చయ్య, వసంతరావు అనే వ్యక్తులను అరెస్టు చేశారన్నారు. తెలంగాణ పోలీసులకు దేశంలోనే మంచి పేరుందని, వారిని అవమానించేలా కేసును సీబీఐకి ఇవ్వాలన్న డిమాండ్ సరికాదని పేర్కొన్నారు. విద్యుత్ విషయంలో రాష్ట్రం గొప్పగా ఉందని, ట్రాన్స్మిషన్ కెపాసిటీ 13,900 మెగావోల్టుల నుంచి 37 వేల మెగావోల్టులకు పెరిగిందని స్వయంగా సీఈఏ ఆడిట్ సంస్థ తేల్చిందని సీఎం కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ హయాం నాటి చీకట్లు పోయి ఇప్పుడు రాష్ట్రం వెలుగులు విరజిమ్ముతోందన్నారు. జూబ్లీహిల్స్‌లో ధనవంతులు తాగే మినరల్ వాటర్ కంటే శ్రేష్టమైన నీటిని మిషన్ భగీరథలో అందిస్తున్నామన్నారు. నీటి నాణ్యతను నిత్యం 70 ప్రాంతాల్లో పరీక్షిస్తున్నట్టు చెప్పారు. మంచినీటికి సంబంధించి 2014కు ముందు పదేళ్లలో రూ.4,198 కోట్లు ఖర్చు చేస్తే.. తాము గత ఆరున్నరేళ్లలో రూ.32,500 కోట్లు ఖర్చు చేశామన్నారు. 58 ఏళ్లలో 17,769 వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేస్తే.. తాము ఐదేళ్లలోనే 19,733 ట్యాంకులు నిర్మించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శుద్ధి చేసిన నీళ్లు అందుతున్నట్టు కేంద్రం పార్లమెంటుకు వివరాలు సమర్పించిందని గుర్తు చేశారు. కాకతీయుల నాటి 75 వేల చెరువులను ధ్వంసం చేసి.. 45 వేల చెరువులను తాంబాలాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలించిందని.. తాము ఎండాకాలంలో కూడా మత్తడి దూకేలా చెరువులను పునరుద్ధరించామని సీఎం చెప్పారు. అప్పట్లో తన పొలంలో 37 బోర్లు వేస్తే ఐదు మాత్రమే సక్సెస్ అయ్యాయని.. ఇప్పుడు దేశంలోనే ఎక్కువగా భూగర్భజలమట్టం పెరిగిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు. ఊర్లలో ఎంతో మార్పు వచ్చింది కాంగ్రెస్ హయాంలో రిజర్వాయర్ల సామర్థ్యం 14 టీఎంసీలుగా ఉంటే.. తాము 227.77 టీఎంసీల స్థాయికి తీసుకెళ్లేలా ప్రాజెక్టులను రూపొందించామని సీఎం కేసీఆర్ చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వల్ల గ్రామాలు, పట్టణాల్లో ఎంతో మార్పు వచ్చిందన్నారు. ప్రతి ఊరిలో ట్రాక్టర్ అందుబాటులోకి వచ్చిందని, నర్సరీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గొర్రెల సంపద ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణనే అని.. కాంగ్రెస్ ఎంతగా ఎద్దేవా చేసినా ఆ పథకాన్ని అమలు చేస్తామని, ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెపిల్లలను పంపిణీ చేస్తామని ప్రకటించారు. హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో 3.46 శాతం అటవీ ప్రాంతం పెరిగిందన్న విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. నిరుద్యోగ భృతిపై త్వరలో విధివిధానాలు.. రాష్ట్రంలో నిరుద్యోగులకు భృతి ఇస్తామన్న ప్రకటనకు కట్టుబడి ఉన్నామని సీఎం చెప్పారు. కోవిడ్ వల్ల కొంత జాప్యం జరిగిందని, కానీ కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. ఎవరిని నిరుద్యోగులుగా గుర్తించాలన్న విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉందని, దీనికి సంబంధించి త్వరలోనే విధివిధానాలు రూపొందించనున్నామని వెల్లడించారు. కరోనా సమయంలో పేరుకుపోయిన కరెంటు బిల్లులకు సంబంధించి ప్రజలకు మేలు చేసే నిర్ణయం తీసుకోవాలని మజ్లిస్ సభ్యుడు పాషాఖాద్రి కోరగా.. దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. -
ఆస్తులకు సర్కారు భరోసా
తల్లికి బిడ్డ.. రైతుకు భూమి బిడ్డ మీద తల్లికెంత మమకారం ఉంటుందో భూమిపై రైతుకు కూడా అంతే మమకారం ఉంటుంది. భూమి రైతు కుటుంబానికి ప్రాణ సమానం. ప్లాటు అయినా, ఇల్లు అయినా, వ్యవసాయ భూమి అయినా వివాదంలో ఇరుక్కుంటే అసలు యజమాని పరిస్థితి ఎలా ఉంటుందో నా పాదయాత్రలో కళ్లారా చూశా. గట్టు జరిపి ఒక రైతు భూమిని మరొకరు ఆక్రమిస్తే ఆ రైతన్న ఎంత క్షోభకు గురవుతారో మనకు తెలుసు. రాబందుల్లాంటి మనుషులు దొంగ రికార్డులు సృష్టించి భూములు కొట్టేయాలని స్కెచ్ వేస్తే చట్టపరంగా పోరాడే శక్తి లేని కుటుంబాల పరిస్థితి ఏమిటని మనమంతా ఆలోచించాలి. మార్చాలా వద్దా..? మీ ఆస్తికి మిమ్మల్నే అసలైన యజమానిగా ధ్రువీకరించే వ్యవస్థ ఉండాలా? వద్దా? మీ ఆస్తి రికార్డులు పదిలంగా ఉండాలా? వద్దా? మీ ఆస్తిని వేరెవరికో అమ్మేసే అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలా? వద్దా? మీ ఆస్తికి సంబంధించిన సరిహద్దులు, కొలతలు, అంగుళాలతో సహా కచ్చితంగా నిర్ధారణ చేయాలా? వద్దా? మీ భూమి కొలత ఏమిటో, అది ఏ ఆకారంలో ఉందో, రికార్డుల్లో కనిపించాలా? వద్దా? గిట్టని వారో, కబ్జారాయుళ్లో రాళ్లు పీకేసినా, గట్టు చెదరగొట్టినా చెక్కు చెదరని పత్రాలు, ఆధారాలు మీ దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉండాలని మీరు కోరుకుంటున్నారో? లేదో ఒక్కసారి ఆలోచించండి. – జగ్గయ్యపేట బహిరంగ సభలో సీఎం జగన్ సాక్షి, అమరావతి: ప్రజల ఆస్తులకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రాజెక్టు దేశానికే రోల్ మోడల్ కానుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి సంపాదించిన ఆస్తులు వివాదంలో చిక్కుకుంటే ఆ కుటుంబాలు పడే మానసిక వేదన మాటలకందనిదని, ఇలా ఎవరికీ జరగకూడదనే సంకల్పంతో స్థిరాస్తులపై యజమానులకు శాశ్వత హక్కులు కల్పించాలని నిర్ణయించామని ప్రకటించారు. సోమవారం కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో సర్వే రాయి వేసి ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం’ (రీ సర్వే) ప్రారంభించిన అనంతరం జగ్గయ్యపేటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీ మోపిదేవి వెంకట రమణ, ప్రభుత్వ విప్ ఉదయబాను, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం వివరాలివీ.. జగ్గయ్యపేట సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పవిత్ర సంకల్పంతో సర్వేకు శ్రీకారం.. భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలంటే రికార్డులు పక్కాగా ఉండాలి. భూముల రికార్డులు దోషరహితంగా ఉంటే కోర్టుల చుట్టూ తిరగాల్సిన తిప్పలు ఉండవు. మీ ఆస్తులకు మనందరి ప్రభుత్వం హామీగా ఉంటుందని మాట ఇస్తూ ‘వైఎస్సార్ జగనన్న భూహక్కు – భూరక్ష కార్యక్రమం’ ఇక్కడ నుంచే ప్రారంభిస్తున్నాం. దీనిద్వారా మీ పిల్లలు, వారసులకు మోసాలకు తావులేని విధంగా ఆస్తులపై హక్కులు కల్పిస్తాం. ఇందుకోసమే మొన్న అసెంబ్లీలో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని ఆమోదించాం. పవిత్ర సంకల్పంతో సర్వే ప్రారంభిస్తున్నాం. వందేళ్లలో ఎన్నో మార్పులు.. వందేళ్లలో దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. పాలకులు మారిపోయారు. స్వాతంత్య్రం వచ్చింది. రాజ్యాంగం, చట్టాలు, హక్కులు వచ్చాయి. ఒకప్పుడు రేడియో కూడా లేని గ్రామాలు ఉండేవి. ఇవాళ స్మార్ట్ ఫోన్ లేని మనిషి ఎక్కడున్నాడా? అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇంత మారినా 1920లో బ్రిటీష్ హయాం తరువాత ఇప్పటి వరకూ భూముల రీసర్వే జరగలేదు. పరిస్థితిని పూర్తిగా మార్చేందుకే.. రాష్ట్రంలో కొందరికి రికార్డుల్లో భూమి ఒక చోట ఉంటే అనుభవిస్తున్న భూమి మరో చోట ఉంది. సబ్ డివిజన్ సమస్యలున్నాయి. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరిస్తూ భూతద్దంతో వెతికినా ఒక్క పొరపాటు కూడా లేకుండా సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత ఆస్తి హక్కు పత్రం యజమానులకు ఇస్తాం. మిల్లీమీటర్లతో సహా కొలిచి మ్యాపు కూడా ఇస్తాం. ప్రతి రెవెన్యూ విలేజ్ పరిధిలో విలేజ్ మ్యాప్ ఉంటుంది. ప్రతి ఒక్కరి భూమికి ఆధార్ నెంబర్ మాదిరిగా యూనిక్ ఐడీ నెంబర్ కేటాయిస్తాం. ఆ నెంబర్‌తో భూమి ఎక్కడ ఉందో, సరిహద్దులు ఏమిటో సర్వే ద్వారా అంగుళాలతో సహా నిర్ధారణ అవుతుంది. అభ్యంతరాల స్వీకరణ కోసం గ్రామ/ వార్డు సచివాలయాల్లో పొందుపరిచి అనంతరం భూ యజమానికి శాశ్వత టైటిల్ ఇస్తాం. సర్వే పూర్తయిన గ్రామాల్లో సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు కూడా ప్రారంభిస్తాం. ప్రజలపై పైసా భారం ఉండదు.. ప్రజలపై పైసా కూడా భారం మోపకుండా మొత్తం సర్వే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుంది. రాళ్ల ఖర్చు కూడా భరిస్తుంది. సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల భాగస్వామ్యంతో రూ.1,000 కోట్ల వ్యయంతో ఈ పవిత్ర యజ్ఞం సాగుతుంది. 4,500 సర్వే బృందాలతో 17,600 రెవెన్యూ గ్రామాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మూడు దశల్లో సర్వే నిర్వహిస్తాం. 2023 నాటికి చివరి వార్డు, గ్రామంలో కూడా ఈ సర్వేను పూర్తి చేస్తాం. కబ్జాలతో కోట్లకు పడగ పరుల సొమ్ము పాము లాంటిదని పెద్దలు చెబుతారు. కబ్జా భూములతో కోట్లకు పడగెత్తాలనే దుర్మార్గమైన ఆలోచన చేసే వాళ్లు ఇవాళ ఉన్నారు. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ఇలాంటి ఘటనలు ఎన్నో విన్నా. ఇలాంటి అన్యాయం ఏ ఒక్కరికీ జరగరాదు. ప్రజలందరికీ మేలు చేయాలనే ఆరాటం, తాపత్రయంతోనే వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకానికి శ్రీకారం చుట్టాం. సమన్వయం లేక... ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేక భూ వివాదాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఆదాయం వస్తోందని రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్లు చేస్తోంది. ఆస్తిని అమ్ముతున్న వారు నిజమైన యజమానా? కాదా అనే ప్రశ్న లేకుండానే గతంలో రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. ఒకే భూమిని ఇద్దరు ముగ్గురికి విక్రయించిన సందర్భాలను చూస్తున్నాం. నష్ట పరిహారం హామీ కూడా.. ఎక్కడైనా ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా హక్కు పత్రాలు పొందిన వారికి ఆస్తిపై హక్కు లేదని తేలితే ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లిస్తుందనే హామీ ఇస్తున్నాం. ఇటువంటి చట్టం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. మన రాష్ట్రం దీనికి మొట్టమొదటిగా నాంది పలుకుతోంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరైనా భూములను ఎలాంటి భయం లేకుండా నిశ్చింతగా కొనుక్కోవచ్చు. ఏపీలో మొదలైన ఈ విప్లవాత్మక కార్యక్రమం దేశమంతా ప్రభావం చూపుతుంది. వ్యవస్థలో నిజాయితీ తెస్తామనే మాటకు కట్టుబడి అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ ద్వారా 18 నెలల్లో ఈ దిశగా ముందడుగు వేశామని మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నా. దేశంలోనే అతిపెద్ద రీ సర్వే ప్రారంభం దేశంలోనే అతి పెద్ద రీ సర్వే ఏపీలో ప్రారంభమైంది. కృష్ణా జిల్లాలోని తక్కెళ్లపాడులో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష’ పైలట్ ప్రాజెక్టు కింద రీ సర్వే పూర్తయిన కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో రైతులు, స్థిరాస్తి యజమానులకు సీఎం స్వయంగా హక్కు పత్రాలను అందజేశారు. తక్కెళ్లపాడు ట్రై జంక్షన్లో పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా సర్వేరాయి నాటిన అనంతరం మీట నొక్కి డ్రోన్లను గాలిలోకి పంపించారు. ఆధునిక విధానంలో రూపొందించిన సర్వే మ్యాపు (గ్రామపటాన్ని) పరిశీలించారు. సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్, స్టాంపులు, రిజిస్ట్రేషన్, పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల స్టాళ్లను తిలకించారు. సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డుల విభాగం స్టాల్లో ప్రదర్శించిన 1866 నాటి రీసర్వే సెటిల్మెంట్ రిజిష్టర్, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ (ఎఫ్ఎంబీ)లను సీఎం పరిశీలించారు. సర్వే ఆఫ్ ఇండియా స్టాల్లో ఆధునిక పద్ధతుల గురించి సంస్థ డీజీ గిరీష్‌కుమార్ వివరించారు. -
ప్రక్షాళనకు ప్రణాళిక
వచ్చేనెల 15 నుంచి డిసెంబర్ వరకు భూముల రికార్డులు సరిచేసే ప్రక్రియ ► కొత్త రికార్డుల ఆధారంగానే పెట్టుబడి సాయం పథకం ► సెప్టెంబర్ 1 నుంచి గ్రామాల్లో రైతు సంఘాల ఏర్పాటు ► ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక్కో బృందం ► సీఎంతోపాటు ప్రజాప్రతినిధులకు ఒక్కో యూనిట్ బాధ్యత ► నెల రోజులపాటు గ్రామ సభలు.. అందరి సహకారంతో కొత్త రికార్డులకు రూపు.. ముందుగా వివాదాల్లేని భూములు.. తర్వాత కోర్టుల్లో ఉన్న భూములు ► తుది రికార్డులు ఆన్లైన్లో నమోదు ► రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సరళతరం.. కొత్త పాస్ పుస్తకాలు కొరియర్ ద్వారా రైతు చెంతకు ► భూముల సర్వే, రికార్డుల ప్రక్షాళనపై ► ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష భూముల సర్వే, రికార్డుల ప్రక్షాళనపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సాక్షి, హైదరాబాద్ భూవివాదాల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్రంలో రికార్డులను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ వరకు మూడు నెలల వ్యవధిలో అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు తేదీలను ఖరారు చేశారు. ప్రక్షాళన చేసిన రికార్డుల ఆధారంగానే రైతులకు వ్యవసాయ పెట్టుబడి పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1 నుంచి రైతు సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. భూముల సర్వే, రికార్డుల ప్రక్షాళన, రిజిస్ట్రేషన్ల విధానంలో మార్పులు తదితర అంశాలపై బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జోగు రామన్నతోపాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనకు అవలంబించాల్సిన పద్ధతులపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘనందన్ రావు నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించారు. భూరికార్డులు సక్రమంగా, సమగ్రంగా ఉంటేనే పెట్టుబడి పథకం విజయవంతమవుతుందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ‘‘భూ రికార్డులను ప్రక్షాళన చేయడం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. ఏ భూమి పరిస్థితి ఏంటో తెలియడం వల్ల వివాదాలు, ఘర్షణలకు తావుండదు. నిజానికి ఇది పెద్ద సవాల్. చాలా పీటముళ్లుంటాయి. కానీ చిత్తశుద్ధి ఉంటే చేయడం అసాధ్యం కాదు. రికార్డుల ప్రక్షాళన జరిగితే భూ దందాలు కూడా బంద్ అవుతాయి’’అని సీఎం అభిప్రాయపడ్డారు. ‘‘భూ రికార్డులను సరిచేసే కార్యక్రమం సెప్టెంబర్ 15న పెద్దఎత్తున ప్రారంభం కావాలి. అన్ని మండలాల్లో ప్రారంభ కార్యక్రమం నిర్వహించాలి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తలా మూడు గ్రామాలను తీసుకుని ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనాలి. నేను కూడా మూడు గ్రామాలు ఎంపిక చేసుకుంటా. వ్యవసాయ, రెవెన్యూ శాఖ ఉద్యోగులు, రైతు సంఘాలు చురుకైన పాత్ర పోషించాలి. సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా క్రియాశీల పాత్ర పోషించాలి. ఈ ప్రక్షాళనకు కొంతమంది ఉద్యోగులను కూడా తాత్కాలిక పద్ధతిపై తీసుకుంటాం’’ అని ముఖ్యమంత్రి తెలిపారు. సమస్త భూముల వివరాల సేకరణ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా రైతుల అధీనంలో ఉన్న వ్యవసాయ భూములతోపాటు గ్రామంలో అటవీ, ప్రభుత్వ, దేవాదాయ, ప్రజోపయోగ కార్యక్రమాల కోసం వినియోగిస్తున్న భూములతోపాటు ప్రభుత్వ భవనాల కింద, చెరువులు, కుంటల కింద ఉన్న భూముల వివరాలన్నీ సేకరించాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయేత అవసరాలకు బదిలీ చేసిన వ్యవసాయ భూములు, ప్రభుత్వం సేకరించిన భూ వివరాలు, అసైన్ చేసిన వివరాలు కూడా నమోదు చేయాలన్నారు. అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేసుకునే పేదలకు కూడా పెట్టుబడి పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. గ్రామ కంఠాన్ని కూడా నిర్ధారించాలని సూచించారు. మొదటి దశలో వివాదాల్లేని భూములు రికార్డులను సరిచేయాలని చెప్పారు. రెండో దశలో రాష్ట్రంలోని మొత్తం భూభాగాన్ని సర్వే చేయించి, కొత్త మ్యాపులు రూపొందిస్తామన్నారు. తెలంగాణ భూభాగంలో జరిగే మార్పులు ఎప్పటికప్పుడు వెంటనే నమోదయ్యేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సీఎం చెప్పారు. పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు.. రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా జరగాలని సీఎం ఆదేశించారు. ‘‘క్రయ విక్రయాలు జరిపే రైతులిద్దరూ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాలి. రిజిస్ట్రార్‌కు ఇద్దరి పాస్ పుస్తకాలు ఇవ్వాలి. రిజిస్ట్రార్.. అమ్మే వారి పాస్ పుస్తకం నుంచి భూమిని తొలగించి కొనేవారి పాస్ పుస్తకంలో ఎంటర్ చేయాలి. ఆ రెండు పాస్ పుస్తకాలను కొరియర్ ద్వారా ఎమ్మార్వోకు పంపాలి. నాలుగు పని దినాల్లో ఎమ్మార్వో ఆ క్రయ విక్రయాలకు సంబంధించిన వివరాలు తన కార్యాలయంలోని రికార్డుల్లో నమోదు చేసుకోవాలి. పాస్ పుస్తకాలపై అటెస్ట్ చేయాలి. పేరు మార్పిడి చేయాలి. తిరిగి రిజిస్ట్రార్‌కు పంపాలి. రిజిస్ట్రార్ తన రికార్డుల్లో నమోదు చేసుకుని కొరియర్ ద్వారా రైతులకు పంపాలి. అమ్మేవారు.. కొనేవారు ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రార్ ఆఫీస్‌కు రావాలి. తిరగడం, పైరవీలు చేసే పని ఉండకూడదు’’అని స్పష్టంచేశారు. కొత్త పాస్ పుస్తకాలు రూపొందించండి పాస్ పుస్తకాలు, పహాణీల నిర్వహణ మరింత సరళతరం చేయాలని, అవసరం లేని కాలమ్స్ తీసేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ‘‘పాస్ పుస్తకాలు కొత్తవి ఇవ్వాలి. నీటిలో పడినా తడవకుండా, పాడవకుండా ఉండేలా నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. పాస్ పుస్తకాల సైజు తగ్గించాలి. స్టాంపుల చట్టాలను, రిజి స్ట్రేషన్ చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అవసరమైన మార్పులు చేయాలి. భవిష్యత్‌లో ప్రతీ మండలానికి ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలి. వీలైతే ఎమ్మార్వోకే రిజిస్ట్రేషన్ కూడా చేసే అధికారం ఇచ్చే అవకాశాలు పరిశీలించాలి. రెవెన్యూ కోర్టులు కూడా ఇన్ని ఉండాలా? కేవలం కలెక్టర్ వద్ద ఒక్క కోర్టు మాత్రమే నిర్వహించాలా? అనే విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయకుండా నిషేధిత జాబితా తయారు చేయాలి. ఆ భూములు రిజిస్ట్రేషన్ కాకుండా సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయాలి’’ అని సీఎం అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాదికి కాళేశ్వరం ‘‘రైతులకు కావాల్సింది సాగునీరు, పెట్టుబడి, గిట్టుబాటు ధర. ఇప్పటికే రాష్ట్రంలో సాగునీరు అందివ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది నాటికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా దాదాపు 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది’’అని సీఎం వెల్లడించారు. ‘‘పాలమూరు, సీతారామ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. అవసరం ఉన్నంత ఉచిత విద్యుత్ అందడం వల్ల రైతులు భూగర్భ జలాలను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోగలుగుతున్నారు. తర్వాత దశలో గిట్టుబాటు ధర కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైతులను సంఘటితం చేసే పనికి ప్రభుత్వమే పూనుకుంది. రైతులు సంఘటితమై గిట్టుబాటు ధర పొందే ప్రణాళిక కూడా అమలు చేస్తున్నాం’’అని వివరించారు. ఇకపై అంతా ఆన్లైన్లో.. భూ రికార్డులు సరిచేసిన తర్వాత ఆ వివరాలన్నీ ఆన్లైన్లో పెట్టాలని, ఆ తర్వాత చిన్న మార్పు జరిగినా ఆన్లైన్లో తెలిసిపోవాలని సీఎం సూచించారు. ‘‘బ్యాంకులు అనుసరించే కోర్ బ్యాంకింగ్ విధానంలా భూ రికార్డుల నిర్వహణ జరగాలి. ఏటీఎం ద్వారా ఏ బ్యాంకులో, ఏ ప్రదేశంలో డబ్బులు విత్ డ్రా చేసుకున్నా వెంటనే తెలిసిపోతుంది. అదే తరహాలో పాస్ పుస్తకాల్లో ఎక్కడ మార్పు జరిగినా అంతటా తెలిసిపోవాలి. అందుకు ప్రతీ రెవెన్యూ కార్యాలయంలో ఒక ఐటీ అధికారిని నియమించాలి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా రెవెన్యూ శాఖలో వెయ్యి మందిని నియమించాలి. తగిన సామర్థ్యం ఉన్న కంప్యూటర్లు, ఇంటర్నెట్ కనెక్షన్‌తో అన్ని రెవెన్యూ కార్యాలయాల అనుసంధానం జరుగుతుంది’’అని ముఖ్యమంత్రి వివరించారు. 1,100 యూనిట్లు.. 3,600 బృందాలు.. ఒక్కో రెవెన్యూ గ్రామాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. రాష్ట్రం మొత్తాన్ని 1,100 యూనిట్లుగా విభజించారు. మొత్తం 3,600 బృందాలను ఎంపిక చేస్తారు. రెవెన్యూ అధికారి, వ్యవసాయాధికారి, గ్రామ రైతు సంఘం సమన్వయంతో ఒక్కో గ్రామంలో ఒక్కో బృందం నెల రోజుల పాటు ఉండి గ్రామ సభలు నిర్వహిస్తుంది. రైతులందరి సహకారం, అంగీకారంతో భూ రికార్డులను సరిచేస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఒక్కో యూనిట్‌కు బాధ్యత తీసుకుని భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. అందుకే ఈ ప్రక్షాళన.. ‘‘1932–36 మధ్య నిజాం హయాంలో భూ సర్వే జరిగింది. మళ్లీ జరగలేదు. భూ రికార్డుల నిర్వహణ గందరగోళంగా ఉంది. వ్యవసాయ శాఖ వద్ద వివరాలకు, రెవెన్యూ శాఖ వద్ద ఉన్న వివరాలకు పొంతన లేదు. దీంతో ప్రభుత్వం ఇవ్వాలనుకునే పెట్టుబడి సాయం ఏ ప్రాతిపదికన అందించాలో తెలియని పరిస్థితి. ఈ పొరపాట్లతో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగే అవకాశం ఉంటుంది. మంచి చేయబోతే చెడు అవుతుంది. అందుకే ఏ భూమి ఎవరి అధీనంలో ఉందో, పెట్టుబడి ఎవరికి అందాలో తెలుసుకునేందుకే ఈ ప్రక్షాళన చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి వివరించారు. వివాదాల్లేనివి ఫస్ట్.. ఎలాంటి వివాదాలు లేని భూములు దాదాపు 85 నుంచి 95 శాతం వరకు ఉంటాయని అంచనా. ఈ భూములకు సంబంధించిన రికార్డులన్నింటినీ ముందు గా ప్రక్షాళన చేస్తారు. పేర్ల మార్పిడి, క్రయ విక్రయాలు జరిగిన వివరాలు తీసుకుంటారు. రికార్డులకు తుదిరూపం ఇస్తారు. వాటిని ఆన్లైన్లో ఉంచుతారు. రెండో దశలో వివాదాస్పద భూములకు సంబంధించి పరిష్కార మార్గాలు చూస్తారు. కోర్టు వివాదాలుంటే, తీర్పులననుసరించి యాజమాన్య హక్కులను నిర్ణయిస్తారు. డిసెంబర్ నెలాఖరు నాటికి రికార్డులన్నీ సరిచేసి ఆన్లైన్లో పొందుపరుస్తారు. దీని ఆధారంగానే రైతులకు పెట్టుబడి పథకం అమలు చేస్తారు. ఇదీ కార్యాచరణ.. సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు గ్రామ రైతు సంఘాల సమన్వయ సమితి ఏర్పాటు. గ్రామంలో వ్యవసాయ భూమి ఉన్నవారంతా రైతు సంఘంలో సభ్యులుగా ఉంటారు. 11 మందితో సమన్వయ సమితులు ఏర్పాటవుతాయి. సెప్టెంబర్ 10 నుంచి 15 వరకు మండల స్థాయిలో సమితుల సదస్సుల నిర్వహణ సెప్టెంబర్ 15న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు రెవెన్యూ గ్రామం యూనిట్‌గా రికార్డుల ప్రక్షాళన. -
అనుమతి లేకుండా సర్వే ఎలా చేశారు?
ఓ పట్టాదారు ఆవేదన ఏకమైన గ్రామ నాయకులు సర్వే నిలిపివేసిన అధికారులు భోగాపురం: తన సమ్మతి లేకుండా తన భూమిని ఏవిధంగా సర్వే చేస్తారని పట్టాదారు కొండపు లక్ష్మమ్మ సర్వే బృందాన్ని అడ్డుకుంది. వివరాలిలా ఉన్నాయి. విజయ నగరం జిల్లా భోగాపురం మండలంలోని కవులవాడ పంచాయతీ మరడపాలెంలో గురువారం ప్రత్యేక డిప్యూటీ కలెక్టరు ఆధ్వర్యంలో సర్వే బృందం సర్వే చేపట్టారు. లక్ష్మమ్మా నీ భూమిలో అధికారులు ఎయిర్‌పోర్టు సర్వే చేస్తున్నారు అంటూ పక్క రైతులు ఆమెకు సమాచారం అందించారు. అంతే ఆమె లబోదిబో మంటూ గ్రామంలో పెద్దలైన కొండపు రమణ, కొండపు నర్సింగరావు, కొత్తయ్య రెడ్డి, కొండపు రామలక్ష్మణ రెడ్డిల వద్దకు పరుగుపెట్టింది. దీంతో వారంతా సర్వే జరుగుతున్న చోటుకి వెళ్లి సమ్మతి ఇవ్వని భూముల్లో సర్వే ఏవిధంగా చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. దీనికి సర్వే బృందం అధికారులు మాట్లాడుతూ సదరు సర్వే నంబరుపై సమ్మతి పత్రం అందినందునే సర్వే చేపట్టినట్లు తెలిపారు. కొండపు లక్ష్మమ్మకు భర్త చనిపోయాడు. అమెకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా ఒక కుమారుడు చనిపోయాడు. ఆమె పేరు (కొండపు లక్ష్మమ్మ భర్త లేటు అప్పలరాముడు) మీద కవులవాడ రెవెన్యూలో సర్వే నం. 102/13పి ఎ.0.70 సెంట్లు, 103/29పి ఎ. 0.36 సెంట్లు, 103/28పి ఎ. 0.26 సెంట్లు, 104/38 ఎ. 0.28 సెంట్లు వెరసి 1.60ఎకరాల భూమి ఉంది. ఇంకా వాటాలు వేసుకోలేదు అంతా ఉమ్మడి ఆస్తి. చనిపోయిన కుమారుడి భార్య కొండపు రమణమ్మ తన అత్త, ఆడపడుచులు, మరిదికి కూడా చెప్పకుండా..ఆమె సోదరుడు నీలాపు లక్ష్మణతో కలిసి ఉమ్మడి ఆస్తి అయిన భూమిని ఎయిర్‌పోర్టుకి ఇచ్చేందుకు సర్వే బృందానికి సమ్మతి తెలిపింది. అయితే భూమి ఎవరికీ వాటాలు వేయలేదు కొండపు లక్ష్మమ్మ పేరుమీద ఉండగానే సర్వే ఎలా చేస్తారని గ్రామపెద్దలు అడ్డుకోవడంతో సిబ్బంది సర్వే నిలుపుదల చేశారు. ఎవరైనా సమ్మతి తెలిపినప్పుడు వారి రికార్డులు పూర్తిగా పరిశీలించకుండా సర్వేకి ఏ విధంగా వస్తున్నారని గ్రామస్తులు అధికారులను నిలదీయడంతో వారంతా ఆ స్థలంలో సర్వేను నిలిపివేసి వెళ్లిపోయారు. -
'కొవ్వాడలో భూముల సర్వేకు ఒప్పుకోం'
శ్రీకాకుళం (ఎచ్చెర్ల) : రణస్థలం మండలం కొవ్వాడలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన అణువిద్యుత్ కేంద్రానికి ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సోమవారం మధ్యాహ్నం కోటపాలెం, అల్లివలస ప్రాంతాల్లో భూముల సర్వే కోసం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సీతారామారావు, తహసీల్దార్ ఎం. సురేష్ వచ్చారు. దాంతో అక్కడి ప్రజలు వారిద్దరినీ అడ్డుకున్నారు. కలెక్టర్ ప్రజలకు ప్యాకేజీలు ఇస్తామని, పునరావసం కల్పిస్తామని ఆయన చెప్పిన గ్రామస్థులు ఒప్పుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అణువిద్యుత్తు కేంద్రంతో ఈ ప్రాంతం నాశనమైపోతుందని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నిర్మాణ పనులకు ఎలా పూనుకుంటున్నారంటూ గ్రామస్థులు అధికారులను నిలదీశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో రణస్థలం ఎస్సై సత్యనారాయణ రంగం ప్రవేశం చేశారు. భూమల సర్వే కోసం వచ్చిన కలెక్టర్ సీతారామారావును అధికారులను ఎస్సై అక్కడి నుంచి తీసుకెళ్లారు. -
ఎయిర్‌పోర్టు నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత
-
భూములు సర్వే చేయలేదని ధర్నా
రాజంపేట: తమ భూములు సర్వేచేయడం లేదంటూ రాజంపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట గురవారం దళితులు ధర్నా చేపట్టారు. అగ్రవర్ణాలకు చెందిన వారి భూములు సర్వే చేస్తూ తమ భూములు సర్వే చేయకపోవడం అన్యాయం అంటూ రాజంపేట పరిధిలోని ఆర్కేపాడు, ఆకేపాడు, లింగం హరిజనవాడ, కట్టకిందపల్లి గ్రామాలకు చెందిన దళితులు ఆందోళన చేశారు. ఎమ్మార్వో అందుబాటులో లేకపోవడంతో మరో అధికారికి ఈ విషయం గురించి దళితులు వినతి పత్రం సమర్పించారు. -
బుల్లి పెట్టెలోకి భూ వివరాలు
ఏలూరు :జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర భూముల వాస్తవ పరిస్థితులను గుర్తించే నిమిత్తం సమగ్ర సర్వే చేపట్టేం దుకు యంత్రాంగం రంగంలోకి దిగింది. జాతీయ భూమి రికార్డుల నవీ కరణ కార్యక్రమం (నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రాజెక్ట్) కింద తక్షణమే భూముల సర్వే చేపట్టి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సర్కారు ఆదేశించింది. సర్వేలో వెలుగు చూసిన భూముల వాస్తవ పరిస్థితుల వివరాలను కంప్యూటరీకరించాలని స్పష్టం చేసింది. అనంతరం వివరాలను ఆన్‌లైన్‌తో అనుసంధానించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ కార్యక్రమం అంతా శాటిలైట్ సర్వేకు అనుగుణంగా సాగించాలంటూ మార్గదర్శకాలు ఇచ్చింది. దీంతో జిల్లాలోని రెవెన్యూ యంత్రాంగం భూమి రికార్డులతో కుస్తీ పడుతోంది. రికార్డులు సిద్ధమేనా? సమగ్ర భూ సర్వేను ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు సమన్వయంతో చేయాల్సి ఉంది. 1954 నుంచి 2014 వరకు అడంగల్స్ మార్పు లు, చేర్పులను సైతం నమోదు చేయా ల్సి ఉంది. అయితే, 1954 నుంచి పూర్తిస్థాయిలో రికార్డులు లభ్యమవుతాయా.. లేదా అన్న ఆందోళనలో యంత్రాంగం ఉంది. దీనికి తోడు అన్ని మండలాల్లో సర్వేయర్ల పోస్టులు భర్తీ కాలేదు. దాదాపుగా 15 మండలాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సమగ్ర సర్వేకు ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. గుబులు రేపుతున్న అసైన్డ్ భూములు కుకునూరు, వేలేరుపాడు విలీనం కాకముందు జిల్లాలో ఉన్న 46 మండలాల్లో 61వేల 456 మందికి 92వేల 356 ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వాలు పంపిణీ చేశాయి. జిల్లా కేంద్రమైన ఏలూరు సమీపంలోనూ ఈ తరహా భూములను పంపిణీ చేశారు. వీటిని బడా బాబులు చేపల చెరువులుగా మార్చేశారు. మరికొన్ని భూములు కబ్జా కోరల్లో ఉన్నాయి. వీటిల్లో చాలా భూములను రెవెన్యూ వర్గాల కనుసన్నల్లోనే వివిధ అవసరాలకు మార్పిడి చేసుకున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో వారి నుంచి భూముల వాస్తవ సమాచారం, భూములు లెక్కలు బహిర్గతం అవుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏప్రిల్ నుంచి ప్రత్యక్ష పరిశీలన భూముల రికార్డులను నవీకరించిన అనంతరం ఏప్రిల్ 1నుంచి క్షేత్ర స్థాయిలో భూముల ప్రత్యక్ష పరిశీలన కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే భూమి లెక్కులు ఉన్నాయా లేదా అనే అంశాలపై బృందాల వారీగా ప్రత్యక్ష పరిశీలన జరపాల్సి ఉంటుంది. భూమి రికార్డుల నవీకరణ చేస్తున్న మాట వాస్తమేనని జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు తెలిపారు. భూ వివాదాలను పరిష్కరించడానికి ఈ సర్వే ఉపకరిస్తుందన్నారు. అన్ని మండలాల్లోను భూమి రికార్డుల్లో మార్పులు, చేర్పులు చేసి గ్రామాల వారీగా వాటిని నోటీస్ బోర్డుల్లో ఉంచుతామని, వాటిపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తామని ఆయన చెప్పారు.