సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డిపై సంచలన ఆరోపణలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు ఇవాళ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా ముందుకు వచ్చారు. దాదాపు 30 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాజేసే కుట్ర జరుగుతోందని.. మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బామ్మర్ది శ్రీనివాస్‌రెడ్డి తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని.. తమకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్లు.
మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో ఉన్న మంత్రి మల్లారెడ్డి కాలేజీ ఎదురుగా ఉన్న భూమిని మర్రి వెంకట్‌రెడ్డి, దయాసాగర్‌రెడ్డి అనే ఇద్దరు.. సుంకరి అనే కుటుంబం నుంచి భూమిని కొనుగోలు చేశారు. మొత్తం ఎనిమిది ఎకరాల్లో.. 4.5 ఎకరాలు కొన్నారు వీళ్లు. అదే సమయంలో మంత్రి మల్లారెడ్డి తన భార్య పేరు మీద 2 ఎకరాలు కొన్నారు. అయితే మొత్తం భూమిని కాజేసేందుకు మంత్రి కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వీళ్లు.
భూమి వద్దకు వెళ్లిన మాపై మంత్రి, ఆయన అనుచరులు దాడి చేశారు. మంత్రి బామర్ది శ్రీనివాస్ రెడ్డి అయితే ఏకంగా గన్‌తో షూట్ చేస్తానంటూ బెదిరించాడు. భూమిని వదిలి వేళ్లాలని మమ్మల్ని బెదిరించారు. పోలీసులకు పిర్యాదు చేసినా.. రాజకీయ ఒత్తిడి ఉందంటూ పట్టించుకోవడం లేదు. భూ రికార్డుల నుండి మా పేరు తొలగించి.. అక్రమంగా మంత్రి వారి పేరు పై మార్చుకున్నారు. మా భూమి మాకు ఇప్పించాలని ప్రభుత్వం కు విజ్ఞప్తి చేస్తున్నాం అని బాధితులు మీడియా ముందు వాపోయారు.
మంత్రి మల్లారెడ్డి చాలా మంది రైతులను మోసం చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి నుంచి మాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించి మాకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నాం అని బాధితులు మర్రి వెంకట్ రెడ్డి, దయాసాగర్ రెడ్డిలు మీడియా సాక్షిగా విజ్ఞప్తి చేశారు. ఇక ఈ ఆరోపణలపై మంత్రి మల్లారెడ్డిగానీ, శ్రీనివాసరెడ్డిగానీ స్పందించాల్సి ఉంది.
ఇదీ చదవండి: మేం తిరగబడితే.. మీరెక్కడా తిరగలేరు!
Comments
Please login to add a commentAdd a comment