AP: ఎక్కడికక్కడే పరిష్కారం | CM YS Jagan Mandate Mobile tribunals for resolving land issues | Sakshi
Sakshi News home page

AP: ఎక్కడికక్కడే పరిష్కారం

Published Fri, Apr 1 2022 2:57 AM | Last Updated on Fri, Apr 1 2022 10:32 AM

CM YS Jagan Mandate Mobile tribunals for resolving land issues - Sakshi

భూ సర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్‌ను పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

2023 జూలై ఆఖరుకు 5,200 గ్రామాల్లో, 2023 ఆగస్టు ఆఖరుకు 5,700 గ్రామాల్లో, 2023 సెప్టెంబరు ఆఖరుకు 6,460 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి, క్లియర్‌ టైటిల్స్‌ ఇచ్చేలా కార్యాచరణ పూర్తి చేశాం.
సచివాలయాల వారీగా భూ వివరాల అప్‌డేషన్‌ వల్ల గతంలో వెబ్‌ల్యాండ్‌ సందర్భంగా తలెత్తిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
– సీఎంతో అధికారులు 

సాక్షి, అమరావతి: భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీనివల్ల స్థానికంగా ఉన్న సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం అవుతాయన్నారు. భూ యజమానులకు క్లియర్‌ టైటిల్స్‌ ఇచ్చే నాటికి దాదాపుగా వివాదాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష పథకంపై  గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 

ఈ ప్రక్రియలో న్యాయ శాఖకు కూడా భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. భూ సర్వే, రికార్డులు తదితర అంశాల్లో రాష్ట్రం.. దేశానికి ఒక దిక్సూచిగా నిలవాలని స్పష్టం చేశారు. అందుకే సీనియర్‌ అధికారులను, సీనియర్‌ మంత్రులను ఇందులో భాగస్వాములు చేశామని తెలిపారు. గతంలో వెబ్‌ ల్యాండ్‌లో ఉన్న సమస్యలను అత్యంత పారదర్శక పద్ధతుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. ఇందుకు అనుసరించాల్సిన విధానాలు, ఎస్‌ఓపీలతో రోడ్‌ మ్యాప్‌ తయారు చేయాలని సూచించారు. రికార్డులను ఎవ్వరూ మార్చలేని విధంగా, టాంపర్‌ చేయలేని విధంగా చేయాలని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్‌ పద్ధతుల్లోనే కాకుండా, ఫిజికల్‌ రికార్డులు కూడా తయారు చేయాలని చెప్పారు. ఈ ఫిజికల్‌ డాక్యుమెంట్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని పేర్కొన్నారు. సబ్‌ డివిజన్‌ కోసం దరఖాస్తు పెట్టిన వెంటనే సర్వే జరిగేలా చూడాలన్నారు. ఎక్కడా అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా ఈ వ్యవస్థ నడవాలని, ఎక్కడైనా లంచాలు తీసుకుంటే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అంతిమంగా సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలన్నారు. 
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

భూ సర్వే కోసం 154 డ్రోన్ల వినియోగం
► సమగ్ర భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పరిశీలించారు. డ్రోన్‌ పనితీరు గురించి అధికారులు సీఎంకు వివరించారు. ఏప్రిల్‌ 5 నాటికి భూ సర్వే కోసం 41 అత్యాధునిక డ్రోన్లు సర్వే పనుల్లో నిమగ్నమై ఉంటాయన్నారు.  
► మరింత వేగవంతంగా పనులు చేయడానికి మరో 20 డ్రోన్లను కొనుగోలు చేస్తున్నామని, మొత్తంగా భూ సర్వే కోసం 154 డ్రోన్లను వినియోగిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 1,441 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తయిందన్నారు. 
► వర్షాకాలం వచ్చేలోగా వీలైనంత మేర డ్రోన్‌ సర్వే నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నామని, రెవిన్యూ విలేజ్‌ చొప్పున సర్వే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. సర్వే ఫలితాలు పూర్తిగా అందేలా అదే సమయంలో రికార్డుల స్వఛ్చీకరణ ఉండేలా చూస్తున్నామన్నారు. 
► వెబ్‌ ల్యాండ్‌ అప్‌డేషన్, గ్రామ ల్యాండ్‌ రిజిస్టర్‌ అప్‌డేషన్, గ్రామ ఖాతా రిజిస్టర్, దీంతోపాటు జగనన్న భూ హక్కు పత్రం ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. 

సచివాలయాల వారీగా భూ వివరాల అప్‌డేషన్‌ 
► సచివాలయాల వారీగా భూ వివరాల అప్‌డేషన్‌ వల్ల గతంలో వెబ్‌ల్యాండ్‌ సందర్భంగా తలెత్తిన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు. 5,200 గ్రామాల్లో 2023 జూలై ఆఖరుకు, 5,700 గ్రామాల్లో 2023 ఆగస్టు ఆఖరుకు, 6,460 గ్రామాల్లో 2023 సెప్టెంబరు ఆఖరుకు సర్వే పూర్తి చేసి, క్లియర్‌ టైటిల్స్‌ ఇచ్చేలా కార్యాచరణ పూర్తిచేశామన్నారు.  
► ఓఆర్‌ఐ (ఆర్థోరెక్టిఫైడ్‌ రాడార్‌ ఇమేజెస్‌) చిత్రాల ప్రక్రియ మొదటి విడత గ్రామాల్లో ఈ ఏడాది నవంబర్‌ ఆఖరుకు, రెండో విడత గ్రామాల్లో డిసెంబర్‌ ఆఖరుకు, మూడో విడత గ్రామాల్లో జనవరి ఆఖరుకు పూర్తవుతాయని చెప్పారు. 
► సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ జి.సాయి ప్రసాద్, రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, రెవెన్యూ శాఖ కమిషనర్‌ సిద్దార్ధ జైన్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement