‘చలో రాజ్‌భవన్‌’ భగ్నం | TPCC Fires Over State Government And central Government | Sakshi
Sakshi News home page

‘చలో రాజ్‌భవన్‌’ భగ్నం

Published Sat, Nov 9 2019 3:07 AM | Last Updated on Sat, Nov 9 2019 4:28 AM

TPCC Fires Over State Government And central Government - Sakshi

‘చలో రాజ్‌భవన్‌’ ర్యాలీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి జానారెడ్డి.  చిత్రంలో కుంతియా, భట్టి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ఆర్థిక చర్యలకు నిరసనగా రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ నేతలను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన నిరసనల్లో భాగంగా శుక్రవారం టీపీసీసీ జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడితో పాటు హైదరాబాద్‌లో నగర కమిటీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గాంధీభవన్‌ నుంచి వెలుపలికి రాకుండా నిలువరించే ప్రయత్నంలో పోలీసులు, పార్టీ నేతలు, శ్రేణుల మధ్య వాగ్వాదంతో పాటు తోపు లాట చోటుచేసుకుంది.

గాంధీభవన్‌ నుంచి జీపు లో రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ నేతలు బోసురాజు, కె.జానారెడ్డి, ఎం.కోదండరెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్‌ చౌరస్తా వరకు వెళ్లాక వారిని అరెస్ట్‌ చేసి బేగంబజార్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా ర్యాలీ నాంపల్లికి చేరుకున్న సమయంలో పోలీసుల తోపులాటలో చార్మినార్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఇన్‌చార్జి కె.వెంకటేశ్‌ కిందపడ్డారు. ర్యాలీ వెనక వస్తున్న పోలీసు వాహనం ఢీకొనడంతో ఆయన ఎడమ కాలు ఫ్రాక్చరైంది.

ప్రాజెక్టుల్లో అవినీతిపై విచారణ చేపట్టాలి.. 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వైఫల్యాలపై పార్టీ నేతలు కుంతియా, భట్టి విక్రమార్క, బోసురాజు, మర్రి శశిధర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్, ఎం.కోదండరెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్, వెంకటస్వామి, అనిల్‌కుమార్‌యాదవ్‌ తదితరులు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు.

ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణా?: కుంతియా 
అనంతరం కుంతియా మీడియాతో మాట్లాడుతూ.. మళ్ళీ బంగారం అమ్ముకుని దేశాన్ని పాలిం చే పరిస్థితిని బీజేపీ తీసుకొచ్చిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను బీజేపీ అమలు చేయలేదని, నోట్ల రద్దుతో దేశాన్ని ఆర్థికంగా వెనక్కునెట్టారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఆర్టీసీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. దేశంలో ఎయిరిండియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఎంతవరకు సబబని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలు, చర్యలతో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. లక్షల కోట్లు అప్పులు చేశారని, తప్పు డు లెక్కలు చెబుతున్నారన్నారు. ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేయొద్దని గవర్నర్‌ను కలసి కోరామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement