
సాక్షి, న్యూఢిల్లీ: రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా రైతుల ఆందోళనలో హింసకు కారణమైన పంజాబీ నటుడు, గాయకుడు, కార్యకర‍్త దీప్ సిద్దూను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించి ఎర్రకోటలో జెండా ఎగుర వేయడం, ఈ సందర్భంగా జరిగిన హింసాకాండలో ప్రధాన నిందితుడు సిద్దూను పంజాబ్‌లో అదుపులోకి తీసుకున్నట్టు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు మంగళవారం ప్రకటించారు. దీనిపై ఈ రోజు 12 గంటలకు పోలీసులు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
కాగా కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు సుదీర్ఘ ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో గణతంత్ర దినోత్సవం రోజు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. కొంతమంది నిరసనకారులు అంగీకరించిన మార్గంలో కాకుండా మరో మార్గంలో ఎర్రకోట లోపలికి బలవంతంగా ప్రవేశించి సిక్కు మత జెండాలను ఎగువేయడం వివాదానికి దారి తీసింది. ఈ కేసులో దీప్ సిద్దూతోపాటు పలువురిపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. దీంతో సిద్ధూ గతనెల 26 నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు. దీప్ సిద్ధూ, మరో ముగ్గురు నిందితులపై పోలీసులు లక్షరూపాయల రివార్డును కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment