18 జిల్లాలకు కొత్త కలెక్టర్లు
ప్రస్తుతం కలెక్టర్లుగా పనిచేస్తున్న వారిలో 8 మందికి నో పోస్టింగ్... జీఏడీలో రిపోర్టు చేయాలని పేర్కొనని వైనం
ఒకట్రెండు రోజుల్లో జిల్లా ఎస్పీలకూ స్థానచలనం
త్వరలో కీలక కార్యదర్శులు బదిలీ?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, లోక్‌సభ సాధారణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పాలనా వ్యవస్థ ప్రక్షాళనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి దృష్టిసారించారు. ప్రభుత్వ ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా పని చేసే అధికారులతో సొంత జట్టు కూర్పుపై వారం పది రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాతోపాటు ఆయా జిల్లాల మంత్రులతో చర్చించిన అనంతరం శనివారం భారీ సంఖ్యలో జిల్లా కలెక్టర్లను బదిలీ చేశారు.
జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, సచివాలయంలో సంయుక్త కార్యదర్శులుగా కీలక స్థానాల్లో పనిచేస్తున్న 26 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశా రు. ఒకేసారి 18 జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం కల్పించి వారి స్థానంలో కొత్త అధికారులను నియమించారు. బదిలీ అయిన 8 మంది జిల్లా కలెక్టర్లకు కొత్త పోస్టింగ్‌పై ఉత్తర్వుల్లో ఎలాంటి ప్రస్తావన లేదు. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొనకపోవడంతో వారిని త్రిశంకు స్వర్గంలో ఉంచినట్టు అయిందని చర్చ జరుగుతోంది.
పమేలా సత్పతి, సిక్తా పటా్నయక్, యాస్మిన్ బాషా, హరిచందన దాసరి, అశీష్ సంగ్వాన్, భవేష్ మిశ్రా, రవి, ప్రియాంక అలా వీరిలో ఉన్నారు. వీరందరికి పోస్టింగ్ ఇవ్వాలంటే మరోసారి భారీస్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేయనున్నట్లు స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ట్రాన్స్‌కో జేఎండీగా కీలకమైన పోస్టులో సందీప్‌కుమార్ ఝాను నియమించగా, ఆ సంస్థ సీఎండీ సయ్యద్ అలీ ముర్తుజా రిజీ్వకి ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా ఖాళీగా కూర్చొబెట్టారు.
తాజాగా సందీప్‌కుమార్ ఝా సైతం బదిలీకావడం గమనార్హం. గత బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో పోస్టింగ్‌లు పొందిన అధికారులందిరికీ స్థానచలనం కల్పించాలనే భావనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసేందుకు కొన్ని రోజులుగా కసరత్తు చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో జిల్లా ఎస్పీల బదిలీలపై సైతం ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. కీలక ప్రభుత్వ శాఖల కార్యదర్శులను సైతం బదిలీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తోంది. త్వరలో దీనిపై ఉత్తర్వులు రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment