లింగంపేట (ఎల్లారెడ్డి): చెరువు కింద కాస్త భూమి ఉంది.. తూము నుంచి నీళ్లు వదిలితే ఆ భూమిలో నీళ్లు నిలుస్తాయి.. ఏ పంటా వేయలేని పరిస్థితి.. పైగా ఆ భూమి నుంచే కాల్వ తవ్వేందుకు గ్రామస్తులు నిర్ణయించడంతో ఓ రైతు ఆవేదన చెందాడు. తనకు అన్యాయం జరుగుతోందని, అధికారులు పట్టించుకోవడం లేదని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. అందరూ చూస్తుండగానే టవర్‌పై రుమాలుతో ఉరివేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారంలో సోమవారం ఈ విషాద ఘటన జరిగింది.
చెరువు నీళ్లు నిలుస్తుండటంతో..
మెంగారం గ్రామానికి చెందిన రైతు పుట్ట ఆంజనేయులు (32)కు గ్రామ శివార్లలోని చెరువు ముందు 9 గుంటల వ్యవసాయ భూమి ఉంది. చెరువు దిగువన అర గుంట భూమి ఉంది. దిగువన ఉన్న పంట భూములకు చెరువు నుంచి తూము ద్వారా నీళ్లు వదులుతుంటారు. అలా నీళ్లు వదిలినప్పుడు పక్కనే ఉన్న ఆంజనేయులు భూమిలో నీళ్లు నిలుస్తాయి. దీనివల్ల కొన్నేళ్లుగా ఆ భూమిలో పంట వేయలేక పోతున్నాడు.
ఒకట్రెండు సార్లు పంట వేసినా నీళ్లకు కొట్టుకుపోయి దెబ్బతింది. దీనితో తనకు నష్టపరిహారం చెల్లించాలని, తన పొలం నుంచి నీళ్లు పోకుండా చేయాలని గతంలోనే ఆంజనేయులు అధికారులు, గ్రామస్తులను కోరాడు. దానితో గత ఏడాది రూ.2వేలు నష్టపరిహారంగా ఇచ్చారు. ఇక గత ఏడాది తన పొలం మీదుగా కాల్వ తవ్వడానికి అధికారులు, గ్రామస్తులు ప్రయత్నించగా జేసీబీకి అడ్డునిలిచి ఆపేశాడు.
కాల్వ తవ్వుతారని..
ప్రస్తుతం యాసంగి పంటకు నీళ్లు ఇచ్చేందుకు గ్రామ పంచాయతీ ఆదివారం నిర్ణయం తీసుకుంది. చెరువు తూము దిగువ నుంచి పంట కాల్వ తీయాలని నిర్ణయించిన గ్రామస్తులు.. ఆయకట్టు రైతుల నుంచి ఎకరానికి రూ.500 చొప్పున వసూలు చేయడం మొదలుపెట్టారు. ఇది తెలిసిన ఆంజనేయులు తన పొలం నుంచి కాల్వ తవ్వుతారని, భూమి తనదికాకుండా పోతుందని ఆందోళన చెందాడు. అధికారులు పట్టించుకోవడం లేదంటూ సోమవారం గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు.
‘నాన్నా దిగి రా’ అంటూ పిల్లలు రోదించినా..
రైతు ఆంజనేయులు సెల్ టవర్ ఎక్కిన విషయం తెలుసుకున్న తహసీల్దార్ మారుతి, ఎస్సై శంకర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని, దిగి రావాలని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆంజనేయులు భార్య సుజాత కూడా సెల్ టవర్ దిగాలని వేడుకుంది. ఆయన ముగ్గురు పిల్లలు ‘నాన్నా దిగి రా’ అంటూ రోదించినా వినిపించుకోలేదు.
సుమారు గంటసేపు సెల్ టవర్‌పైనే ఉన్న ఆంజనేయులు.. అందరూ చూస్తుండగానే టవర్‌పై ఇనుప రాడ్‌కు తన రుమాలును కట్టి ఉరివేసుకున్నాడు. కాసేపటికే మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి పరిశీలించారు. రైతు ఆత్మహత్యకు కారణాలు, ఇతర అంశాలను ఆరా తీశారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment