ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్తున్న పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, మహేశ్‌కుమార్‌గౌడ్, అజారుద్దీన్ తదితరులు
చలో రాజ్‌భవన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
అదానీని కాపాడేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు
రాజ్‌భవన్‌కు సమీపంలో రోడ్డుపై బైఠాయించి నిరసన
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లుగా దేశ ప్రతిష్టను పెంచిందని, కానీ అదానీ, ప్రధాని మోదీ కలిసి ప్రపంచం ముందు దేశం పరువు తీశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. అమెరికాకు సంబంధించిన సంస్థలకు అదానీ లంచాలు ఇచ్చారని ఆ దేశ విచారణ సంస్థలు నివేదిక ఇచ్చినా అదానీ అక్రమాలపై ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. అదానీపై వచి్చన ఆర్థిక అవకతవకల ఆరోపణలు, మణిపూర్ అల్లర్లపై కేంద్ర వైఖరికి నిరసనగా.. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించారు.
సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్ వైపు భారీ ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని రాజ్‌భవన్ రోడ్డులో కొంతదూరం వచి్చన తర్వాత అడ్డుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి తదితరులు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి, అదానీ, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
అదానీతో మోదీ లాలూచీ ఏంటి?
‘భారత వ్యాపార వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయి. వ్యాపారాలు చేయాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అదానీ సంస్థలు అమెరికాలో లంచాలు ఇచ్చాయని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎఫ్‌బీఐ నివేదించడంతో అక్కడి ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేసేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. అలా చేస్తే అదానీ జైలుకు వెళ్లాల్సి వస్తుంది.
ఆయన్ను కాపాడేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారు. దేశ పరువు ప్రతిష్టను మంటకలిపిన అదానీపై విచారణ చేపట్టాలని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో డిమాండ్ చేశారు. అయినా మోదీ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. దేశాన్ని దోచుకున్న అదానీపై జేపీసీ వేయడానికి ప్రధాని ఎందుకు సిద్ధంగా లేరు? అదానీతో లాలూచీ ఏంటి? ఈ అంశంపై మాట్లాడేందుకు ఎందుకు ముందుకు రావడం లేదు? దేశం పరువును మంటగలిపిన అదానీపై విచారణ జరగాలి. ఇప్పటికైనా జేపీసీ వేయకపోతే అవసరమైతే రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేసేందుకు కూడా సిద్ధం..’అని సీఎం అన్నారు.
అదానీపై కేసీఆర్, బీఆర్‌ఎస్ వైఖరి చెప్పాలి
‘అదానీ విషయంలో కేసీఆర్, బీఆర్‌ఎస్ వైఖరి ఏంటో చెప్పాలి. మీరు ప్రజల వైపా.. అదానీ వైపా చెప్పాలి. బీఆర్‌ఎస్ జేపీసీ కోసం డిమాండ్ చేస్తే శాసనసభలో తీర్మానం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. నిజానికి మోదీ, కేసీఆర్ వేర్వేరు కాదు. ఇద్దరూ నాణానికి బొమ్మ, బొరుసు లాంటివారు. బీజేపీతో చీకటి ఒప్పందంలో భాగంగానే ఆ పార్టీ అదానీపై స్పందించడం లేదు. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి బీఆర్‌ఎస్ లొంగిపోయింది..’అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
దేశ ప్రజల కోసమే దీక్ష: డిప్యూటీ సీఎం భట్టి
‘దేశ సంపదను, ఆర్థిక సంస్థలను మోసగిస్తున్న అదానీపై జేపీసీ వేసి చట్టపరమైన విచారణ చేపట్టాలని కోరుతున్నా పట్టించుకోకపోవడంతో, దేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టాం. ఈ దేశ, రాష్ట్ర సంపదను, వనరులను తమకు దగ్గరగా ఉండే కొద్దిమందికి దోచి పెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు.
మోదీ సహకారంతో అదాని ఈ దేశంలో చేస్తున్న దోపిడీ తీరును వివరించేందుకు ఏఐసీసీ చేపట్టిన కార్యక్రమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలి..’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. అదానీ ఎన్నో కుంభకోణాలకు పాల్పడుతున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. సామాన్యులు, రైతులు రుణాలు చెల్లించడం ఆలస్యమైతే ఆస్తులను జప్తు చేసే ప్రభుత్వం.. అదానీ విషయంలో ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తోందని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment