ఆర్‌వోఆర్–2020 చట్టం పూర్తిగా మార్చాలని నిర్ణయం
పాత చట్టంతో సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయనే అభిప్రాయం
పాత చట్టాన్ని సవరించాలని, కొత్త చట్టమైనా ఓకే అన్న ధరణి కమిటీ
తమదైన ముద్ర ఉండేలా కొత్త చట్టం వైపే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు!
కీలక సవరణలతో ఆర్‌వోఆర్– 2024 చట్టం ముసాయిదా రూపకల్పన పనిలో అధికారులు
అధికార వికేంద్రీకరణ, రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఏర్పాటుపై స్పష్టత!
18 లక్షల ఎకరాల పార్ట్–బీ భూములు, 9 లక్షల ఎకరాల సాదా బైనామాలకు పరిష్కారం
వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రస్తుతమున్న ఆర్‌వోఆర్ చట్టం ఉపయోగ పడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్–2020) చట్టాన్ని పూర్తిగా మార్చాలనే నిర్ణయానికి వచ్చింది. పాత చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకురానుంది. అనేక అంశాల్లో స్పష్టతనిస్తూ కొత్త చట్టాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం. ముసాయిదా చట్టం సిద్ధమవుతోందని, వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనికి ఆమోదం తెలిపే బిల్లును తీసుకువస్తారనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది.
కొత్త చట్టమే ఉత్తమం!
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను అమల్లోకి తెస్తున్న సందర్భంగా, ఇంతకుముందున్న చట్టం స్థానంలో ఆర్‌వోఆర్–2020 చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం నియమించిన ప్రత్యేక కమిటీ ఈ చట్టాన్ని అధ్యయనం చేసింది. ఈ చట్టం ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని, చాలా అంశాలపై ఇది స్పష్టత ఇవ్వడం లేదని, దీని ద్వారా భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోగా, కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయని కమిటీలోని నిపుణులు అభిప్రాయపడ్డారు.
పాత చట్టంలో చేయాల్సిన సవరణల గురించి పలు సిఫారసులు చేశారు. లేనిపక్షంలో పూర్తిగా కొత్త చట్టాన్నైనా తీసుకురావాలంటూ ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలోనే లోపభూయిష్టమైన పాత చట్టానికి మార్పులు చేయడం కన్నా తమ ముద్ర ఉండే విధంగా కొత్త చట్టాన్ని తీసుకురావడమే సమంజసమనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వచి్చనట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే పాత చట్టంలోని కొన్ని అంశాలను తీసుకుంటూనే, అవసరమైన కీలక సవరణలు చేస్తూ రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్–2024) చట్టాన్ని రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. ముసాయిదా చట్టంపై న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత రాష్ట్ర కేబినెట్‌లో ఆమోదించి, ఆ తర్వాత జూలైలో నిర్వహించే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ఆమోదం పొందేలా ప్రభుత్వం కసరత్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
కీలకాంశాల్లో మార్పులతో..
రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్‌వోఆర్ చట్టంలోని కీలకాంశాల్లో మార్పులు చేస్తూ కొత్త చట్టం తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా భూసమస్యల పరిష్కారం కోసం పలు స్థాయిల్లోని అధికారులకు ఉండే అధికారాల వికేంద్రీకరణపై కొత్త చట్టంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లకు ఎలాంటి అధికారాలు ఇవ్వాలి, ఆయా స్థాయిల్లోని అధికారులు ఎలాంటి నిర్ణయాలకు బాధ్యత వహిస్తారనే అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా పార్ట్–బీలో పెట్టిన 18 లక్షల ఎకరాలు, సాదాబైనామాల కింద లావాదేవీలు జరిగి పాస్ పుస్తకాలు రాని 9 లక్షల ఎకరాల భూములకు పరిష్కారం చూపించే దిశలో చట్టం రూపొందుతోందని తెలుస్తోంది.
అసైన్డ్, భూదాన్ కంగాళీకీ చెక్!
అసైన్డ్, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూములకు సంబంధించిన కంగాళీ కూడా లేకుండా అన్ని సమస్యలకు పరిష్కారం చూపే విధంగా పాత చట్టాన్ని మార్చి కొత్త చట్టాన్ని తయారుచేస్తున్నారని, రెవెన్యూ ట్రిబ్యునళ్ల పునరుద్ధరణ లాంటి కీలక అంశాలు కొత్త చట్టంలో ఉంటాయని తెలుస్తోంది.
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేసే అధికారాలను జాయింట్ సబ్ రిజి్రస్టార్ హోదాలో తహసీల్దార్లకే ఉంచాలా లేక డిప్యూటీ తహసీల్దార్లకు అప్పజెప్పాలా అన్న దానిపై కూడా కొత్త చట్టంలో స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారం. కాగా ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను సమర్పించనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment