రూ. 2,600 కోట్లు అప్పు తెచ్చుకొనేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు
రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా హడ్కోకు దరఖాస్తు
ఇటీవలి సమీక్షలో ఈ మేరకు ప్రాథమికంగా నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణలో సగం వాటా భరించడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద భారంగా మారింది. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించనుంది. భూసేకరణలో సగం ఖర్చు కూడా కేంద్రమే భరిస్తుంది. మిగతా సగం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. అయితే ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేని ప్రస్తుత తరుణంలో భూసేకరణ వ్యయంలో సగం భరించడం కూడా ప్రభుత్వానికి కష్టంగా మారింది. సొంత ఆదాయవనరుల నుంచి నిధులు కేటాయించే పరిస్థితి లేకపోవడంతో రుణం తీసుకోవాలని నిర్ణయించింది. వాస్తవానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా రుణం వైపే మొగ్గుచూపింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంథాలో వెళ్తోంది.
హడ్కో వైపు చూపు: భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఒకేసారి చెల్లించాలంటూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) గతంలో ఒత్తిడి చేసింది. దీన్ని నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఏర్పడింది. ఆ డబ్బు చెల్లించకుంటే ప్రాజెక్టే నిలిచిపోయే ప్రమాదం ఉందంటూ ఎన్‌హెచ్‌ఏఐ నుంచి పరోక్ష హెచ్చరికలూ వెలువడ్డాయి. చివరకు విడతలవారీగా చెల్లించేందుకు అంగీకారం కుదరింది. తొలుత రూ. వెయ్యి కోట్లు.. ఆ తర్వాత మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు నాటి ప్రభుత్వం సమ్మతించింది.
అయితే అలైన్‌మెంట్ మార్గంలో ఉన్న విద్యుత్ స్తంభాల లాంటి వాటి తరలింపునకు అవసరమయ్యే రూ. 364 కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని ఎన్‌హెచ్‌ఏఐ కోరడంతో ప్రస్తుత ప్రభుత్వం తొలుత తటపటాయించినా తర్వాత సమ్మతించింది. కానీ సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించాక ఆ మొత్తాన్ని కేంద్రమే భరించేందుకు సిద్ధమైంది.
ఈ తరుణంలో భూపరిహారం వాటా నిధుల కోసం రుణం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం ప్రారంభించింది. అప్పట్లో ఇదే విషయాన్ని అధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. కానీ ఎక్కడి నుంచి రుణం పొందాలనే విషయంలో డోలాయమానం నెలకొంది. వారం క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో దీనిపై స్పష్టత వచి్చంది. రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా హడ్కో నుంచి సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ప్రాజెక్టు నిర్మాణ సన్నాహాలు వేగం పుంజుకోనున్నాయి.
అంచనా వ్యయం పెరిగే అవకాశం..
గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో నెలకొన్న విభేదాలు, ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు.. ఇలా దాదాపు రెండేళ్ల సమయం గడిచిపోయింది. దీనివల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. 2022 చివర్లో రీజనల్ రింగురోడ్డుకు బడ్జెట్ ఖరారు చేసిన సమయంలో ఉత్తర భాగం నిర్మాణానికి రూ. 13,200 కోట్లు ఖర్చవుతుందని ఎన్‌హెచ్‌ఏఐ ప్రతిపాదించింది. ఇప్పుడు ఆ మొత్తం రూ. 16 వేల కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. దీంతో ఇక జాప్యం చేయకుండా వెంటనే టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోగా భూపరిహారం వ్యవహారాన్ని కొలిక్కి తేవాల్సి ఉంది. ఇది జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో వీలైనంత త్వరలో లోన్ మొత్తాన్ని పొందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment