రైతులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
సాక్షి, దమ్మపేట: ఏళ్లతరబడి సాగులో ఉన్న భూములకు పట్టాదార్ పాస్ పుస్తకాల జారీ విషయంలో జరుగుతున్న జాప్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. అర్హులైన రైతులందరికీ పట్టాదార్ పాస్ పుస్తకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దమ్మపేటలోని టీడీపీ మండల కన్వీనర్ నాయుడు చెన్నారావు ఇంటికి గురువారం వచ్చిన ఎమ్మెల్యేను వచ్చారు. దమ్మపేట, మందలపల్లి రైతులు కొందరు రైతులు కలిశారు. రైతులు గడ్డిపాటి సత్యం, అడపా సుబ్బారావు, ఎంఏ కబీర్, గడ్డిపాటి బాబు తదితరులు మాట్లాడుతూ... భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రైతులు అనేక కష్టాలు పడుతున్నారని అన్నారు. అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ, ఏళ్లతరబడి పట్టాదార్ పాçస్ పుస్తకాలు పంపిణీ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పాస్ పుస్తకాల కోసం ఇంట్లో అందరం తిరుగుతున్నామని అన్నారు.
రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం కారణంగా రైతుబంధు, రైతు బీమా వంటి ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ రుణాలు అందడం లేదని, భూమి క్రయ–విక్రయాలు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూలో ఏమైనా పొరపాట్లుంటే సరిచేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని ఫిర్యాదు చేశారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో మండలంలో అన్ని సర్వే నంబర్లను అధికారులు ప్రక్షాళన చేయలేదని ఫిర్యాదు చేశారు
దమ్మపేట శివారు నల్లకుంటలోని 273/1, జమేదార్ బంజర్‌లోని 884/1 సర్వే నంబర్లతోపాటు పట్వారీగూడెం, నాగుపల్లి రెవెన్యూ గ్రామాల్లోని కొన్ని సర్వే నంబర్లోని భూ రికార్డులను ప్రక్షాళన చేయలేదని వివరించారు. ఈ కారణంగా ఆయా నంబర్లలోని రైతులకు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు అందలేదని చెప్పారు.దీనికి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పందించారు. ఈ సమస్యలు నియోజకవర్గవ్యాప్తంగా ఎక్కువగానే ఉన్నాయని అన్నారు. వీటి పరిష్కారంలో అధికారులు తాత్సారం చేస్తున్నారని ఆగ్రహించారు.
‘‘రెవెన్యూ రికార్డుల్లో లోపాలు, అర్హులైన రైతులకు పట్టాదార్ పాస్ పుసస్తకాలు, పోడుదారులకు పట్టాల పంపిణీపై ఆదివాసీ ఎమ్మెల్యేలం ఐదుగురం ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఈ సమస్యను వివరించాం. సమగ్ర సర్వే చేసి, రైతులకు న్యాయం చేద్దామని అన్నారు. రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు. మరో రెండు నెలల్లో ఈ సమస్యలు పరిష్కారమవుతాయి’’ అని చెప్పారు.
ఎమ్మెల్యేను కలిసిన వారిలో మాజీ సర్పంచ్ అత్తులూరి వెంకటరామారావు, రైతులు– నాయకులు ఎండీ వలీపాష, ఎండీ అబ్దుల్ జిన్నా, బొల్లిన రవికుమార్, గన్నమనేని విజయ్‌కుమార్, చెప్పుల జగదీష్, ఉయ్యాల లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment