chalo rajbhavan
-
అదానీ..ప్రదాని.. దేశం పరువు తీశారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లుగా దేశ ప్రతిష్టను పెంచిందని, కానీ అదానీ, ప్రధాని మోదీ కలిసి ప్రపంచం ముందు దేశం పరువు తీశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. అమెరికాకు సంబంధించిన సంస్థలకు అదానీ లంచాలు ఇచ్చారని ఆ దేశ విచారణ సంస్థలు నివేదిక ఇచ్చినా అదానీ అక్రమాలపై ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. అదానీపై వచి్చన ఆర్థిక అవకతవకల ఆరోపణలు, మణిపూర్ అల్లర్లపై కేంద్ర వైఖరికి నిరసనగా.. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించారు.సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్ వైపు భారీ ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని రాజ్‌భవన్ రోడ్డులో కొంతదూరం వచి్చన తర్వాత అడ్డుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి తదితరులు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి, అదానీ, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. అదానీతో మోదీ లాలూచీ ఏంటి? ‘భారత వ్యాపార వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయి. వ్యాపారాలు చేయాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అదానీ సంస్థలు అమెరికాలో లంచాలు ఇచ్చాయని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎఫ్‌బీఐ నివేదించడంతో అక్కడి ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేసేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. అలా చేస్తే అదానీ జైలుకు వెళ్లాల్సి వస్తుంది.ఆయన్ను కాపాడేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారు. దేశ పరువు ప్రతిష్టను మంటకలిపిన అదానీపై విచారణ చేపట్టాలని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ పార్లమెంట్లో డిమాండ్ చేశారు. అయినా మోదీ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. దేశాన్ని దోచుకున్న అదానీపై జేపీసీ వేయడానికి ప్రధాని ఎందుకు సిద్ధంగా లేరు? అదానీతో లాలూచీ ఏంటి? ఈ అంశంపై మాట్లాడేందుకు ఎందుకు ముందుకు రావడం లేదు? దేశం పరువును మంటగలిపిన అదానీపై విచారణ జరగాలి. ఇప్పటికైనా జేపీసీ వేయకపోతే అవసరమైతే రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేసేందుకు కూడా సిద్ధం..’అని సీఎం అన్నారు. అదానీపై కేసీఆర్, బీఆర్ఎస్ వైఖరి చెప్పాలి ‘అదానీ విషయంలో కేసీఆర్, బీఆర్ఎస్ వైఖరి ఏంటో చెప్పాలి. మీరు ప్రజల వైపా.. అదానీ వైపా చెప్పాలి. బీఆర్ఎస్ జేపీసీ కోసం డిమాండ్ చేస్తే శాసనసభలో తీర్మానం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. నిజానికి మోదీ, కేసీఆర్ వేర్వేరు కాదు. ఇద్దరూ నాణానికి బొమ్మ, బొరుసు లాంటివారు. బీజేపీతో చీకటి ఒప్పందంలో భాగంగానే ఆ పార్టీ అదానీపై స్పందించడం లేదు. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి బీఆర్ఎస్ లొంగిపోయింది..’అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేశ ప్రజల కోసమే దీక్ష: డిప్యూటీ సీఎం భట్టి ‘దేశ సంపదను, ఆర్థిక సంస్థలను మోసగిస్తున్న అదానీపై జేపీసీ వేసి చట్టపరమైన విచారణ చేపట్టాలని కోరుతున్నా పట్టించుకోకపోవడంతో, దేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టాం. ఈ దేశ, రాష్ట్ర సంపదను, వనరులను తమకు దగ్గరగా ఉండే కొద్దిమందికి దోచి పెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు.మోదీ సహకారంతో అదాని ఈ దేశంలో చేస్తున్న దోపిడీ తీరును వివరించేందుకు ఏఐసీసీ చేపట్టిన కార్యక్రమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలి..’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. అదానీ ఎన్నో కుంభకోణాలకు పాల్పడుతున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. సామాన్యులు, రైతులు రుణాలు చెల్లించడం ఆలస్యమైతే ఆస్తులను జప్తు చేసే ప్రభుత్వం.. అదానీ విషయంలో ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తోందని నిలదీశారు. -
‘రేవంత్ ధర్నా చూసి జనం నవ్వుకున్నారు’
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన మంత్రి వర్గ సహచరులతో.. అనుచరులతో రాజ్ భవన్ ముందు ధర్నా చెయ్యడం విడ్డూరంగా ఉందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన మంత్రివర్గ సహచరులతో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఇవాళ హైదరాబాద్ రాజ్ భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా అనిపించింది. ఏడాదిగా పాలనలతో.. సరైన పాలన లేదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి మీద గాని ముందుడుగు పడటం లేదు.👉ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా అన్నిరకాల వైఫల్యంతో.. 12 ఏళ్లలో రావాల్సిన ప్రజావ్యతిరేకతను 12 నెలల్లోనే కూడగట్టుకున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద మోదీ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. రేవంత్ రెడ్డి ధర్నా చేయడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు అదానీ విషయం మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. వందకోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటీకి ఖర్చు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నప్పుడు గుర్తులేదా?.. వందకోట్ల సహాయం ఎందుకు అడిగారు? ఎందుకు ఇస్తామన్నారు? ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.👉కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్నా.. రేవంత్ అయినా రాహుల్ గాంధీ అయినా.. ఏ ప్రాతిపదికన అదానీ మీద చర్యలు తీసుకోవాలి. ఒక సాక్ష్యం చూపిస్తారా?. మన మీడియా ముందు, న్యాయస్థానాల ముందు, ప్రజలముందు ఆధారాలు చూపించకుండా.. విమర్శలు చేయడం సరికాదు.👉గత పార్లమెంటు ఎన్నికల్లో ఇటీవల వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న పార్టీ.. ఇవాళ ఫ్రస్టేషన్ లో అదానీ మాట మాట్లాడుతోంది. కేంద్ర ప్రభుత్వం పొరపాటు చేసిందని, కేంద్రం అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరూపించగలరా?.👉మాటమీద నిలబడే సత్తాలేక.. ఇవాళ విమర్శలు చేస్తున్నారు. ప్రపంచదేశాల ముందు భారతదేశాన్ని నవ్వలుపాలు చేస్తున్నది, భారత దేశ గౌరవ వ్యవస్థలపైన.. విదేశాల్లో మన సైనికుల మీద పరువు తీసే విధంగా మాట్లాడే అలవాటు మీ నాయకుడైన రాహుల్ గాంధీకి ఉంది.👉రేవంత్ రెడ్డి, కేసీఆర్ వైపే ఉన్నడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తులే. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే.. మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే రావాలని కాంగ్రెస్ అధిష్టానం.. రేవంత్ రెడ్డికి హెచ్చరించిందా?. అందుకే రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పాట పాడుతున్నాడా?. రేవంత్ రెడ్డి, కేసీఆర్ బొమ్మ బొరుసు లాంటి వ్యక్తులు.. దొందూ దొందే. ఈ రెండు పార్టీల పాలనకు తేడా లేదు. ప్రజలను వంచించడంలో తెలంగాణ సంపదను దోచుకోవడంలో, కుటుంబ పరిపాలన తీసుకురావడంలో, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
ప్రధాని, అదానీ కలిసి దేశం పరువు తీశారు: సీఎం రేవంత్
Congress Chalo Raj Bhavan Updates..రాజ్‌భవన్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ..ప్రధాని, అదానీ అనుబంధం మన దేశ ప్రతిష్టను దెబ్బ తీస్తోందిదేశంలో వ్యాపారం చేయాలంటే లంచం ఇచ్చే పరిస్థితిని తెచ్చారుఅదానీ, ప్రధాని కలిసి దేశం పరువు తీశారుజేపీసీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందిఅదానీ విషయంలో ప్రధానిని అడిగినా, కడిగినా కనీసం మాట్లాడడం లేదు. ముఖ్యమంత్రి రాజ్‌భవన్ వద్దకు నిరసన ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మా నిరసన కొందరికి నచ్చకపోవచ్చు. 75 ఏళ్ల కష్టపడి కాంగ్రెస్.. దేశ ప్రతిష్టను పెంచింది. ప్రధాని, అదానీ కలిసి దేశం పరువు తీస్తున్నారు.అదానీ లంచాలు ఇచ్చారని అమెరికా సంస్థలు తేల్చాయి.ఈ విషయంలో అదానీపై అమెరికాలో కేసు నమోదైంది.ఈ అంశంపై పార్లమెంట్లో రాహుల్ గాంధీ నిలదీశారు.కానీ, దీనిపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు.మమ్మల్ని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే నిరసన చేపడుతున్నాం.అదానీపై విచారణ జరగాలి.అదానీ అంశంపై జేపీసీ వేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.కానీ, కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.దీనిపై అవసరమైతే రాష్ట్రపతిభవన్ వద్ద కూడా నిరసనలు తెలుపుతాం.విధిలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన నేను కూడా నిరసనల్లో పాల్గొనాల్సి వచ్చింది.ప్రజాస్వామ్యాన్ని, పప్రజా ధనాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది.నక్కలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది.నేను ధర్నా చేయను.. మరి బీఆర్ఎస్ నేతలు చేస్తారా?.తన విధానమేంటో బీఆర్ఎస్ చెప్పాలి.అదానీ విషయంలో కేంద్రాన్ని నిలదీయాలా వద్దా చెప్పండి.ఢిల్లీలో బీజేపీ పెద్దలతో బీఆర్ఎస్ను అనుబంధం ఉంది.అందులో భాగంగానే అదానీ అవినీతిపై బీఆర్ఎస్ మాట్లాడటం లేదు.బీఆర్ఎస్ నేతలు రెడీ అంటే అసెంబ్లీలో తీర్మానం చేద్దాం.. బీఆర్ఎస్ నేతలు వస్తారా?. 👉రాజ్‌భవన్ వద్ద రోడ్డుపై సీఎం రేవంత్, భట్టి, కాంగ్రెస్ నేతలు బైఠాయింపు..నిరసనలు తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు..కాసేపట్లో గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వనున్న హస్తం నేతలు.అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్ల విషయంలో ప్రధాని మౌనంపై నిరసనలు.ఏఐసీసీ పిలుపుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలు. 👉టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నిరసనల్లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. 👉నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం అక్కడి నుంచి కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌కు బయలుదేరారు. 👉అక్కడి నుంచి రాజ్‌భవన్ వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీగా వెళ్లనున్నారు.👉దేశంలో అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంపై ఏఐసీసీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అమెరికాలో గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాన్ని, పరువును దెబ్బతీశాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అవినీతి, మోసం, మనీలాండరింగ్, మార్కెట్ మానిప్యులేషన్ లాంటి అంశాలలో అదానీ దేశ ప్రతిష్టను దెబ్బతీశారని తీవ్ర విమర్శలు చేశారు. మణిపూర్‌లో వరుసగా జరిగిన అల్లర్లు, విధ్వంసాలపై మోదీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ ర్యాలీలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
‘రాజ్’కున్న ముట్టడి
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాలపై ఈడీ వేధింపులను నిరసిస్తూ, ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ గురువారం రాష్ట్ర కాంగ్రెస్ చేపట్టిన ‘రాజ్‌భవన్ ముట్టడి’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజ్‌భవన్ వైపునకు వెళ్లకుండా పోలీసులు నాలుగంచెల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. వచ్చినవారిని వచ్చినట్టుగా అదుపు లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర వాగ్వాదాలు, తోపులాట, లాఠీచార్జి, అరెస్టులు తదితర ఘటనలతో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ చౌరస్తా అట్టుడికి పోయిం ది. ఉదయం 5:30 నుంచి ప్రారంభమైన ఈ ముట్టడి కార్యక్రమం మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగడం తో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. చివరకు పోలీసులు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలందరినీ అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తెల్లవారుజాము నుంచే టీపీసీసీ పిలుపు నేపథ్యంలో గురువారం తెల్లవారు జామునే ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు పోలీసుల కళ్లుగప్పి రాజ్‌భవన్ వద్దకు చేరుకుని గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో తక్కువ సంఖ్యలో ఉన్న పోలీసులు అతి కష్టం మీద వీరందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత టీపీసీసీ మత్స్య కారుల కమిటీ చైర్మన్ మెట్టుసాయికుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుల నేతృత్వంలో కార్యకర్తలు 3 దఫాలుగా రాజ్‌భవన్ వద్దకు చేరుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివసేనారెడ్డిని అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన కాలు పోలీస్ వాహనం డోర్లో ఇరుక్కుపోయింది. దీంతో మరో కాలుతో ఆయన ఆ డోర్ అద్దాలను పగులగొట్టడంతో ఆయనతో పాటు ఒకరిద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఖైరతాబాద్ చౌరస్తాలో గురువారం కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన.. నిలిచిపోయిన ట్రాఫిక్ జగ్గారెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డిలకు గాయాలు ఉదయం 10:45 సమయంలో రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, ఏఐసీసీ కార్య క్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్ తదితరులు ఖైరతాబాద్ చౌరస్తాకు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో వారు అక్కడే బైఠాయించారు. అదే సమయంలో ఆవేశా నికి లోనైన యూత్‌కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు అక్కడ ఉన్న ఓ బైక్‌కు నిప్పు పెట్టారు. కాచిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ గందరగో ళంలో రేవంత్ బృందం నాలుగో అంచె బారికేడ్ల వరకు చేరుకున్నారు. అయితే అక్కడ ముళ్లకంచెలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో పోలీసులు వారిని నిలువరించగలి గారు. భట్టి, రేవంత్‌రెడ్డితో పాటు ఇతర నేతలు కార్యకర్త లను అదుపులోకి తీసుకుని.. పోలీసు వాహనంలో తర లిస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు లాఠీ చార్జి చేశారు. టీపీసీసీ నేత చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని ఐదుగురు పోలీసులు చుట్టుముట్టి లాఠీచార్జి చేయడంతో గాయాలయ్యాయి. ఆయన్ను చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పోలీసులను తప్పించుకుని దాదాపు రాజ్‌భవన్ వరకు వెళ్లారు. అక్కడ బారికేడ్లను దాటే క్రమంలో ఆయన మోకాలికి గాయమైంది. జగ్గారెడ్డి తదితరులను కూడా పోలీసులు అక్కడినుంచి తరలించారు. మాజీ ఎంపీలు వి.హనుమం తరావు, మల్లురవి, బోసురాజు, శ్రీనివాసకృష్ణన్, ఆది శ్రీనివాస్, కె.మదన్మోహన్రావు తదితరులను కూడా పోలీసులు రాజ్‌భవన్ వైపునకు వెళ్లకుండా అడ్డుకుని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. రేణుక రాకతో మరోమారు ఉద్రిక్తత మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కొందరు మహిళా నేతలతో కలిసి కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి రావడంతో మరోమారు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రాజ్‌భవన్ వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులకు, రేణుకకు మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారి చేయి తగలడంతో.. ఒక్కసారిగా ఆవేశానికి లోనైన ఆమె ఆయన కాలర్ పట్టుకుంది.. దీంతో వాతావరణం వేడెక్కింది. పోలీసులు అతికష్టం మీద ఆమెను అదుపులోకి తీసుకోగలిగారు. ఎస్సై కాలర్ పట్టుకున్న రేణుకపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తన చుట్టూ పురుష పోలీసులు ఉండడంతో దురదృష్టకరమైన ఘటన జరిగింది తప్ప తాను కావాలని చేయలేదని రేణుక వివరణ ఇచ్చారు. పోలీసులు తనను వెనకవైపు నుంచి నెట్టేయడం, గిల్లడం లాంటివి చేశారని, తనపైకి దూసుకు వస్తున్న ఎస్సైని రావొద్దంటూ చేయి పెట్టి అడ్డుకున్నానని, కాలర్ పట్టుకోలేదని వివరించారు. వాస్తవానికి గురువారం ఉదయం గవర్నర్ తమిళిసై నగరంలో లేరు. మధ్యాహ్నం పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఆమె కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసా గుతున్న సమయంలోనే రాజ్‌భవన్‌లోనికి వెళ్లారు. -
Telangana: టీ కాంగ్రెస్ నేతలపై కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మొత్తం మూడు కేసులు నమోదు అయ్యాయి. అనుమతులు లేకుండా గురువారం చలో రాజ్‌భవన్ నిర్వహించినందుకు పోలీసులు రంగంలోకి దిగారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో సహా పది మంది కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. భట్టి, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, హనుమంతరావుతో పాటు.. పలువురు కాంగ్రెస్ నేతల పేర్లను చేర్చారు. రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేశారని, అనుమతి లేకుండా రాజ్‌భవన్ ముట్టడికి వచ్చారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం పదమూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. జన జీవనానికి ఇబ్బంది కలిగించడమే కాకుండా .. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని ప్రస్తావించారు పోలీసులు. -
ఎస్సైతో దురుసు ప్రవర్తన!.. రేణుకా చౌదరిపై కేసు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గురువారం చలో రాజ్‌భవన్ సందర్భంగా.. పోలీసులతో ఆమె దురుసుగా ప్రవర్తించిన ఫుటేజ్‌లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఎస్సై కాలర్ పట్టుకున్నారు ఆమె. దీంతో ఎస్ఐ ఉపేంద్ర బాబు ఫిర్యాదు మేరకు సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. చలో రాజ్‌భవన్‌లో పోలీసులతో దురుసు ప్రవర్తనపై. రేణుకా చౌదరిపై కేసు నమోదు అయ్యింది. ఘటన తర్వాత బలవంతంగా ఆమెను అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రేణుకా చౌదరిని రిమాండ్‌కు తరలించే యోచనలో ఉన్నారు పోలీసులు. అయితే దురుసు ప్రవర్తన ఆరోపణలపై రేణుకా చౌదరి స్పందించారు. వెనకాల నుంచి తోసేయడంతో.. ఎస్ఐ భుజం పట్టుకున్నానని, అవమానపరిచే ఉద్దేశం లేదని ఆమె తెలిపారు. యూనిఫాంను ఎలా గౌరవించాలో తెలుసని, పోలీసుల పట్ల గౌరవం ఉందని ఆమె అన్నారు. #WATCH | Telangana: Congress leader Renuka Chowdhury holds a Policeman by his collar while being taken away by other Police personnel during the party's protest in Hyderabad over ED summons to Rahul Gandhi. pic.twitter.com/PBqU7769LE — ANI (@ANI) June 16, 2022 -
Hyderabad: ఉద్రిక్తంగా చలో రాజ్‌భవన్.. పోలీసుల సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాహుల్ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. పోలీసులను కూడా పెద్ద సంఖ్యలో మొహరించారు. కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఖైరతాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు బైక్‌కు నిప్పుపెట్టి నిరసనకు దిగారు. బస్సుల రాకపోకలను కూడా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్ వైపు దూసుకెళ్లారు. దీంతో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, అంజన్‌కుమార్ సహా పలువురు నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి కాంగ్రెస్ తలపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే క్రమంలో పోలీసులు రేణుకాచౌదరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమెకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రేణుకా చౌదరి ఎస్సై కాలర్ పట్టుకున్నారు. అయితే పోలీసులు ఆమెను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ రచ్చపై పోలీసుల సీరియస్ కాంగ్రెస్ ఆందోళనపై పోలీసులు సీరియస్ అయ్యారు. డీసీపీ జోయల్ డేవిస్ చొక్కా పట్టుకున్న భట్టి విక్రమార్క, ఎస్ఐ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి సహా పలువురు కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. రణరంగంగా మారిన ఖైరతాబాద్ రేవంత్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించడంతో కాంగ్రెస్ చేపట్టిన చలో రాజ్‌భవన్ ఉద్రిక్తంగా మారింది. ఖైరతాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు బైక్‌కు నిప్పుపెట్టి నిరసనకు దిగారు. బస్సుల రాకపోకలను కూడా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పట్ల దురుసుగా ప్రవర్తించిన కాంగ్రెస్ ముఖ్యనేతలు రేవంత్‌రెడ్డి సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ రాహుల్ గాంధీపై ఈడీ విచారణకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన చలోరాజ్‌భవన్ ఉద్రిక్తంగా మారింది. రాజ్‌భవన్‌కు వెళ్లే ఇరువైపులా రోడ్లను మూసివేయడంతో ఖైరతాబాద్ జంక్షన్లో భారీ ట్రాఫిక్ జాం అయింది. ఖైరతాబాద్-పంజాగుట్ట రూట్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. బేగంపేట మార్గంలోనూ ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు ట్రాఫిక్‌ను రాజ్‌భవన్ రూట్లోకి అనుమతించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత: ఛలో రాజ్‌భవన్ అడ్డగింత
-
ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్ ఆందోళన
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని.. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌పై మంగళవారం హైదరాబాద్‌లో చేపట్టిన చలో రాజ్ భవన్ ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ నుంచి ఎన్టీఆర్ మార్గం మీదుగా రాజ్‌భవన్ వెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రాజ్‌భవన్ ముట్టడి చేపట్టారు. అప్పటికే భారీగా చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నేతలను తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద అడ్డుకున్నారు. కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి, వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రైతులు ఈ చట్టంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా సామాన్యుడి నడ్డి విరిచేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వెంటనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాలని సవాల్ విసిరారు. శాంతియుతంగా రాజ్‌భవన్ ముట్టడికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన నాయకులను పోలీసులు ఆయా పోలీస్స్టేషన్లకు తరలించారు. జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. -
‘చలో రాజ్‌భవన్’ భగ్నం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో రాజ్‌భవన్ కార్యక్రమం భగ్నమైంది. ర్యాలీగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించాలన్నది కాంగ్రెస్ నేతల ఆలోచన కాగా, దిల్కుషా అతిథిగృహం వద్దే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి, గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్ వరకు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించినా.. అక్కడ పోలీసులు మోహరించడంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ బస చేసిన దిల్కుషా అతిథిగృహం నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లాలని నిర్ణయించారు. అయితే, గవర్నర్.. కాంగ్రెస్ నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకుని గోషామహల్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్టయిన వారిలో మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, నాయకులు వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, దామోదర రాజనర్సింహ, సంపత్ కుమార్, బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్, నేరేళ్ల శారద, ఇందిరా శోభన్ తదితరులున్నారు. టీఆర్ఎస్కు నిబద్ధత లేదు: ఉత్తమ్ అంతకుముందు దిల్కుషా అతిథిగృహం వద్ద ఆందోళనకారులను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను నిలువరించే పోరాటంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ నిబద్ధతతో పనిచేయడం లేదని విమర్శించారు. ఈ బిల్లులను పార్లమెంట్లో ఏకపక్షంగా ఆమోదించుకోవడం ద్వారా ప్రధాని మోదీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. మోదీ, కేసీఆర్‌లు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని వ్యా ఖ్యానించారు. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగానే ఈ బిల్లులున్నాయని, వీటిని ఆమోదించడం వెనుక అనేక కుట్రలున్నాయన్నారు. అందుకే ప్రధాని మోదీ పార్లమెంటు బయట మాట్లాడిన అంశాలు ఈ బిల్లుల్లో లేవని ఉత్తమ్ ఆరోపించారు. కేంద్రం చేసే ప్రతి ఆలోచనకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని, బీజేపీ–టీఆర్ఎస్లు ములాఖత్ అయి ఇప్పటివరకు అన్ని బిల్లులను ఆమోదించుకున్నారని చెప్పారు. ఈ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నట్టు టీఆర్ఎస్ చెప్పినా వారిలో నిబద్ధత కనిపించడం లేదన్నారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని, దేశ చరిత్రలోనే రైతులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. అక్టోబర్ 2న రైతు సమస్యలపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని చెప్పారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకుని రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని, అప్పటి వరకు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ తన కొనసాగిస్తుందని ఉత్తమ్ చెప్పారు. కరోనా వారికి అడ్డం కాదా? రైతుల పక్షాన వినతిపత్రం ఇచ్చేందుకు గవర్నర్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వకపోవడం దారుణమని ఉత్తమ్ అన్నా రు. కరోనా కారణంగా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని గవర్నర్ కార్యాలయం తెలిపిందని, మరి సీఎంతో భేటీ అయినప్పుడు గవర్నర్‌కు కరోనా అడ్డం రాలేదా అని ప్రశ్నించారు. ఇదే విషయమై పార్టీ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ తమకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తాము వినతిపత్రం ఇచ్చేందుకు వస్తామని మూడు రోజుల క్రితమే గవర్నర్‌కు సమాచారం ఇచ్చామని, కానీ కోవిడ్ నిబంధనల పేరిట అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చలో రాజ్‌భవన్ కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో జరిగిందని, అన్ని చోట్లా గవర్నర్లు అనుమతించినప్పుడు తెలంగాణలో ఎందుకు అనుమతించలేదని ఆయన ప్రశ్నించారు. -
‘చలో రాజ్‌భవన్’ భగ్నం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ఆర్థిక చర్యలకు నిరసనగా రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనల్లో భాగంగా శుక్రవారం టీపీసీసీ జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడితో పాటు హైదరాబాద్‌లో నగర కమిటీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గాంధీభవన్ నుంచి వెలుపలికి రాకుండా నిలువరించే ప్రయత్నంలో పోలీసులు, పార్టీ నేతలు, శ్రేణుల మధ్య వాగ్వాదంతో పాటు తోపు లాట చోటుచేసుకుంది. గాంధీభవన్ నుంచి జీపు లో రాష్ట్ర పార్టీ ఇన్చార్జి ఆర్సీ కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ నేతలు బోసురాజు, కె.జానారెడ్డి, ఎం.కోదండరెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్ చౌరస్తా వరకు వెళ్లాక వారిని అరెస్ట్ చేసి బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా ర్యాలీ నాంపల్లికి చేరుకున్న సమయంలో పోలీసుల తోపులాటలో చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్చార్జి కె.వెంకటేశ్ కిందపడ్డారు. ర్యాలీ వెనక వస్తున్న పోలీసు వాహనం ఢీకొనడంతో ఆయన ఎడమ కాలు ఫ్రాక్చరైంది. ప్రాజెక్టుల్లో అవినీతిపై విచారణ చేపట్టాలి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వైఫల్యాలపై పార్టీ నేతలు కుంతియా, భట్టి విక్రమార్క, బోసురాజు, మర్రి శశిధర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్, ఎం.కోదండరెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, వెంకటస్వామి, అనిల్‌కుమార్‌యాదవ్ తదితరులు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణా?: కుంతియా అనంతరం కుంతియా మీడియాతో మాట్లాడుతూ.. మళ్ళీ బంగారం అమ్ముకుని దేశాన్ని పాలిం చే పరిస్థితిని బీజేపీ తీసుకొచ్చిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను బీజేపీ అమలు చేయలేదని, నోట్ల రద్దుతో దేశాన్ని ఆర్థికంగా వెనక్కునెట్టారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఆర్టీసీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. దేశంలో ఎయిరిండియా, బీఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఎంతవరకు సబబని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు, చర్యలతో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. లక్షల కోట్లు అప్పులు చేశారని, తప్పు డు లెక్కలు చెబుతున్నారన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయొద్దని గవర్నర్‌ను కలసి కోరామన్నారు. -
నేడు టీపీసీసీ చలో రాజ్‌భవన్
హైదరాబాద్: రాష్ర్టంలోని ప్రస్తుత పరిస్థితులు, సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు శనివారం వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్యనాయకులు గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్ వరకు పాదయాత్రను నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు గాంధీభవన్‌లో కార్యక్రమాన్ని ప్రారంభించి, అసెంబ్లీ ఎదుట ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నాయకులు నివాళులర్పిస్తారు. తర్వాత లక్డీకాపూల్ మీదుగా ఖైరతాబాద్‌కు, అక్కడి నుంచి రాజ్‌భవన్ వరకు పాదయాత్ర ఉంటుంది. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పార్టీ ముఖ్య నేతలు కె.జానారెడ్డి, డి.శ్రీనివాస్, జె.గీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, మహ్మద్ షబ్బీర్ అలీ, తదితర నేతలు పాల్గొంటారు. కాగా.. టీపీసీసీ చలో రాజ్ భవన్ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు నగర అదనపు కమిషనర్ (శాంతి, భద్రతలు) అంజనీకుమార్ స్పష్టంచేశారు. 9 నుంచి దళిత చైతన్యయాత్ర దళితులను అణగదొక్కేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ ఎస్సీ విభాగం ఆరోపించింది. తెలంగాణ ఏర్పడ్డాక దళితులకు రక్షణ ఉండదన్న భయాన్ని కలిగిస్తున్నారని, సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా ఈ నెల 9-13 తేదీల్లో దళితచైతన్య యాత్ర పేరిట రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించింది. 9న హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ యాత్ర, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో సాగనుంది. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన భేటీలో ఎస్సీ విభాగం చైర్మన్ ఎ.కృష్ణ, నాయకులు మల్లురవి, అద్దంకి దయాకర్, కె.మానవతారాయ్, గజ్జెలకాంతం తదితరులు పాల్గొన్నారు.