భరతమాత ముద్దుబిడ్డ.. పోలీసులకు సవతిబిడ్డ! | Jawan Arrest Land Issues In Anantapur | Sakshi
Sakshi News home page

నిప్పులు కురిపించే కళ్లు.. న్యాయం కోసం కన్నీళ్లు!

Published Tue, Jul 24 2018 8:09 AM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM

Jawan Arrest Land Issues In Anantapur - Sakshi

జవాన్‌ నాగరాజు

దేశ రక్షణకు ప్రాణాలను సైతం లెక్క చేయని ఆ జవాను తన సొంత స్థలాన్ని కాపాడుకోలేకపోతున్నాడు. శత్రువు ఎదురుపడితే నిప్పులు కురిపించే ఆ కళ్లు కన్నీరు కారుస్తున్న దయనీయ స్థితి. జవానుకు అండగా నిలవాల్సిన పోలీసులు.. ఏకపక్షంగా వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఓ అనామకుడు గుంపునేసుకొచ్చి చేతిలో రాయి తీసుకొనిబండ బూతులు తిడుతూ కొట్టే ప్రయత్నం చేస్తుండగా, తన వద్దనున్న పిస్టోల్‌ను చేతపట్టుకోవడం నేరమైంది. చంపి పాతేస్తాం అని బెదిరించినా సంయమనం పాటించిన పాపానికి పోలీసుస్టేషన్‌లో బట్టలు లేకుండా కూర్చోవాల్సి వచ్చింది. గతంలో జవాన్‌ చేసిన ఫిర్యాదుపై ఏనాడూ స్పందించని నాల్గో పట్టణ పోలీసులు.. సోమవారం మరో వర్గం ఫోన్‌ చేయగానే అక్కడ వాలిపోవడం గమనార్హం. ఇదీ..మన పోలీసుల నీతి, నిజాయితీ.

అనంతపురం సెంట్రల్‌: దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న జవాన్‌ పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. తల్లిదండ్రులకు, భార్యాబిడ్డలకు సుదూరంగా అనుక్షణం దేశ రక్షణలో నిద్రాహారాలు మాని బహిర్గత, అంతర్గత శత్రుమూకలతో యుద్ధం చేస్తున్న సైనికుడికి ఘోర అవమానమే ఎదురైంది. తనకు చెందిన స్థలాన్ని ఇతరులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. న్యాయం కోరుతూ పోలీసులను ఆశ్రయిస్తే ఫలితం లేకపోగా.. దోషిగా చూపుతూ అదే పోలీసులు కేసు నమోదు చేసి తమ వైఖరి ఇంతేనంటూ లోకానికి చాటిచెప్పారు.

అసలేం జరిగింది
తనకల్లు మండలం కె.వి.పల్లికి చెందిన సి.నాగరాజు.. బిహార్‌లోని కిషన్‌గంజ్‌ 139వ బీఎస్‌ఎఫ్‌ బెటాయలియన్‌లో జవాన్‌గా పనిచేస్తున్నారు. తనకు వస్తున్న జీతంలో కొంత మేర దాచుకుంటూ వచ్చిన డబ్బుతో అనంతపురం శివారులోని రుద్రంపేట జాతీయ రహదారి వద్ద ఉన్న రాజహంస అపార్ట్‌మెంట్‌ వెనుక ఐదు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే ఆ స్థలంపై కన్నేసిన నగరానికి చెందిన సంజన్న కుమారులు.. దాని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. విషయంపై నాల్గో పట్టణ పోలీసులకు నాగరాజు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోలేదు. పోలీసు ఉన్నతాధికారులను కలిసి సమస్య వివరిస్తూ తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. కొంత కాలంగా సాగుతున్న ఈ తంతులో పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఇటీవల సెలవుపై ఇంటికి వచ్చిన నాగరాజు.. ఆ స్థలంపై పూర్తి హక్కు తనకే ఉందనే భావనతో తాత్కాలిక ఫెన్సింగ్‌ వేయడానికి సోమవారం ప్రయత్నించారు. ఒక్కడే గోడ నిర్మిస్తుండగా మరో వర్గం వారు అక్కడకు చేరుకుని ఘర్షణకు దిగారు. బండ రాళ్లు తీసుకుని జవాన్‌పై దాడికి తెగబడ్డారు. వారి నుంచి ఆత్మరక్షణ పొందేందుకు తన వద్ద ఉన్న పిస్టల్‌ని జవాన్‌ బయటకు తీశారు. దీంతో తగ్గిన ప్రత్యర్థులు బూతులు తిడుతూ.. జవాన్‌ను పలుమార్లు తోస్తూ ఘర్షణను మరింత పెద్దది చేశారు. అయినప్పటికీ జవాన్‌ సంయమనం కోల్పోకుండా ఏదైనా వివాదం ఉంటే కోర్టులో తేల్చుకుందామంటూ చెబుతున్నా వినలేదు.

కొడితే కొట్టించుకో..
ప్రత్యర్థులు కొడితే కొట్టించుకోవాల్సిందే అన్న రీతిగా మారింది పోలీసుల తీరు. ప్రత్యర్థులు తనపై బండరాళ్లు తీసుకుని దాడికి తెగబడుతుంటే ఆత్మరక్షణ కోసం పిస్టల్‌ తీసి చూపించి, ప్రాణాలు కాపాడుకోవడం జవాన్‌ పాలిట శాపమైంది. గతంలో జవాన్‌ చేసిన ఫిర్యాదుపై ఏనాడూ స్పందించని నాల్గో పట్టణ పోలీసులు ఏకంగా సోమవారం తమకు సమాచారం అందగానే ఉన్నఫళంగా ఘటన స్థలానికి చేరుకుని దాడికి కారకులైన వారిని కాకుండా జవాన్‌ నాగరాజును అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్లారు. దుస్తులు ఊడదీయించి లాకప్‌లో వేశారు. అనంతరం ఆర్మీ యాక్ట్, ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు చూపితే తప్పు కాదా?
ప్రాణాలు కాపాడుకునేందుకు పిస్టల్‌ బయటకు తీసి భయపెట్టిన జవాన్‌పై కేసు నమోదు చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. బండరాళ్లతో దాడి చేసేందుకు యత్నించిన వారిపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే అన్ని విషయాల్లో పోలీసులు ఇలాగే వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కేవలం స్థల వివాదం కోర్టులో ఉందనే కారణం చూపుతూ ఇంత కాలం చర్యలకు వెనకగడుగు వేసిన పోలీసులు..  కోర్టులో ఉన్న ఎన్నో వివాదాల్లో తలదూర్చడాన్ని మరిచిపోయి జవాన్‌కు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నో ఘటనల్లో పోలీసు అధికారులు తమ వద్ద ఉన్న సర్వీస్‌ రివాల్వర్‌ చూపి ప్రజలను బెదిరించిన విషయాలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. పోలీసులకో న్యాయం.. దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టిన జవాన్‌లకు మరో న్యాయమా అంటూ పోలీసుల తీరును ఎండగడుతున్నారు.

ఆత్మరక్షణ కోసమే గన్‌ తీసా
రూపాయి రూపాయి కూడబెట్టి ఐదు సెంట్లు స్థలం కొనుగోలు చేశాను. ఈ స్థలం కోసం ఎంతో కష్టపడ్డా. కొన్న తర్వాత ఈ స్థలం తమదంటూ కొందరు వస్తున్నారు. ఈ విషయంపై అనేకసార్లు పోలీసులను కలిశాను. సీఐ, డీఎస్పీలందరినీ వేడుకున్నాను. ఎవరూ పట్టించుకోలేదు. స్థలం కబ్జా చేయకూడదనే ఉద్దేశంతో సెలవుపై వచ్చి, నా ప్రయత్నాలు నేను చేస్తున్నా. నాపై దాడి చేయడానికి బండరాళ్లు తీసుకున్నారు. నేను ఒంటరిగా ఉన్నా.. ఏం చేయాలో తోచలేదు. రాళ్ల దాడి నుంచి నన్ను నేను కాపాడుకునేందుకు పిస్టల్‌ తీసి చూపించాను. నా దగ్గరకు రావద్దంటూ చెప్పాను. నేను చేసింది తప్పే కావచ్చు. దేశం కోసం పనిచేస్తున్నాననే చిన్న కనికరం కూడా పోలీసులు చూపలేదు.– నాగరాజు, బీఎస్‌ఎఫ్‌ జవాన్‌

భూ వివాదం కోర్టులో నడుస్తోంది
సదరు స్థల వివాదం కోర్టులో నడుస్తోంది. 2012లో ఆ స్థలాన్ని జవాను నాగరాజు కొనుగోలు చేశారు. 2005 నుంచే ఆ స్థల విక్రేత అన్నదమ్ముల మధ్య స్థల వివాదం నడుస్తోంది. సదరు స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు ఉత్తర్వులున్నాయి. అయినా జవాన్‌ వెళ్లారు. నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళితే తుపాకీ చూపించి, బెదిరించారు. ఇది చట్టరీత్యా నేరం. అందుకే కేసు నమోదు చేశాం.
– వెంకట్రావ్, డీఎస్పీ,అనంతపురం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement