సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతు సమస్యలు, కూలీల ఇబ్బందులను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. న్యాయం చేయమని కోరిన రైతులపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి లాక్‌డౌన్ విధించడంతో కూలీలు దొరకక, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయక, ఐకేపీ సెంటర్లలో సరైన ఏర్పాట్లు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం సంజయ్ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం రోజులుగా తరఫున రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.
కరోనా విపత్తుపై అఖిలపక్షం ఏర్పాటు చేయమంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు జంకుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. ‘రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ తెలియజేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. వడగండ్ల వానతో రైతాంగానికి తీరని నష్టం ఏర్పడింది. కొనుగోళ్లలో రైతులు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతిపక్షం చేసిన సూచనలు సలహాలు పట్టించుకోవడం లేదు. టోకెన్లు, డ్రా సిస్టంతో ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు చాలా కేంద్రాలలో ప్రారంభం కాలేదు. తేమ, తాలు పేరుతో ధాన్యం ను దోపిడీ చేస్తున్నారు. 30 వేల కోట్లు పెడితే మద్దతు ధర ఎందుకు చెల్లించట్లేదు.
ఐకేపీ కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు లేవు. మంత్రి కేటీఆర్ నియోజకవర్గలోనే ధాన్యం కాల్చివశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతుల ఇబ్బందులను ఎత్తి చూపితే.. బీజేపీ రాజకీయం చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. రైతులను ఆదుకోవాల్సింది పోయి.. విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల సూచనలు తీసుకుని ఉంటే రాష్ట్రంలో ఈ పరిస్థితి దాపురించేది కాదు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. మీకు అండగా బీజేపీ పోరాడుతుంది’ అని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment