రెండ్రోజుల్లో పీఆర్సీ ప్రకటన: సీఎం కేసీఆర్‌ | PRC To Be Announced In Two Days: CM KCR | Sakshi
Sakshi News home page

రెండ్రోజుల్లో పీఆర్సీ ప్రకటన: సీఎం కేసీఆర్‌

Published Thu, Mar 18 2021 3:47 AM | Last Updated on Thu, Mar 18 2021 5:16 AM

PRC To Be Announced In Two Days: CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో రెండు మూడు రోజుల్లో గౌరవప్రదంగా ఉండే ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులకు మెరుగైన వేతనాలిచ్చే పద్ధతి కొనసాగుతోందన్న వాస్తవం మరోసారి ప్రపంచానికి స్పష్టమవుతుందని చెప్పారు. విభజన తర్వాత ఏర్పడే తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని, అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు మంచి జీతాలు అందుతాయని తాను అప్పట్లో చెప్పానని గుర్తు చేశారు. తాజా వేతన సవరణ ఫిట్‌మెంట్‌తో అది మరోసారి తేటతెల్లం అవుతుందని పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ, శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్‌ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానమిచ్చారు. కరోనా ప్రభావం వల్ల గత ఏడాది కాలంలో రాష్ట్రం రూ.లక్ష కోట్లమేర నష్టపోయిందని.. అందులో రూ.52 వేల కోట్ల మేర ప్రత్యక్ష ఆదాయాన్ని కోల్పోయామని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పీఆర్సీ విషయంలో కట్టుబడి ఉన్నామని.. రెండు మూడు రోజుల్లో అసెంబ్లీ వేదికగానే ప్రకటన ఉంటుందని వెల్లడించారు.

ఈసారీ ధాన్యం కొంటాం..
కరోనా కష్టకాలంలోనూ రైతులకు మేలు చేయడం కోసం ధాన్యం కొనుగోలు చేయనున్నట్టు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ప్రస్తుతం మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. దాని ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, మారుమూల ఊర్లలో పొలాల వద్దనే ధాన్యం కొనే ఏర్పాటుపై యోచిస్తున్నామని తెలిపారు. మిగతా ప్రాంతాల్లో మార్కెట్‌ యార్డుల్లోనే కొనుగోలు చేస్తామన్నారు. అయితే రైతులు కూడా న్యాయబద్ధంగా ఆలోచించాలని పేర్కొంటూ తేమ విషయాన్ని ప్రస్తావించారు. మార్కెట్లకు పచ్చివడ్లు తెచ్చి కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేయటం సరికాదన్నారు. ధాన్యాన్ని ఆరబెట్టి తేమలేకుండా చేశాకే మద్దతు ధరకు కొననున్నట్టు తేల్చి చెప్పారు. కేంద్ర వ్యవసాయ చట్టానికి సంబంధించి రైతులు ఆందోళనలు చేస్తున్నారని.. అయితే ఆ చట్టం రైతుల మేలుకేనని తనతో ప్రధాని చెప్పారని వివరించారు. ప్రస్తుతం ఆ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున దానిపై ఎక్కువగా మాట్లాడటం సరికాదని చెప్పారు. కొత్త చట్టంలో భాగంగా మార్కెట్‌ యార్డులను మూసే యాలని కేంద్రం నిర్ణయిస్తే.. రాష్ట్రంలో మాత్రం కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. కేంద్ర అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ కొన్ని రాష్ట్రాలు అసెంబ్లీల్లో తీర్మానాలు చేసినందున.. రాష్ట్రంలోనూ చేయాలన్న కాంగ్రెస్‌పక్ష నేత భట్టి విక్రమార్క సూచనను సీఎం కేసీఆర్‌ కొట్టిపడేశారు. కేంద్ర చట్టాన్ని అసెంబ్లీ తీర్మానాలు నిలువరించలేవని గుర్తు చేశారు.

త్వరలో భూముల సమగ్ర సర్వే..
రాష్ట్రంలోని భూములన్నింటిపై సమగ్ర సర్వే చేయనున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు డిజిటల్‌ సర్వే కోసం బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు. అక్షాంశ రేఖాంశాల ఆధారంగా భూముల హద్దులను నిర్ధారిస్తామని.. ఇకపై ఎవరూ భూముల రికార్డులను ట్యాంపర్‌ చేయలేరని తేల్చి చెప్పారు. దేశంలోనే ‘ధరణి’ఓ విప్లవాత్మక ప్రాజెక్టు అని సీఎం కేసీఆర్‌ అభివర్ణించారు. దీనిపై కేంద్ర విభాగాలతోపాటు 16 రాష్ట్రాల బృందాలు అధ్యయనం చేస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో 2.77 కోట్ల ఎకరాల భూమి ఉండగా.. అందులో 1.50 కోట్ల ఎకరాల వివరాలు ధరణి వెబ్‌సైట్లో నమోదయ్యాయని చెప్పారు. అప్పట్లో రికార్డులు సరిగా లేక వీఆర్వో రాసిందే రాత, ఎమ్మార్వో గీసిందే గీతగా ఉండేదని.. ఇక ముందు ఎమ్మార్వో కార్యాలయాల్లో భూలావాదేవీలు జరిగే వీలు లేకుండా చేస్తున్నామని పేర్కొన్నారు. కొత్త విధానంతో ఇప్పటివరకు 3.30 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. 1.08 లక్షల పెండింగ్‌ మ్యూటేషన్స్‌ను కూడా క్లియర్‌ చేశామని తెలిపారు. ధరణిలో చిన్నచిన్న సమస్యలున్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. దాదాపు నాలుగైదు లక్షల మంది రైతులకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని.. వాటి పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పామని.. ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని వివరించారు.

మళ్లీ కరోనా పంజా.. స్కూళ్లపై త్వరలో నిర్ణయం
కొద్దిరోజులుగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలో విద్యా సంస్థలు కొనసాగించాలా, వద్దా అన్నదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కొన్నిరోజులుగా పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు కోవిడ్‌ సోకుతున్న నేపథ్యంలో భయాంతోళనలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన విషయమైనందున దీనిపై రెండుమూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. 

ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ కొనసాగుతుంది
ఉమ్మడి రాష్ట్రం నాటి సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లను సమూలంగా మార్చి.. రీడిజైన్‌తో చేపట్టిన పనులు అద్భుత ఫలితాలనిస్తున్న విషయం అంతా గమనిస్తున్నారని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇక ముందు కూడా రీడిజైనింగ్‌ కొనసాగిస్తామన్నారు. 2014లో తెలంగాణ ప్రాంతంలో 12.23 లక్షల ఎకరాలు సాగులో ఉంటే.. ఇప్పుడు 52.28 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయని గుర్తు చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ కంటే రెండున్నర రెట్లు ఎక్కువన్నారు. ఈ విషయంగా దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. ఈ ఘనత ఉపన్యాసాలతో వచ్చింది కాదని, వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, కష్టపడితే వచ్చిందని తెలిపారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఉచిత విద్యుత్‌ పథకం మొదలైందన్న విషయాన్ని ఒప్పుకొంటామని.. దాన్ని తాము మరింత మెరుగ్గా అమలు చేస్తున్నామని కేసీఆర్‌ చెప్పారు. నిండుగా నీరు పారుతున్న వరద కాల్వలపై రైతులు వేల సంఖ్యలో మోటార్లు పెట్టుకుని నీరు లాగుతున్నా.. వారు పాకిస్థానీయులు కాదు మనవాళ్లే అన్న ఉద్దేశంతో కొనసాగించేందుకు సహకరిస్తున్నామన్నారు.

ప్రస్తుత యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయని.. తాను, తన కొడుకు కేటీఆర్‌ కలిపి 70 ఎకరాల్లో నాట్లు వేయించామని వెల్లడించారు. గతంలో 58 ఏళ్లలో 128 ఎకరాల్లో పాలీహౌజ్‌లు ఏర్పాటు చేయిస్తే.. ఇప్పుడా సంఖ్య 1,325 ఎకరాలకు పెరిగిందని, సబ్సిడీ పరిమితి కూడా పెంచామని కేసీఆర్‌ గుర్తు చేశారు. ఫసల్‌ బీమా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేస్తామన్నారు. రుణ మాఫీని వందశాతం అమలు చేస్తున్నామన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం స్వయంగా తానే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తానని, పకడ్బందీ చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. కోవిడ్‌ వల్ల కొంత జాప్యం జరిగిందన్నారు. పేదరికంలో మగ్గుతున్న దళిత, గిరిజనుల పరిస్థితి చూస్తే బాధగా ఉంటుందని, వారికి న్యాయం కలిగేలా ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తున్నామని చెప్పారు. నిధులను దారి మళ్లించకుండా, మిగిలినవి క్యారీ ఫార్వర్డ్‌ అయ్యేలా చూస్తున్నామన్నారు. చమురు ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పాత్ర ఉండదని స్పష్టం చేశారు.

న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐకి ఇవ్వం
న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితులెవరైనా వదిలే ప్రసక్తే లేదని, ఈ కేసును నిస్పాక్షికంగా దర్యాప్తు చేయిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆ కేసులో టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడి పేరు రాగానే.. పార్టీ నుంచి సస్పెండ్‌ చేశామని, ఆ వ్యక్తి ప్రస్తుతం జైలులో ఉన్నాడని గుర్తు చేశారు. ఇప్పటికే పోలీసులు కుంట శ్రీను, శ్రీనివాస్, చిరంజీవి, అక్కప్ప కుమార్, లచ్చయ్య, వసంతరావు అనే వ్యక్తులను అరెస్టు చేశారన్నారు. తెలంగాణ పోలీసులకు దేశంలోనే మంచి పేరుందని, వారిని అవమానించేలా కేసును సీబీఐకి ఇవ్వాలన్న డిమాండ్‌ సరికాదని పేర్కొన్నారు. విద్యుత్‌ విషయంలో రాష్ట్రం గొప్పగా ఉందని, ట్రాన్స్‌మిషన్‌ కెపాసిటీ 13,900 మెగావోల్టుల నుంచి 37 వేల మెగావోల్టులకు పెరిగిందని స్వయంగా సీఈఏ ఆడిట్‌ సంస్థ తేల్చిందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. కాంగ్రెస్‌ హయాం నాటి చీకట్లు పోయి ఇప్పుడు రాష్ట్రం వెలుగులు విరజిమ్ముతోందన్నారు. జూబ్లీహిల్స్‌లో ధనవంతులు తాగే మినరల్‌ వాటర్‌ కంటే శ్రేష్టమైన నీటిని మిషన్‌ భగీరథలో అందిస్తున్నామన్నారు.

నీటి నాణ్యతను నిత్యం 70 ప్రాంతాల్లో పరీక్షిస్తున్నట్టు చెప్పారు. మంచినీటికి సంబంధించి 2014కు ముందు పదేళ్లలో రూ.4,198 కోట్లు ఖర్చు చేస్తే.. తాము గత ఆరున్నరేళ్లలో రూ.32,500 కోట్లు ఖర్చు చేశామన్నారు. 58 ఏళ్లలో 17,769 వాటర్‌ ట్యాంకులు ఏర్పాటు చేస్తే.. తాము ఐదేళ్లలోనే 19,733 ట్యాంకులు నిర్మించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శుద్ధి చేసిన నీళ్లు అందుతున్నట్టు కేంద్రం పార్లమెంటుకు వివరాలు సమర్పించిందని గుర్తు చేశారు. కాకతీయుల నాటి 75 వేల చెరువులను ధ్వంసం చేసి.. 45 వేల చెరువులను తాంబాలాలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం మిగిలించిందని.. తాము ఎండాకాలంలో కూడా మత్తడి దూకేలా చెరువులను పునరుద్ధరించామని సీఎం చెప్పారు. అప్పట్లో తన పొలంలో 37 బోర్లు వేస్తే ఐదు మాత్రమే సక్సెస్‌ అయ్యాయని.. ఇప్పుడు దేశంలోనే ఎక్కువగా భూగర్భజలమట్టం పెరిగిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు.

ఊర్లలో ఎంతో మార్పు వచ్చింది
కాంగ్రెస్‌ హయాంలో రిజర్వాయర్ల సామర్థ్యం 14 టీఎంసీలుగా ఉంటే.. తాము 227.77 టీఎంసీల స్థాయికి తీసుకెళ్లేలా ప్రాజెక్టులను రూపొందించామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వల్ల గ్రామాలు, పట్టణాల్లో ఎంతో మార్పు వచ్చిందన్నారు. ప్రతి ఊరిలో ట్రాక్టర్‌ అందుబాటులోకి వచ్చిందని, నర్సరీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గొర్రెల సంపద ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణనే అని.. కాంగ్రెస్‌ ఎంతగా ఎద్దేవా చేసినా ఆ పథకాన్ని అమలు చేస్తామని, ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెపిల్లలను పంపిణీ చేస్తామని ప్రకటించారు. హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో 3.46 శాతం అటవీ ప్రాంతం పెరిగిందన్న విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. 

నిరుద్యోగ భృతిపై త్వరలో విధివిధానాలు..
రాష్ట్రంలో నిరుద్యోగులకు భృతి ఇస్తామన్న ప్రకటనకు కట్టుబడి ఉన్నామని సీఎం చెప్పారు. కోవిడ్‌ వల్ల కొంత జాప్యం జరిగిందని, కానీ కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. ఎవరిని నిరుద్యోగులుగా గుర్తించాలన్న విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉందని, దీనికి సంబంధించి త్వరలోనే విధివిధానాలు రూపొందించనున్నామని వెల్లడించారు. కరోనా సమయంలో పేరుకుపోయిన కరెంటు బిల్లులకు సంబంధించి ప్రజలకు మేలు చేసే నిర్ణయం తీసుకోవాలని మజ్లిస్‌ సభ్యుడు పాషాఖాద్రి కోరగా.. దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement