మహబూబాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న గిరిజనేతర రైతులు
సాక్షి, మహబూబాబాద్: ‘తాతలు, తండ్రుల కాలం నుంచి అడవి బిడ్డలతో కలసి బతుకుతున్నాం. అడవిలోనే పుట్టాం.. ఇక్కడే పెరిగాం. మేం సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకపోతే ఎలా? మేము ఎక్కడికి వెళ్లాలి.. ఎలా బతకాలి’అంటూ మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనేతర రైతులు తమ గోడు వినిపించారు. తమకు పట్టాలు ఇచ్చేవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.
తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ డేవిడ్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు.ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో గిరిజనేతరులకు పట్టా లు ఇచ్చేందుకు సాధ్యం కాని నిబంధనలు విధించింది. దీంతో తమకు పట్టాలు వచ్చే అవకాశం లేదని భావించిన గంగారం, కొత్తగూడ, గూడూరు, బయ్యారం ఏజెన్సీ మండలాలకు చెందిన రైతుల ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ పాటించారు.
అనంతరం ట్రాక్టర్లు, ఆటోల ద్వారా పెద్ద ఎత్తున గిరిజనేతరులు మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే కలెక్టరేట్‌కు వెళ్తున్న ర్యాలీని మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న ముఖ్య నాయకులను తమ వాహనాల్లో కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ అదనపు కలెక్టర్ డేవిడ్‌కు వినతిపత్రం అందజేసేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం తిరిగి వారిని ర్యాలీ వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గిరిజనులతో సమానంగా తమకు కూడా పట్టాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పీరయ్య, శ్రీనివాస్‌రెడ్డి, చల్ల నారాయణరెడ్డి, కొమ్మెనబోయిన వేణు, ఖాసీం, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment