కలెక్టర్‌తో గోడు వెళ్లబోసుకుంటున్న బాధిత రైతులు
వెల్దుర్తి (తూప్రాన్): జమునా హేచరీస్ భూ వ్యవహారంపై సర్వేతుది నివేదిక వచి్చన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. మాజీ మంత్రి ఈటల కుటుంబీకులకు సంబంధించి మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట శివారుల్లో కొనసాగుతున్న భూముల సర్వేను గురువారం ఆయన పరిశీలించారు. సర్వే పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులు, అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం విలేకరుల సమావేశంలో సర్వే పనులకు సంబంధించి వివరాలు వెల్లడించారు. అచ్చంపేట, హకీంపేట గ్రామాల దళితులు, బలహీన వర్గాల వారు తమ భూములను కొందరు కబ్జాచేసి, పాలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని గత ఏప్రిల్‌లో ఫిర్యాదు చేయడంతో అప్పట్లోనే అధికారులు విచారణ చేపట్టి ప్రాథమిక నివేదిక రూపొందించారని కలెక్టర్ తెలిపారు. అయితే ప్రాథమిక నివేదికకు వ్యతిరేకంగా జమునా హేచరీస్ హైకోర్టులో పిటిషన్ వేయగా పూర్తిస్థాయిలో సర్వే చేపట్టాలని హైకోర్టు ఆదేశించిందని చెప్పారు.
ఈ మేరకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారిణి, తహసీల్దార్ ఆధ్వర్యంలో అచ్చంపేట, హకీంపేట శివార్లలో రెవెన్యూ అధికారులు మూడు రోజులుగా రీ సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. నివేదిక వచి్చన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. సీలింగ్ భూముల్లో ఎన్ని ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయి, ఆ భూముల్లోకి వెళ్లకుండా ఎంతమంది రైతులను అడ్డుకున్నారనే దానిపై నిజ నిర్ధారణ చేయడానికి సర్వే కొనసాగుతుందన్నారు. భూముల కబ్జాపై రైతులు ఎవరూ భయపడొద్దని, విచారణ తర్వాత బాధితులకు న్యాయం చేయడంతో పాటు ఆక్రమణదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment