
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌తో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. పట్టాదారుల పేర్లు తప్పుగా నమోదవడం నుంచి నిషేధిత జాబితాల దాకా ఇబ్బందులను సరిచేసేందుకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం కీలక సిఫార్సులు చేసింది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలోనే హరీశ్‌తోపాటు సబ్‌కమిటీ సభ్యులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు ఈ మేరకు నివేదికను సమర్పించారని.. సిఫార్సులపై దాదాపు నాలుగు గంటల పాటు చర్చించారని సమాచారం. ఈ సందర్భంగా రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న 20 సమస్యల పరిష్కారానికి గాను ఏడు కొత్త మాడ్యూళ్ల ఏర్పాటును సబ్ కమిటీ ప్రతిపాదించింది.
విస్తృత చర్చల్లో వచ్చిన సూచనల మేరకు..
క్రెడాయ్, ట్రెడా, ట్రెసా లాంటి సంఘాలు, సంస్థలతో జరిపిన చర్చల్లో వచ్చిన సూచనలతోపాటు ప్రజలు, భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదులను సబ్‌కమిటీ పరిశీలించింది. వాటికి అనుగుణంగా ధరణి పోర్టల్‌ను సరళంగా మార్చేలా, సమస్యలను సులభంగా పరిష్కరించేలా సిఫార్సులను చేసింది.
‘ధరణి’లో ప్రధాన సమస్యలు.. పరిష్కారాలివీ..
కేబినెట్ సబ్‌కమిటీ ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న వందలాది సమస్యలపై విస్తృతంగా చర్చించింది. మూడు సార్లు సమావేశమైన ఈ కమిటీ.. సీఎస్ సోమేశ్‌కుమార్‌తోపాటు కమిటీ కన్వీనర్, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి తదితరుల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు నివేదికలో ప్రధాన సమస్యలను, వాటికి తగిన పరిష్కారాలను చేర్చింది. సబ్‌కమిటీ నివేదిక ప్రకారం..
– చాలాచోట్ల పట్టాదారు పేరులో అక్షర దోషాలు, ఇతర తప్పులు నమోదయ్యాయి. ఇలాంటి వాటిని సరిచేసేందుకు ధరణి పోర్టల్‌లో ఒక కొత్త మాడ్యూల్‌ను అందుబాటులోకి తేవాలని.. ఈ ఫిర్యాదుల స్వీకరణకు సమయమిచ్చి తప్పులను ఆన్‌లైన్‌లో కలెక్టర్ల ద్వారా సరిచేయించాలని ప్రతిపాదించింది.
– కొన్నిచోట్ల పట్టా భూములు లావణి భూములుగా, మరికొన్ని చోట్ల భూదాన్, దేవాదాయ భూములుగా ధరణిలో పేర్కొన్నారు. వీటిని సరిచేసేందుకు కూడా కొత్త మాడ్యూల్ ఏర్పాటు చేయాల్సి ఉందని సబ్‌కమిటీ సూచించింది.
– పట్టాభూములు కూడా నిషేధిత జాబితాలో నమోదవడం ధరణిలో మరో ముఖ్యమైన సమస్య. అలా పొరపాటుగా నమోదైన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడానికీ ప్రత్యేక మాడ్యూల్ అవసరమని సబ్‌కమిటీ తెలిపింది.
– మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించిన సమస్యకు కూడా సబ్‌కమిటీ పరిష్కారాన్ని ప్రతిపాదించింది. సబ్‌కమిటీ గుర్తించిన ప్రకారం.. ఈ ఒక్క అంశంపైనే 35వేల వరకు ఫిర్యాదులు ఉన్నాయి. అంటే చాలాచోట్ల సర్వే నంబర్లు, వాటి సబ్ డివిజన్లు ధరణి పోర్టల్‌లో కనిపించడం లేదు. ధరణి పోర్టల్ అప్‌గ్రెడేషన్ సమయానికి.. ఆ సర్వే నంబర్లకు సంబంధించిన పాస్ పుస్తకాలను రైతులకు ఇవ్వకపోవడంతో పోర్టల్‌లో నమోదు కాలేదు. దీనికి కూడా సబ్‌కమిటీ ప్రత్యేక మాడ్యూల్‌ను ప్రతిపాదించింది.
– ఇప్పటివరకు ధరణి పోర్టల్‌లో కొనుగోలు/అమ్మకం కోసం ఒక్క వ్యక్తిని మాత్రమే అనుమతిస్తున్నారు. అలా కాకుండా.. ఒకేసారి ఒకరికంటే ఎక్కువ మంది కొనుగోలు/అమ్మకం దారులకు అనుమతి ఇచ్చేలా పోర్టల్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడంతోపాటు ప్రత్యేక మాడ్యూల్‌ను కూడా రూపొందించాలని సబ్‌కమిటీ సూచించింది.
– ఎన్నారైల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు.. భూక్రయ, విక్రయ లావాదేవీల సమయంలో వారు నియమించుకున్న ప్రతినిధిని ‘స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఎస్‌పీఏ)’గా గుర్తించేందుకు రిజిస్ట్రేషన్ల చట్టానికి అనుగుణంగా మార్పులు చేయాలని సబ్ కమిటీ పేర్కొంది.
– ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్ (ఓఆర్సీ), ప్రొటెక్టెడ్ టెనెంట్స్ సర్టిఫికెట్ (పీటీసీ)లను జారీ చేసేందుకు ప్రత్యేక మాడ్యూల్‌ను అభివృద్ధి చేసి కలెక్టర్ల ద్వారా జారీ చేయించాలని ప్రతిపాదించింది.
– భూవిస్తీర్ణంలో నమోదైన తప్పులను కూడా సరిచేసేందుకు ఓ మాడ్యూల్ రూపొందించాలని సబ్‌కమిటీ అభిప్రాయపడింది. ఈ విషయంలో 16 వేల వరకు ఫిర్యాదులు వచ్చాయని.. పాత రికార్డులను పరిశీలించి తప్పులను సరిచేయాలని సూచించింది. ఒకవేళ హద్దుల్లోని పట్టాదారుల భూములను కూడా సర్వే చేయాల్సి వస్తే... రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేటలలో అమలవుతున్న పైలట్ ప్రాజెక్టును పరిశీలించి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సబ్ కమిటీ ప్రతిపాదించింది.
సబ్‌కమిటీ చేసిన ఇతర సూచనలివీ..
– ధరణి పోర్టల్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడం, తగిన అవగాహన కల్పించడం కోసం జిల్లా స్థాయిలో ధరణి హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి.
– ధరణి పోర్టల్‌ను సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుగా రెవెన్యూ అధికారులకు శిక్షణ ఇవ్వాలి. జడ్పీ, మున్సిపల్ సమావేశాలకు జిల్లా కలెక్టర్లు హాజరై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం ద్వారా స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలి.
– ఏజెన్సీ ప్రాంతాల్లోని భూముల వారసత్వ మార్పునకు కార్యాచరణ రూపొందించాలి. ధరణికి ముందు జరిగిన లావాదేవీలను తగిన కారణాలతో తిరస్కరించేందుకు వీలుగా మాడ్యూల్‌లో మార్పులు చేర్పులు చేయాలి.
– హైకోర్టులో దాఖలైన మూడు రిట్ పిటిషన్లను అధ్యయనం చేయాలి. సాఫ్ట్‌వేర్ సమస్యల పరిష్కారానికి నిపుణుల సేవలను ఉపయోగించుకోవాలి. ధరణిలో పరిష్కారం కోసం దరఖాస్తులు సమర్పించేటప్పుడు నిర్దేశిత ఫీజు వసూలు చేయాలి.
– దరఖాస్తుదారుల బయోమెట్రిక్ తీసుకోవాలి. సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. వాటిని పరిశీలించి కలెక్టర్ జారీచేసే ఉత్తర్వులను పోర్టల్‌లో పొందుపరిచేలా డేటా మేనేజ్‌మెంట్ మాడ్యూల్‌ను అందుబాటులోకి తేవాలి.
Comments
Please login to add a commentAdd a comment