tanakallu
-
Sri Sathya Sai: రేసులో దూసుకెళ్దాం.. చకాచకా ఎస్–3 ట్రాక్ పనులు..
రయ్యిమంటూ ట్రాక్‌పై దూసుకెళ్తూ క్షణాల్లో మాయమయ్యే కార్లు... ఒకదానితో ఒకటి పోటీ పడుతూ సాగే రేస్‌లో డ్రైవర్ల విన్యాసాలు.. అనుకోని మలుపులు.. ఆపై విజేతల గెలుపు సంబరాలు. టీవీల్లో తప్ప ప్రత్యక్షంగా చూసే భాగ్యం మనకు లేదను కుంటున్నారా..?, వైఎస్ జగన్ సర్కార్ ఆ అవకాశం మనకూ కల్పిస్తోంది. చంద్రబాబు హయాంలో అటకెక్కిన ఫార్ములా–3 కార్ రేస్ ట్రాక్ ప్రాజెక్టుకు ఊపిరి పోసింది. ఫలితంగా తనకల్లు మండలం కోటపల్లి వద్ద పనులు చకచకా సాగుతున్నాయి. సాక్షి, కదిరి: తనకల్లు మండలం కోటపల్లి వద్ద ఫార్ములా–3 కారు రేస్ ట్రాక్ ఏర్పాటుకు బెంగళూరుకు చెందిన ‘నిధి మార్క్ వన్ మోటార్స్’ ముందుకు వచ్చింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ కంపెనీతో 2017లో ఒప్పందం కుదుర్చుకుంది. 90 నెలల్లో పనులు పూర్తి చేయాలని అగ్రిమెంట్ రాసుకుంది. అయితే భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో బాబు సర్కారు పూర్తిగా విఫలమైంది. దీంతో కారు రేస్ ట్రాక్ పనులు అటకెక్కాయి. వైఎస్ జగన్ సర్కారు అధికారంలోకి రాగానే ఈ కారు రేస్ ట్రాక్ ఏర్పాటుపై దృష్టి సారించింది. 3.4 కి.మీ ఫార్ములా–3 కారు రేస్ ట్రాక్ ఏర్పాటుకు అవసరమైన 219 ఎకరాల భూమిని సేకరించి ‘నిధి మార్క్ వన్ మోటార్స్’కు అప్పగించడంతో పాటు నిర్వాసిత రైతులకు పరిహారం కూడా చెల్లించింది. దేశంలో మూడోది.. ఏపీలో మొదటిది.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడా వద్ద ‘బుద్ద ఇంటర్ నేషనల్ సర్క్యూట్’ ఫార్ములా–1 కారు రేస్ ట్రాక్ ఉంది. అలాగే తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలోని ఇడుంగట్టు కొట్టయ్ వద్ద ఫార్ములా–2 కారు రేస్ ట్రాక్ ఏర్పాటు చేశారు. తాజాగా కదిరి సమీపంలోని కోటపల్లి వద్ద నిర్మిస్తోంది ఫార్ములా–3 కారు రేస్ ట్రాక్. రేస్ ట్రాక్‌లలో ఇది దేశంలో మూడోది. మన ఏపీలో మొదటిది. దీనికి ‘ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ (ఎఫ్ఐఏ), ఫెడరేషన్ ఇంటర్నేషనల్ మోటో సైక్లిజం(ఎఫ్ఐఎం) గుర్తింపు పొందింది. కారు రేసింగ్‌తో పాటు కొత్త కార్ల వేగాన్ని పరీక్షించేందుకు కూడా ఈ ట్రాక్ ఉపయోగ పడుతుంది. కార్ రేస్ వివిధ ఫార్మాట్లు ఇలా... ►ఫార్ములా–1 (ఎఫ్–1): ఈ రేసులో పాల్గొనే కారుకు 1,000 హెచ్‌పీ(హార్స్పవర్) ఇంజిన్ ఉంటుంది. ప్రపంచ చాంపియన్లను దృష్టిలో ఉంచుకొని ట్రాక్‌లను తయారు చేస్తారు. ఈ రేస్‌లో పాల్గొనే కార్లు వివిధ రకాల డిజైన్లలో ఉంటాయి. వారాంతంలో ఒక రోజు చొప్పున మూడు వారాల పాటు పోటీలు నిర్వహిస్తారు. గంటకు 1,000 కి.మీ వేగ పరిమితి ఉంటుంది. ►ఫార్ములా–2 (ఎఫ్–2): ఈ రేసులో పాల్గొనే కార్లకు 500 హెచ్‌పీ ఇంజిన్ ఉంటుంది. కార్లు అన్నీ ఒకే డిజైన్‌లో ఉంటాయి. రేస్ కూడా ఒకే రోజు మూడు గ్రూపులుగా విభజించి నిర్వహిస్తారు. గంటకు 500 కి.మీ వరకూ వేగ అనుమతి ఉంటుంది. ►ఫార్ములా–3(ఎఫ్–3): ఈ కార్లకు 250 హెచ్‌పీ సామర్థ్యం ఉంటుంది. ఇది బేసిక్ రేస్. ఇందులో పాల్గొనే కార్లన్నీ ఒకే డిజైన్‌లో ఉంటాయి. ఒకే రోజు మూడు గ్రూపులుగా విభజించి... పోటీలు నిర్వహిస్తారు. ఇందులో కార్ల వేగం గంటకు 250 కి.మీ పరిమితి ఉంటుంది. ఎంతోమందికి ఉపాధి.. ఫార్ములా–3 కారు రేస్ ట్రాక్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 500 మందికి ఉపాధి దొరుకుతుంది. తొలి దశలో ట్రాక్‌తో పాటు ఆస్పత్రి, అతిథి గృహం ఏర్పాటు చేయనున్నారు. రెండు, మూడవ దశల్లో 40 గదులో పెద్ద రిసార్ట్, అమ్యూజ్మెంట్ పార్కు(వినోద భరిత ఉద్యానవనం), గోల్ఫ్ కోర్సు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేస్తారు. అలాగే జిల్లాలో తయారవుతున్న ‘కియా’ కార్లను పరీక్షించేందుకు కూడా ఈ ట్రాక్ ద్వారా అవకాశం కల్పిస్తారు. పర్యాటక హబ్ ఏర్పాటుకు ప్రణాళిక.. కోటపల్లి పార్ములా–3 కారు రేస్ ట్రాక్ బెంగళూరు విమానాశ్రయానికి కేవలం 110 కి.మీ దూరంలో ఉంది. కార్ రేసింగ్‌లో పాల్గొనేందుకు దేశ, విదేశాల చెందిన వారు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో రాయలసీమలోని పలు పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక హబ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ యోచిస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి, లేపాక్షి, కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, యోగి వేమన సమాధి, తిమ్మమ్మ మర్రిమాను, పెనుకొండ కోట, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, గుత్తి కోట, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలలోని పలు పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ‘రాయలసీమ హెరిటేజ్ సర్క్యూట్’ ఏర్పాటుకు అనుమతివ్వాలని ఇప్పటికే రాష్ట్ర పర్యాటక శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. చకాచకా పనులు.. ప్రస్తుతం కోటపల్లి వద్ద ఫార్ములా–3 కారు రేస్ ట్రాక్ పనులు చకాచకా జరుగుతున్నాయి. ఇప్పటికే చుట్టూ ఫెన్సింగ్ పూర్తయ్యింది. రేస్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే చికిత్స చేసేందుకు అవసరమైన ఆస్పత్రి భవనం దాదాపుగా పూర్తి కావచ్చింది. వెయిటింగ్ హాలు, విశ్రాంతి గదుల నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇక రేస్ ట్రాక్ కోసం భూమి చదును చేసే పనులు ప్రారంభమయ్యాయి. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి కార్ రేస్‌లు ఏర్పాటు చేసేలా ‘నిధి మార్క్ వన్ మోటార్స్’ కృషి చేస్తోంది. రెండేళ్లలో పూర్తి చేస్తాం ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చాక మాకు కోటపల్లి వద్ద భూములు అప్పగించారు. కోవిడ్ కారణంగా పనులు కాస్త ఆలస్యమయ్యాయి. ఇప్పుడు మళ్లీ పనులు వేగంగా జరుగనున్నాయి. రెండేళ్లలో మొత్తం పనులు పూర్తి చేస్తాం. ఇది బెంగుళూరు విమానాశ్రయానికి దగ్గరగా ఉంది. రేసర్లు, ఔత్సాహికులతో పాటు పర్యాటకులను కూడా బాగా ఆకర్షించనుంది. –గోవింద రాజన్ చక్రవర్తి, నిధి మార్క్ వన్ మోటార్స్, డైరెక్టర్, బెంగళూరు -
ఎన్నికల్లో ఓడిపోయా.. డబ్బులు ఇయ్యి: టీడీపీ నేత
అనంతపురం: తెలుగు దేశం పార్టీ నాయకుడు బరి తెగించాడు. గ్రానైట్ మేనేజర్‌ను రూ.50 వేలు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు చేశానని.. వాటిని తిరిగి సంపాదించేందుకు సహకరించాలని మేనేజర్‌పై ఒత్తిడి పెంచాడు. ఈ ఘటన అనంతపురము జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురము జిల్లా కుర్తికోటలో టీడీపీ నేత రెడ్డి శేఖర్ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఓటుకు రూ.2 వేలు పంచానని.. ఆ డబ్బులు తిరిగి సంపాదించేందుకు సహకరించాలని మేనేజర్‌ను శేఖర్ కోరాడు. దీంతో తనకల్లులో మారుతి గ్రానైట్ మేనేజర్‌ను బెదిరించాడు. నెలకు రూ.50 వేలు రౌడీ మామూళ్లు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బు కోసం ఈ విధంగా పట్టపగలు బెదిరింపులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో టీడీపీ నేత రెడ్డి శేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
భరతమాత ముద్దుబిడ్డ.. పోలీసులకు సవతిబిడ్డ!
దేశ రక్షణకు ప్రాణాలను సైతం లెక్క చేయని ఆ జవాను తన సొంత స్థలాన్ని కాపాడుకోలేకపోతున్నాడు. శత్రువు ఎదురుపడితే నిప్పులు కురిపించే ఆ కళ్లు కన్నీరు కారుస్తున్న దయనీయ స్థితి. జవానుకు అండగా నిలవాల్సిన పోలీసులు.. ఏకపక్షంగా వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఓ అనామకుడు గుంపునేసుకొచ్చి చేతిలో రాయి తీసుకొనిబండ బూతులు తిడుతూ కొట్టే ప్రయత్నం చేస్తుండగా, తన వద్దనున్న పిస్టోల్‌ను చేతపట్టుకోవడం నేరమైంది. చంపి పాతేస్తాం అని బెదిరించినా సంయమనం పాటించిన పాపానికి పోలీసుస్టేషన్లో బట్టలు లేకుండా కూర్చోవాల్సి వచ్చింది. గతంలో జవాన్ చేసిన ఫిర్యాదుపై ఏనాడూ స్పందించని నాల్గో పట్టణ పోలీసులు.. సోమవారం మరో వర్గం ఫోన్ చేయగానే అక్కడ వాలిపోవడం గమనార్హం. ఇదీ..మన పోలీసుల నీతి, నిజాయితీ. అనంతపురం సెంట్రల్: దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న జవాన్ పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. తల్లిదండ్రులకు, భార్యాబిడ్డలకు సుదూరంగా అనుక్షణం దేశ రక్షణలో నిద్రాహారాలు మాని బహిర్గత, అంతర్గత శత్రుమూకలతో యుద్ధం చేస్తున్న సైనికుడికి ఘోర అవమానమే ఎదురైంది. తనకు చెందిన స్థలాన్ని ఇతరులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. న్యాయం కోరుతూ పోలీసులను ఆశ్రయిస్తే ఫలితం లేకపోగా.. దోషిగా చూపుతూ అదే పోలీసులు కేసు నమోదు చేసి తమ వైఖరి ఇంతేనంటూ లోకానికి చాటిచెప్పారు. అసలేం జరిగింది తనకల్లు మండలం కె.వి.పల్లికి చెందిన సి.నాగరాజు.. బిహార్‌లోని కిషన్‌గంజ్ 139వ బీఎస్ఎఫ్ బెటాయలియన్లో జవాన్‌గా పనిచేస్తున్నారు. తనకు వస్తున్న జీతంలో కొంత మేర దాచుకుంటూ వచ్చిన డబ్బుతో అనంతపురం శివారులోని రుద్రంపేట జాతీయ రహదారి వద్ద ఉన్న రాజహంస అపార్ట్మెంట్ వెనుక ఐదు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే ఆ స్థలంపై కన్నేసిన నగరానికి చెందిన సంజన్న కుమారులు.. దాని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. విషయంపై నాల్గో పట్టణ పోలీసులకు నాగరాజు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోలేదు. పోలీసు ఉన్నతాధికారులను కలిసి సమస్య వివరిస్తూ తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. కొంత కాలంగా సాగుతున్న ఈ తంతులో పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఇటీవల సెలవుపై ఇంటికి వచ్చిన నాగరాజు.. ఆ స్థలంపై పూర్తి హక్కు తనకే ఉందనే భావనతో తాత్కాలిక ఫెన్సింగ్ వేయడానికి సోమవారం ప్రయత్నించారు. ఒక్కడే గోడ నిర్మిస్తుండగా మరో వర్గం వారు అక్కడకు చేరుకుని ఘర్షణకు దిగారు. బండ రాళ్లు తీసుకుని జవాన్‌పై దాడికి తెగబడ్డారు. వారి నుంచి ఆత్మరక్షణ పొందేందుకు తన వద్ద ఉన్న పిస్టల్ని జవాన్ బయటకు తీశారు. దీంతో తగ్గిన ప్రత్యర్థులు బూతులు తిడుతూ.. జవాన్‌ను పలుమార్లు తోస్తూ ఘర్షణను మరింత పెద్దది చేశారు. అయినప్పటికీ జవాన్ సంయమనం కోల్పోకుండా ఏదైనా వివాదం ఉంటే కోర్టులో తేల్చుకుందామంటూ చెబుతున్నా వినలేదు. కొడితే కొట్టించుకో.. ప్రత్యర్థులు కొడితే కొట్టించుకోవాల్సిందే అన్న రీతిగా మారింది పోలీసుల తీరు. ప్రత్యర్థులు తనపై బండరాళ్లు తీసుకుని దాడికి తెగబడుతుంటే ఆత్మరక్షణ కోసం పిస్టల్ తీసి చూపించి, ప్రాణాలు కాపాడుకోవడం జవాన్ పాలిట శాపమైంది. గతంలో జవాన్ చేసిన ఫిర్యాదుపై ఏనాడూ స్పందించని నాల్గో పట్టణ పోలీసులు ఏకంగా సోమవారం తమకు సమాచారం అందగానే ఉన్నఫళంగా ఘటన స్థలానికి చేరుకుని దాడికి కారకులైన వారిని కాకుండా జవాన్ నాగరాజును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. దుస్తులు ఊడదీయించి లాకప్‌లో వేశారు. అనంతరం ఆర్మీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు చూపితే తప్పు కాదా? ప్రాణాలు కాపాడుకునేందుకు పిస్టల్ బయటకు తీసి భయపెట్టిన జవాన్‌పై కేసు నమోదు చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. బండరాళ్లతో దాడి చేసేందుకు యత్నించిన వారిపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే అన్ని విషయాల్లో పోలీసులు ఇలాగే వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కేవలం స్థల వివాదం కోర్టులో ఉందనే కారణం చూపుతూ ఇంత కాలం చర్యలకు వెనకగడుగు వేసిన పోలీసులు.. కోర్టులో ఉన్న ఎన్నో వివాదాల్లో తలదూర్చడాన్ని మరిచిపోయి జవాన్‌కు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నో ఘటనల్లో పోలీసు అధికారులు తమ వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్ చూపి ప్రజలను బెదిరించిన విషయాలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. పోలీసులకో న్యాయం.. దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టిన జవాన్లకు మరో న్యాయమా అంటూ పోలీసుల తీరును ఎండగడుతున్నారు. ఆత్మరక్షణ కోసమే గన్ తీసా రూపాయి రూపాయి కూడబెట్టి ఐదు సెంట్లు స్థలం కొనుగోలు చేశాను. ఈ స్థలం కోసం ఎంతో కష్టపడ్డా. కొన్న తర్వాత ఈ స్థలం తమదంటూ కొందరు వస్తున్నారు. ఈ విషయంపై అనేకసార్లు పోలీసులను కలిశాను. సీఐ, డీఎస్పీలందరినీ వేడుకున్నాను. ఎవరూ పట్టించుకోలేదు. స్థలం కబ్జా చేయకూడదనే ఉద్దేశంతో సెలవుపై వచ్చి, నా ప్రయత్నాలు నేను చేస్తున్నా. నాపై దాడి చేయడానికి బండరాళ్లు తీసుకున్నారు. నేను ఒంటరిగా ఉన్నా.. ఏం చేయాలో తోచలేదు. రాళ్ల దాడి నుంచి నన్ను నేను కాపాడుకునేందుకు పిస్టల్ తీసి చూపించాను. నా దగ్గరకు రావద్దంటూ చెప్పాను. నేను చేసింది తప్పే కావచ్చు. దేశం కోసం పనిచేస్తున్నాననే చిన్న కనికరం కూడా పోలీసులు చూపలేదు.– నాగరాజు, బీఎస్ఎఫ్ జవాన్ భూ వివాదం కోర్టులో నడుస్తోంది సదరు స్థల వివాదం కోర్టులో నడుస్తోంది. 2012లో ఆ స్థలాన్ని జవాను నాగరాజు కొనుగోలు చేశారు. 2005 నుంచే ఆ స్థల విక్రేత అన్నదమ్ముల మధ్య స్థల వివాదం నడుస్తోంది. సదరు స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు ఉత్తర్వులున్నాయి. అయినా జవాన్ వెళ్లారు. నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళితే తుపాకీ చూపించి, బెదిరించారు. ఇది చట్టరీత్యా నేరం. అందుకే కేసు నమోదు చేశాం. – వెంకట్రావ్, డీఎస్పీ,అనంతపురం -
కల చెదిరింది !
- వర్షాలు లేక అడుగంటిపోయిన సీజీ ప్రాజెక్టు - మూడేళ్లుగా బీళ్లుగా మారిన 909 ఎకరాలు - వలసలే శరణ్యమంటున్న రైతన్నలు కదిరి: తనకల్లు మండల పరిధిలోని సీజీ ప్రాజెక్టు పూర్తిగా అడుగంటిపోయింది. దీంతో ఆయకట్టుకు మూడేళ్లుగా నీటి విడుదల బంద్ అయ్యాయి. ఈ ప్రాజెక్టు నిండితే 909 ఎకరాలు కుడి, ఎడమ కాలువల ద్వారా సాగవుతుంది. తవళం, టీ.చదుం, బాలసముద్రం, ముండ్లవారిపల్లి పంచాయితీల పరిధిలోని 60 గ్రామాల రైతులు సీజీ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందుతూ వచ్చారు. మూడేళ్లుగా వర్షాలు సరిగా లేకపోవడంతో ప్రాజెక్టులో నీరు కరువైంది. 1927 అడుగుల నీటి మట్టం ఉండాల్సిన ప్రాజెక్టు ఇప్పుడు 15 అడుగులకు పడిపోయింది. ఆ› ప్రాంతంలో సరాసరి వర్షపాతం 18 మిల్లీ మీటర్లు గతంలో నమోదయ్యేది. మూడేళ్లుగా చినుకు జాడలేక కనీస వర్షపాతం కూడా న మోదు కాకపోవడంతో ప్రాజెక్టు కళతప్పింది. కరవుకు అద్దం సాగు సందడితో కళకళలాడాల్సిన భూములు నేడు బీడుగా దర్శనమిస్తున్నాయి. ‘అయ్యా..ఇంతటి కరవు మేమెప్పుడూ చూడలేదు. రైతుకు ఎంత కష్టమొచ్చిందయ్యా..బోర్లన్నీ ఎండిపోయాయి. గతంలో ఎన్ని కరువులొచ్చినా ఎండిపోని బోర్లు ఈ మూడేళ్లలో ఎండిపోయాయి. ఇట్లే ఉంటే ఏం తినాలి..ఎట్లా బతకాలి’ అని కొక్కంటి క్రాస్‌కు చెందిన రైతు ఆదినారాయణ వాపోయాడు. ‘ప్రాజెక్టులో నీళ్లుంటే మండలమంతా పనులుండేవి. ఎవరింట్లో చూసినా ధాన్యానికి కొదవుండేది కాదు. ప్రాజెక్టు గేట్లెత్తి సరిగ్గా మూడేళ్లు దాటిపోయింది. ఈసారి కూడా వాన రాకపోతే గంజి నీళ్లే గతి’ అని టీ. సదుంకు చెందిన రైతు వెంకటరమణ తన గోడు వెల్లబోసుకున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏ రైతును కదిపినా, రైతు కూలీని పలకరించినా కన్నీటి గాథలే విన్పిస్తున్నాయి. నీరు చేరేది ఇలా... పాపాఘ్ని నది కర్ణాటకలోని కోలార్ జిల్లా నందికొండ వద్ద పుట్టి వివిధ ప్రాంతాల్లో ప్రవహిస్తుంది. అందులో ఒక చీలిక మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కందుకూరు చెరువులో కలుస్తుంది. అక్కడి మిగులు జలాలు అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో ఉన్న సీజీ ప్రాజెక్టులో కలుస్తాయి. ఈ మిగులు జలాల ఆధారంగానే ఎన్పీ కుంట మండలంలో పెడబల్లి ప్రాజెక్టు నిర్మించారు. ఆ మిగులు జలాలు వైఎస్సార్ జిల్లాలోని వెలిగల్లు ప్రాజెక్టుకు చేరతాయి. టీడీపీ నేతల స్వార్థం చిత్తూరు జిల్లా కందుకూరు నుండి వచ్చే జలాలు సీజీ ప్రాజెక్టుకు రాకుండా చిత్తూరు జిల్లాకే పరిమితమయ్యే విధంగా అక్కడి అధికార టీడీపీ నాయకులు చర్యలు తీసుకున్నారు. ఆ జిల్లాలోని కమ్మచెరువుతో పాటు మరో 6 చెరువులకు ఆ నీటిని మళ్లించారు. ప్రస్తుతం కర్ణాటకలోని వందమానేరు నుండి వచ్చే మిగులు జలాలు మాత్రమే సీజీ ప్రాజెక్టుకు చేరుతున్నాయి. అక్కడ భారీ వర్షాలు కురిస్తేగాని సీజీ ప్రాజెక్టుకు నీరు చేరే పరిస్థితి లేదు. మూడేళ్లుగా బీడే – వెంకటనారాయణ, రైతు, బాలసముద్రం ప్రాజెక్టుకింద ఉన్న నా మూడెకరాల పొలం మూడేళ్లుగా బీడుగానే ఉంది. ఒకసారి ప్రాజెక్టులో నీళ్లున్నాయని వరి పంట సాగుచేస్తే తీరా పంట చేతికొచ్చేసరికి ప్రాజెక్టులో నీళ్లు అయిపోయి పంట అంతా ఎండిపోయింది. ఆ తర్వాత ప్రాజెక్టులోకి నీళ్లు రాలేదు. నేనే కాదు సుమారు వెయ్యి ఎకరాలు బీళ్లుగా ఉన్నాయి. శని పట్టుకుంది – రైతు బాషుసా»Œ , కొక్కంటి క్రాస్ సీజీ ప్రాజెక్టును 1954లో కట్టారు. 1994 తర్వాత వచ్చిన ఏడేళ్ల వరుస కరవుల్లో తప్ప ప్రాజెక్టులో ఎప్పుడూ నీళ్లుండేవి. ఆ కరవు మళ్లీ ఇప్పుడొచ్చింది. మూడేళ్లుగా మాకే కాదు.. రాష్ట్రమంతా శని పట్టుకుంది. నాకు ప్రాజెక్టు కింద రెండున్నర ఎకరాలు ఉంది. ఇంతకు ముందు బాగా వరి పండేది. ఇప్పుడు అది బీడుగా మారింది. -
మురిగిన గుడ్లు...పుచ్చిన కూరగాయలు
తనకల్లు: స్థానిక హరిజనవాడలోని అంగన్వాడీ కేంద్రానికి సరఫరా చేసిన కోడిగుడ్లు కుళ్లిపోగా, వంట చేయాడానికి తెచ్చిన కూరగాయలు పుచ్చిపోయాయని విద్యార్థులు తల్లిదండ్రులు విలేకరులతో వాపోయారు. శనివారం వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు మంచి పోషక విలువలున్న ఆహారాన్ని అందిస్తామని బీరాలు ప్రభుత్వం పలుకుతోందే కానీ.. అది వాస్తవ విరుద్ధమన్నారు. మండలకేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే గ్రామాల్లోని కేంద్రాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. కుళ్లిన గుడ్లు, పుచ్చిపోయిన కూరగాయలు తింటే తమ పిల్లల ఆరోగ్యం ఏం కావాలని వారు ప్రశ్నించారు. ఐసీడీఎస్ అధికారులు ఏజెన్సీల నుంచి ముడుపులు తీసుకుంటున్నారని వారు ఆరోపించారు. ఉన్నాతాధికారులు స్పందించి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేకుంటే తమ పిల్లలను కేంద్రాలకు పంపేది లేదని వారు హెచ్చరించారు. -
వివాహిత ఆత్మహత్య
తనకల్లు : భర్తకు తెలియకుండా పైసా పైసా కూడబెట్టుకున్న డబ్బును తన ఖాతాలో జమచేయలేదని మనస్థాపం చెంది రెడ్డెమ్మ (28) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలసముద్రంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రెడ్డెమ్మ తన భర్త కొండప్పకు తెలియకుండా రూ. 40 వేలు పోగు చేసుకుంది. దాచుకోడానికి సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ డబ్బును రూ. 500, రూ. 1000 నోట్లుగా మార్చుకొని ఎవ్వరికీ తెలియకుండా ఇంట్లో దాచుకుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేయడంతో భయపడిన రెడ్డమ్మ మొత్తం డబ్బును భర్త చేతికి ఇచ్చి ఏపీజీబీలోని తన ఖాతాలో వేయాలని చెప్పింది. కాగా తన భార్య పేరున ప్రభుత్వం పక్కా గృహాన్ని మంజూరు చేసి ఉండడం, ఈ డబ్బు ఆమె ఖాతాలో వేస్తే ఎక్కడ ఇల్లు రద్దు అవుతుందేమోనని భావించిన కొండప్ప ఆ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తరువాత ఈ విషయంపై ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆదివారం రాత్రి కొండప్ప వ్యాపారం కోసం ధర్మవరానికి వెళ్లాడు. రెడ్డెమ్మ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇంట్లో నిద్రిస్తోంది. తెల్లవారుజామున ఇంట్లోనే ఉరి వేసుకుంది. పిల్లలు ఇద్దరు లేచి గట్టిగా కేకలు వేశారు. స్థానికులు అక్కడికి చేరుకుని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నిస్తుండగా ఆమె మృతి చెందింది. మృతురాలి తల్లి ఉత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
పిచ్చికుక్క స్వైరవిహారం.. ఏడుగురికి గాయాలు
తనకల్లు (అనంతపురం): పిచ్చికుక్క స్వైర విహారం చేసి ఏడుగురిని గాయపరిచిన సంఘటన బుధవారం తనకల్లు మండలంలోని ఇందిరానగర్‌లో జరిగింది. ఇందిరానగర్‌కు చెందిన రామాంజులు, రెడ్డిప్రసన్న, నారాయణమ్మ, ప్రకాష్‌లతో పాటు చిన్నారులు పోమేష్, జాయ్, శివలను పిచ్చికుక్క దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన బాధితులు స్థానిక 30 పడకల ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు.