సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి, మెదక్ జోన్: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబీకులకు సంబంధించిన జమునా హేచరీస్ సంస్థ భూఆక్రమణలకు పాల్పడటం వాస్తవమేనని మెదక్ జిల్లా అధికార యంత్రాంగం మరోమారు నిర్ధారించింది. మొత్తం 70 ఎకరాల 33 గుంటల అసైన్డ్, సీలింగ్ భూములను ఆ సంస్థ కబ్జా చేసినట్లు రీ సర్వేలో తేలిందని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
అసైన్డ్ భూముల బదిలీ నిషేధిత చట్టం ప్రకారం జమునా హేచరీస్‌పై సివిల్, క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు. మొత్తం 56 మంది లబ్ధిదారులకు చెందిన 61 ఎకరాల 13.5 గుంటల అసైన్డ్ భూములతోపాటు 9 ఎకరాల 19.5 గుంటల ప్రభుత్వ భూమిని జమునా హేచరీస్ ఆక్రమించిందన్నారు. అచ్చంపేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 77, 78, 79, 80, 82, 130లతోపాటు హకీంపేట పరిధిలోని 97 సర్వే నంబర్‌లోని అసైన్డ్ భూముల్లో రోడ్లు వేసి రైతులను భూముల్లోకి వెళ్లకుండా సంస్థ యాజమాన్యం అడ్డుకుంటోందని చెప్పారు.
అనుమతులు లేకుండా నిర్మాణాలు..
జమునా హేచరీస్ స్థానిక గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా మూడు నిర్మాణాలు చేపట్టిందని తేలినట్లు కలెక్టర్ హరీశ్ వివరించారు. ఫౌల్ట్రీ ఫీడ్ నిల్వ చేసేందుకు హకీంపేట్ గ్రామ పరిధిలో గాదెలను, అచ్చంపేట్ గ్రామ పరిధిలో ఫౌల్ట్రీ షెడ్‌లను నిర్మించిందని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలకు విరుద్ధంగా జమునా హేచరీస్ డంప్ చేస్తున్న కోళ్ల వ్యర్థాల వల్ల సమీపంలోని హల్దీ వాగుకు అనుసంధానంగా ఉన్న ఎల్క చెరువులో నీరు కలుషితమవుతోందని, స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారని ప్రభుత్వానికి పంపిన నివేదికలో కలెక్టర్ పేర్కొన్నారు. అందువల్ల ఆ సంస్థ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
అసైనీలకు భూములు తిరిగిస్తాం...
జమునా హేచరీస్ కబ్జా చేసిన భూములపై తిరిగి తమకు హక్కులు కల్పించాలని అసైన్డ్ భూముల లబ్ధిదారులు కోరుతున్నారని కలెక్టర్ హరీశ్ వివరించారు. ఈ భూముల్లో రోడ్ల నిర్మాణాలను తొలగించి స్వాధీనం చేసుకొని వాటిని అసైనీలకు అప్పగించాల్సి ఉందన్నారు. అలాగే అచ్చంపేట గ్రామ సర్వే నంబర్ 81, 130లలోని అసైన్డ్, సీలింగ్ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ జమునా హేచరీస్ రిజిస్ట్రేషన్లు చేసుకుందనే విషయం తమ దృష్టికి వచ్చిందని, ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోరినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment