మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న మృతుని భార్య, ఇద్దరు పిల్లలు
కామారెడ్డి టౌన్: తన మూడు ఎకరాల భూమి మున్సిపల్ నూతన మాస్టర్ ప్లాన్‌లో ఇండస్ట్రియల్ జోన్‌లోకి వెళ్లడంతో, ఆ భూమిని అమ్ముకోవడానికి వీలుపడక మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన పయ్యావుల రాములు (42)కు కామారెడ్డి పట్టణ శివారులోని ఇల్చిపూర్ వద్ద 3 ఎకరాలు పంట భూమి ఉంది.
కాగా, ఇటీవల మున్సిపల్ నూతన మాస్టర్‌ప్లాన్‌లో అక్కడి భూములన్నీ ఇండస్ట్రియల్ జోన్‌లోకి చేర్చా రు. అప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాములు ఆ భూమిని గతంలోనే అమ్మకానికి పెట్టాడు. ఇప్పుడు ఆ భూమి ఇండస్ట్రియల్ జోన్‌లోకి వెళ్లడంతో కొనుగోలుకు ఎవరూ ముందుకురాక మనస్తాపంతో రాములు మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
బుధవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన తల్లి.. చుట్టుపక్కల వారికి తెలపడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాములు మృతితో రైతులు గ్రామంలో కాసేపు ఆందోళన చేశా రు. అనంతరం మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తీసుకుని కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేయడానికి తరలివచ్చారు. అయితే కామా రెడ్డి కొత్త బస్టాండ్ ముందు పోలీసులు వారిని అడ్డుకున్నారు.
దీంతో రైతులు అక్కడే రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు. తర్వాత రాము లు మృతదేహాన్ని అక్కడే వదిలేసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ధర్నాకు దిగారు. ఈ సమయంలో 2 గంటల పాటు రోడ్డుపైనే ట్రాక్టర్ లో మృతదేహం అలానే ఉంది. తర్వాత పోలీసులు గట్టి బందోబస్తు మధ్య మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.
అయితే తన భర్త మృతదేహాన్ని తన అను మతి లేకుండా ఆస్పత్రికి తరలించినందుకు రాములు భార్య.. తన కుటుంబ సభ్యులు, ఇతర రైతులతో కలసి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వారికి సంఘీభావం ప్రకటించారు. రెండు పంటలు పండే రైతుల భూములను ఇండస్ట్రియల్ జోన్‌లోకి మార్చడం దారుణమన్నారు.
నా కుటుంబాన్ని ఆదుకోండి
తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రాములు భార్య శారద కోరారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల తన భర్త ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. బుధవారం రాత్రి ఆమె ఆందోళన విరమించి కుటుంబ సభ్యులతో కలసి ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. రాములు మృత దేహానికి పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment