‘తెలంగాణలో భూమి అనేది చాలా ప్రధానమైన అంశం. ప్రపంచంలోని ఎక్కడా లేని భూపోరాటాలు ఇక్కడే జరిగినా 75 ఏళ్ల తర్వాత కూడా∙భూసమస్యలు అసంపూర్తి పనిగానే మిగిలిపోయాయి. అసంపూర్ణమైన భూసంస్కరణలే ఇందుకు కారణం. ప్రభుత్వాలు చేసే పనుల కారణంగా పేదల భూములకు భద్రత కల్పించడం మాట అటుంచితే పేదల భూములు లాక్కుంటున్నారని, ఉన్న కాసిన్ని భూములు పేదల చేతుల నుంచి పోతున్నాయని ఐక్యరాజ్యసమితి చెప్పింది. ఇదీ అసలు సమస్య.
ప్రజలకున్న అసలు సమస్యలే కదా ఎన్నికల ఎజెండా కావాలి. ప్రజల ప్రతి సమస్యా ఎజెండా అయితే ఆ సమస్యలు తీరుస్తామని రాజకీయ పార్టీలు చెప్పాలి..’ అని భూచట్టాల నిపుణులు, నల్సార్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఎం.సునీల్‌కుమార్ అన్నారు. తెలంగాణలో ధరణి ఒక్కటే భూ సమస్య కాదని పేర్కొన్నారు. ప్రజలు కోరుకుంటున్న భూవిధానాలను తీసుకురావడం ఎన్నికల ఎజెండా అయినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు.
75–80 ఏళ్ల నాటి పరిస్థితే ఇప్పటికీ..
భూమిని ప్రజల కోణంలో చూడాలి. భూమి లేని వారికి భూమి ఇవ్వడం, భూమి ఉన్న వారి హక్కులకు భద్రత ఉన్నప్పుడే ఆస్తి సంపదగా మారుతుంది. అయితే ఈ రెండింటి విషయంలో 75–80 ఏళ్ల నాటి పరిస్థితే ఇప్పటికీ ఉంది. భూమి లేని గ్రామీణ కుటుంబాలు తెలంగాణలో 56 శాతం ఉన్నాయని లెక్కలు చెపుతున్నాయి. భూములున్న కుటుంబాల విషయంలో ఊరికో 200 సమస్యలున్నాయి. ఈ సమస్యలు ఎన్నికల ఎజెండా కావాలి. దురదృష్టవశాత్తూ అలా జరగడం లేదు.
గత మూడు ఎన్నికలను పరిశీలిస్తే.. 2014 ఎన్నికల్లో పార్టీల మేనిఫెస్టోల్లో భూమి ప్రస్తావన ఉంది. 2018లో కొందరే ప్రస్తావించారు. కానీ ఈసారి భూమి అంశం చర్చకే రావడం లేదు. ధరణిని రద్దు చేస్తామని ఒకరు అంటుంటే, అసైన్డ్ భూములపై హక్కులు కలి్పస్తామని బీఆర్‌ఎస్ అంటోంది. తెలంగాణలో భూసమస్య అంటే ధరణి ఒక్కటేనా? కీలకమైన భూసర్వే ఏ పార్టీ మేనిఫెస్టోలో అయినా ఉందా? అంటే మెల్లగా భూమి అనేది ఎన్నికల ఎజెండా కాకుండా మాయమైపోతోందన్న మాట.
సమస్యలు కొనసాగితేనే పార్టీలకు ఉపయోగం
రాజకీయ పార్టీలు ఎన్నికల్లో భూమిని ఎజెండాగా చేయాలనుకోవడం లేదనే చెప్పాలి. ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కానీ, ఉద్దేశపూర్వకంగా కానీ, లేదంటే పరిష్కరించలేక పోవడం వల్ల కానీ భూమి అంశాన్ని పార్టీలు చేపట్టలేకపోతున్నాయి. భూమి సమస్యను యథాతథంగా కొనసాగించాలన్న ఆలోచన కూడా రాజకీయ పార్టీలకు ఉండొచ్చు. భూములకు సంబంధించిన సమస్యలు ఉంటేనే కదా రాజకీయ పార్టీలకు ఉపయోగం.
ప్రతి గుంట భూమిని సర్వే చేయాలి
తెలంగాణలో భూముల సమగ్ర సర్వే చేయాలి. ఇందుకు రూ.700–800 కోట్ల వరకు ఖర్చవుతుంది. తెలంగాణలో ప్రతి గుంట భూమిని సమగ్రంగా సర్వే చేసి కొత్త రికార్డులను తయారు చేస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. కానీ సర్వే చేస్తామని ఎవరైనా చెప్తున్నారా? భూ చట్టాల్లో సమగ్ర మార్పు రావాలి. ఆర్‌వోఆర్, పీవోటీ, కౌలు చట్టాలు మార్చాలి.
ఏ పార్టీ అయినా భూ చట్టాల్లో మార్పు తెస్తామని ప్రకటిస్తోందా? రెవెన్యూ కోడ్ తెస్తామని చెప్తోందా? భూమి హక్కులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే టైటిల్ గ్యారంటీ చట్టం తెస్తామని ఏ పార్టీ అయినా చెపుతోందా? భూమి లేని పేదలకు భూములిస్తామని ఎవరైనా అన్నారా? తెలంగాణలో 10 లక్షల మందికి పైగా ఉన్న కౌలు రైతులను గుర్తిస్తామని ఎవరైనా చెపుతున్నారా? సమగ్ర చట్టం లేకుండా కౌలుదారులను ఎలా గుర్తిస్తారు? ఎలా డబ్బులిస్తారు? భూపరిపాలన మెరుగుపరుస్తామని ఎవరైనా అంటున్నారా? ఇవి ప్రజలు చేసే డిమాండ్లే.
కంప్యూటర్ రికార్డు తప్పనిసరి
పేరేదైనా సరే.. భూమికి కంప్యూటర్ రికార్డు ఉండి తీరాలి. తెలంగాణలో భూమి కంప్యూటర్ రికార్డులు బ్రహ్మాండంగా ఉన్నాయమని అధికారపక్షం చెపుతోంది. ప్రతిపక్షమేమో చెండాలంగా ఉందని అంటోంది. వీళ్లు రద్దు చేస్తామంటారు. వాళ్లు యథాతథంగా కొనసాగిస్తామంటున్నారు. ఇద్దరూ చెబుతున్నదీ తప్పే. రద్దు సమస్యకు పరిష్కారం కాదు. అసలు కంప్యూటర్ రికార్డు అయితే ఉండాలి కదా? ఏదో ఒక రికార్డుండాలి. కొత్త రికార్డు ఎలా తెస్తారు? అనేది చెప్పాలి కదా? ఏం చేస్తారనే పరిష్కారం చెప్పకుండా రద్దు సమంజసం కాదు. అంతా బాగుందని చెప్పడం సరైంది కాదు. అంటే ఈ రెండు పక్షాలు ప్రజలేం కోరుకునేదానివైపు వెళ్లడం లేదన్నది అర్థమవుతోంది.
కంప్యూటరీకరణ అవసరమా?
భూమికి కాగితాలిచ్చే ప్రక్రియ ప్రపంచమంతా జరుగుతోంది. ఎందుకంటే భూమి ఉన్నా.. ఆ భూమికి సరైన కాగితాలున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 30 శాతమేనట. అంటే రికార్డులు లేని వారే ఎక్కువ ఉన్నారు. ఈ రికార్డులను కల్పించడంలో భాగంగా జరిగే ప్రక్రియనే ఫార్ములైజేషన్ ఆఫ్ ల్యాండ్ రైట్స్ అంటారు. అంటే భూములకు రికార్డులు రూపొందించాలి. వాటిని కంప్యూటరీకరించాలి. అమ్మకాలు, కొనుగోళ్లు సులభంగా జరగాలి. వీటి వల్ల భూమి హక్కులకు భద్రత ఏర్పడుతుంది. పేదలకు కూడా భూములు కొనుగోలుచేయగలిగిన ధైర్యం వస్తుంది.
భూవినియోగ విధానం ఉండాలి
భూమి విధానం, భూమి వినియోగ విధానాలు ప్రతి రాష్ట్రానికి ఉండాలి. ఎన్నికల సమయంలోనే ఇవి చర్చకు రావాలి. ఉచితాలు అనేవి తాత్కాలిక లబ్ధి చేకూర్చేవి. అందువల్ల రాజకీయ పార్టీల హామీలు భూమి చుట్టూ తిరగాలి. స్థిరాస్తి కల్పనపై అవి దృష్టి సారించాలి. గుంట భూమి ఉంటే ఎన్ని సమస్యలో.. అది కూడా లేని వారి పరిస్థితేంటో అందరికీ తెలిసిందే. భూములివ్వడం, ఉన్న భూములను కాపాడడం చుట్టూ ఎన్నికల ఎజెండా తిరిగితేనే మెరుగైన ఫలితాలు వస్తాయి.
- మేకల కళ్యాణ్ చక్రవర్తి
Comments
Please login to add a commentAdd a comment