kunthiya
-
‘చలో రాజ్‌భవన్’ భగ్నం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ఆర్థిక చర్యలకు నిరసనగా రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనల్లో భాగంగా శుక్రవారం టీపీసీసీ జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడితో పాటు హైదరాబాద్‌లో నగర కమిటీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గాంధీభవన్ నుంచి వెలుపలికి రాకుండా నిలువరించే ప్రయత్నంలో పోలీసులు, పార్టీ నేతలు, శ్రేణుల మధ్య వాగ్వాదంతో పాటు తోపు లాట చోటుచేసుకుంది. గాంధీభవన్ నుంచి జీపు లో రాష్ట్ర పార్టీ ఇన్చార్జి ఆర్సీ కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ నేతలు బోసురాజు, కె.జానారెడ్డి, ఎం.కోదండరెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్ చౌరస్తా వరకు వెళ్లాక వారిని అరెస్ట్ చేసి బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా ర్యాలీ నాంపల్లికి చేరుకున్న సమయంలో పోలీసుల తోపులాటలో చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్చార్జి కె.వెంకటేశ్ కిందపడ్డారు. ర్యాలీ వెనక వస్తున్న పోలీసు వాహనం ఢీకొనడంతో ఆయన ఎడమ కాలు ఫ్రాక్చరైంది. ప్రాజెక్టుల్లో అవినీతిపై విచారణ చేపట్టాలి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వైఫల్యాలపై పార్టీ నేతలు కుంతియా, భట్టి విక్రమార్క, బోసురాజు, మర్రి శశిధర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్, ఎం.కోదండరెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, వెంకటస్వామి, అనిల్‌కుమార్‌యాదవ్ తదితరులు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణా?: కుంతియా అనంతరం కుంతియా మీడియాతో మాట్లాడుతూ.. మళ్ళీ బంగారం అమ్ముకుని దేశాన్ని పాలిం చే పరిస్థితిని బీజేపీ తీసుకొచ్చిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను బీజేపీ అమలు చేయలేదని, నోట్ల రద్దుతో దేశాన్ని ఆర్థికంగా వెనక్కునెట్టారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఆర్టీసీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. దేశంలో ఎయిరిండియా, బీఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఎంతవరకు సబబని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు, చర్యలతో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. లక్షల కోట్లు అప్పులు చేశారని, తప్పు డు లెక్కలు చెబుతున్నారన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయొద్దని గవర్నర్‌ను కలసి కోరామన్నారు. -
బీసీలు, ముస్లింలకు సగం టికెట్లు
సాక్షి, సంగారెడ్డి: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లు కాకుండా బీసీలు, ముస్లింలకు ప్రత్యేకంగా 50 శాతం సీట్లు కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో బీసీ సంఘాలతో కాంగ్రెస్ ఏకీభవిస్తోందని, ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగిన టీపీసీసీ పురపాలక ఎన్నికల రాష్ట్రస్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. ఈ భేటీ అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై టీఆర్ఎస్ విధానాన్ని తప్పుపడుతూ ఈ నెల 23న అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉండాలని, ఈ నెల 26న అన్ని మున్సిపాలిటీల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో అన్ని మున్సిపాలిటీలలో స్థానిక నేతల ఆధ్వర్యంలో ‘ఇంటింటికీ కాంగ్రెస్–వాడవాడనా జెండా‘నినాదంతో పార్టీ శ్రేణులు ముందుకు కదలాలన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటుందని ఉత్తమ్ పునరుద్ఘాటించారు. కౌన్సిలర్ లేదా కార్పొరేటర్‌గా గెలిచాక చైర్మన్, వైస్‌చైర్మన్, కో–ఆప్టెడ్ సభ్యులకు ఓటు వేసే విషయంలో పార్టీ విప్ ధిక్కరించనని, గెలిచాక పార్టీ వీడనని అభ్యర్థులు అఫిడవిట్లో స్పష్టం చేయాలన్నారు. ప్రస్తుతం ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టిన తనకు పార్లమెంటు భవనం కంటే తెలంగాణ అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలే బాగున్నట్లు అనిపించిందన్నారు. వీఆర్వో వ్యవస్థలో లోపాలను ప్రభుత్వం మెరుగుపరచాలే కానీ రద్దు చేయాలనుకోవడం తగదన్నారు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే... అంతకుముందు జరిగిన సన్నాహక సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో గట్టి పోటీ ఇచ్చి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు గెలవగానే అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు పగటి కలలు కంటున్నారని, అది ఎన్నటికీ నెరవేరదని ఎద్దేవా చేశారు. కొత్త మున్సిపల్ చట్టం లో ప్రత్యక్ష పద్ధతిలో చైర్మన్‌ను ఎన్నుకుంటే బాగుండేదన్నారు. కౌన్సిలర్లు, చైర్మన్లను తొలగించే అధికారం కలెక్టర్లకు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు: కుంతియా మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుస్తామని ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి. కుంతియా ధీమా వ్యక్తం చేశారు. గెలిచే వారిని గుర్తించి టికెట్లు కేటాయించాలని ఆయన సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి తక్కువ సీట్లు వచ్చినా ఓట్ల శాతం మాత్రం పెరిగిందన్నారు. ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తూ కొత్త మున్సిపల్ చట్టంలో కలెక్టర్లకు సంపూర్ణ అధికారాలు కట్టబెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపçహాస్యం చేయడమేనని సీఎల్పీనేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టడం విచారకరమన్నారు. శాసనసభలో మందిబలం ఉందని సీఎం కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు చట్టాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల సీట్ల కేటాయింపులో ముస్లింలు, యువతకు ప్రాధాన్యమివ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ సూచించారు. పట్టణాల్లో వ్యతిరేకత ఉంది... మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా ఎదుర్కోవాలని టీపీసీసీ రాష్ట్ర స్థాయి సమావేశంలో నేతలు నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, దాన్ని సొమ్ము చేసుకోవడానికి మున్సిపల్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకెళ్లేలా కసరత్తు చేయాలని తీర్మానించారు. ఒకరిద్దరు జిల్లా అధ్యక్షులు పార్టీ నేతల వైఖరి మార్చుకోవాలని సూచించినట్టు తెలిసింది. ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, పోడెం వీరయ్య, ఇతర ముఖ్య నేతలు హాజరు కానప్పటికీ వారంతా వ్యక్తిగత పనుల వల్లే రాలేదని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. సమావేశంలో పార్టీ నేతలు సంపత్‌కుమార్, వంశీధర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పద్మావతి, పొన్నం ప్రభాకర్, మల్లు రవి, గీతారెడ్డి, నాగం తదితరులు పాల్గొన్నారు. -
అసలెందుకు ఓడిపోయాం..?
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా సమీక్షించుకుంది. ఘోర పరాజయానికి గల కారణాలను నియోజకవర్గాల వర్గాల వారీగా విశ్లేషించుకుంది. ఏఐసీసీ నేతలు ఆర్సీ కుంతియా, శ్రీనివాస్ కృష్ణన్, టీపీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డిలు శుక్రవారం హైదరాబాద్‌లో జిల్లాకు చెందిన అభ్యర్థులతో సమావేశమయ్యారు. పార్టీ జిల్లా ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓటమికి గల కారణాలను ఏఐసీసీ నేతలు ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను, జిల్లా పార్టీ ముఖ్యనేతలను అడిగి తెలుసుకున్నారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని చేసిన అభ్యర్థిత్వాల ఎంపిక ఎందుకు గెలుపు తీరాలకు చేర్చలేదు.? కనీసం అభ్యర్థుల సంబంధిత సామాజికవర్గాల ఓట్‌లైనాయి ఎందుకు రాలేదు.? ఎవరైనా నేతలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారా.? వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో తొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్క ఎల్లారెడ్డి మినహా మిగిలిన ఎనిమిది చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలైన విషయం విధితమే. అభ్యర్థిత్వాల ప్రకటన ఆలస్యం కావడం, టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వంటి అంశాలే తమ ఓటమికి కారణమైనట్లు జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ఏఐసీసీ ముఖ్యనేతల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అతితక్కువ ఓట్లతో ఓటమి పాలైన చోట్ల వీవీపీఏటీ స్లిప్పులను లెక్కించేలా న్యాయస్థానాలను ఆశ్రయించాలనే అంశం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్, ఆ పార్టీ అభ్యర్థులు తాహెర్‌బిన్ హందాన్, డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, ఈరవత్రి అనీల్, సౌదాగర్ గంగారాం, కాసుల బాల్‌రాజ్, డీసీసీ అధ్యక్షులు కేశవేణు, బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్, గడుగు గంగాధర్, ప్రేమలత అగర్వాల్‌లు హాజరయ్యారు. స్థానికంగా లేకపోవడంతో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఈ సమావేశానికి రాలేకపోయారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. -
16వ తేదీన తుది జాబితా: కుంతియా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభకు పోటీచేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 16న ప్రకటిస్తామని రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ ఆర్సీ కుంతియా వెల్లడించారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే విడుదల చేసిన రెండు జాబితాల ద్వారా కాంగ్రెస్ పోటీ చేసే 94 స్థానాల్లో 75 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని, ఇప్పటివరకూ ప్రకటించిన జాబితాల ద్వారా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశామని పేర్కొన్నారు. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే స్థానాల్లో బీసీలకు ఇప్పటికే 15 స్థానాలు ఇచ్చామని, తుది జాబితాలో ఇంకా 6 నుంచి 7 మంది బీసీలకు స్థానం కల్పిస్తామని కుంతియా తెలిపారు. -
సీట్ల సర్దుబాటుపై ఎలాంటి సమస్య లేదు
-
9 తర్వాత అభ్యర్థుల ప్రకటన : కుంతియా
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమిగా ఎన్నికల్లో కలిసి వెళతామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ కుంతియా అన్నారు. ఈ నెల 9 తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. ఎవరు ఆందోళన పడొద్దని, సీట్ల సర్దుబాటుపై ఎలాంటి సమస్య లేదన్నారు. గాంధీభవన్‌లో ఇండియన్ ముస్లిం లీగ్ నేతలతో కుంతియా సోమవారం భేటీ అయ్యారు. జనసమితి, సీపీఐలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సీపీఐ డెడ్‌లైన్ తమ దృష్టికి రాలేదని, ఆ పార్టీ నేతలతో మాట్లాడుతున్నామని చెప్పారు. ఇండియన్ ముస్లిం లీగ్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎంలు బీజేపీతో కుమ్మాక్కయ్యాయని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ బీజేపీతో కలిసిపోతుందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్ చేరబోతోందన్నారు. రిజర్వేషన్ల పేరుతో కేసీఆర్ ముస్లింలను మోసం చేశారని ఇండియన్ ముస్లిం లీగ్ నేత అబ్దుల్ ఘనీ అన్నారు. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని, నాలుగు నెలల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని దగా చేశారన్నారు. బడ్జెట్లో ముస్లింలకు కేటాయించిన నిధులనే ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు. లవ్ జిహాద్, గోరక్షక్లపేరుతో ప్రధాని మోదీ ముస్లింలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలపై జరుగుతున్న దాడులపై మోదీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. -
టీఆర్ఎస్ కుప్పకూలిపోతుంది
సాక్షి, కామారెడ్డి: ‘‘దగుల్బాజీ, బట్టేబాజీ మాటలను తెలంగాణ ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదు. నాలుగున్నరేళ్లలో ఎంతో నష్టపోయారు. అప్రజాస్వామిక పాలనతో ప్రజలు విసిగిపోయారు. ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం దిగిపోకతప్పదు. ప్రభుత్వంతోపాటే టీఆర్ఎస్ పార్టీ కూడా కుప్పకూలిపోతుంది’’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 20న జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆయన కామారెడ్డికి వచ్చారు. అనంతరం శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ అధ్యక్షతన ఓ హోటల్లో పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కేసీఆ ర్ చెప్పేదొకటి, చేసేదొకటని విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా భరిస్తూ వచ్చిన ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సిద్ధమయ్యారన్నారు. టీఆర్ఎస్కు చెందిన ఎంతో మంది నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబంలోని నలుగురు, తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే ఎన్నికల్లో ప్రజలదే విజయమన్నారు. ప్రజలంటే ఈ ప్రభుత్వానికి గౌరవం లేకుండాపోయిందని, ప్రజాస్వామ్య హక్కులను కాలరా స్తూ అణచివేతకు పాల్పడిన ప్రభుత్వా న్ని గద్దెదింపడానికి ప్రజలంతా సిద్దం గా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులం తా ప్రజలతో కలిసి నడవాలని సూచించారు. ప్రజలు విసుగెత్తిపోయారు.. ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు... ఇలా అన్ని వర్గాల వారు ప్రభుత్వం అవలంబించిన ప్రజా వ్యతి రేక విధానాలతో విసుగెత్తిపోయారని ఉత్తమ్ పేర్కొన్నారు. దళితుడిని సీఎం చేస్తానని, దళితులు, గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని, మైనారిటీలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. వాటిని నెరవేర్చకుండా మోసం చేశాడన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని, డిసెంబర్ 12న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టగానే లక్ష ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేస్తుందని, పింఛన్లను రూ.2 వేలకు పెంచుతుందని తెలిపారు. తెల్ల కార్డుదారులందరికీ 7 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని అందిస్తామని, అలాగే నిత్యావసరాలను కూడా రేషన్ దుకాణాల ద్వారా ఇస్తామని, ఏడాదికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీన కామారెడ్డిలో నిర్వహించే రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయా లని ప్రజలను కోరారు. సైనికుల్లా పనిచేయాలి.. కేసీఆర్‌ను గద్దెదింపడానికి కాంగ్రెస్ కార్యకర్తలంతా సైనికులుగా తయారుకావాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్సీ కుంతియా పిలుపునిచ్చారు. రాహుల్ సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. సమావేశంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీఎల్పీ మాజీ నాయకుడు జానారెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ, ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కీ, శ్రీనివాస కృష్ణన్, సలీం అహ్మద్, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, నాయకులు సురేశ్‌షెట్కార్, తాహెర్‌బిన్ హందాన్, అరుణతార, జమునారాథోడ్, మృత్యుంజయం, బాల్‌రాజు, సుభాష్‌రెడ్డి, సురేందర్, ఎడ్ల రాజిరెడ్డి, వెంకట్రాంరెడ్డి, రత్నాకర్, గంగాధర్, ఎంజీ వేణు, కైలాస్ శ్రీను, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, నిమ్మ మోహన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీను పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ను చిత్తుగా ఓడిద్దాం
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో నయా నిజాం నియంతలా ప్రవర్తిస్తున్న కేసీఆర్ పీడ విరగడైంది. ఆయన బట్టేబాజ్ మాటలు మాట్లాడుతున్నారు. గాంధీ కుటుంబం, రాహుల్‌గాంధీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం, ముఖ్యుల అత్యవసర సమావేశం శుక్రవారం గాంధీభవన్‌లో ఉత్తమ్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, మాజీ మంత్రి జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు మధు యాష్కీగౌడ్, వంశీచందర్‌రెడ్డి, సంపత్ కుమార్, పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, ఎంపీ నంది ఎల్లయ్య, సీనియర్ కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, రేణుకా చౌదరి, గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లతో పాటు దాదాపు వంద మంది ముఖ్య నేతలు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. అనంతరం కుంతియా, భట్టిలతో కలిసి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఆయన తన స్థాయి మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని.. గాంధీ కుటుంబాన్ని, రాహుల్ గాంధీని వ్యక్తిగతంగా విమర్శించడం ఆయన నీచమైన ప్రవర్తనకు నిదర్శనమని దుయ్యబట్టారు. బట్టేబాజ్ మాటలు మాట్లాడుతూ తెలంగాణ పరువు తీస్తున్నారని, ఒక పాస్‌పోర్ట్ బ్రోకర్‌గా, దొంగగా జీవితాన్ని ప్రారంభించిన కేసీఆర్‌కు గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా రాక్షస పాలన సాగిందని, ఈ అవినీతి పాలనను అంతమొందించేందుకు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు కలిసి రావాలని కోరారు. ఇందుకు తెలుగుదేశం పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నామని.. రాజకీయ, రాజకీయేతర శక్తులంతా కలసి వచ్చి టీఆర్ఎస్ను ఓడించే పవిత్ర కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, ధర్మ యుద్ధానికి అంతా కలసి రావాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఓటర్ జాబితాలో అక్రమాలు రాష్ట్రంలో ఓటర్ జాబితాలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఉత్తమ్ ఆరోపించారు. 2014తో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరగాల్సింది పోయి దాదాపు 21 లక్షల ఓట్లు తగ్గాయని, అలాగే 8 లక్షల ఓట్లు జత అయ్యాయని, అయినా ఓట్ల సంఖ్య తగ్గడం ఏంటని ప్రశ్నించారు. దీన్నిబట్టి రాష్ట్రంలో ఓటర్ల నమోదు, తొలగింపుల్లో చాలా అక్రమాలు జరుగుతున్నాయనే అనుమనాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ నెల 11 నుంచి 18 వరకు కాంగ్రెస్ జెండా పండుగ చేసుకోవాలని, ప్రతికార్యకర్త ఇంటిపైన కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారని, ఇందుకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 10న దేశ వ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహిస్తున్నామని, ఈ బంద్‌లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు. ఈ నెల 12వ తేదీన రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ హైదరాబాద్‌కు వస్తున్నారని, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో జరిగిన అక్రమాలపై విలేకరుల సమావేశంలో మాట్లాడిన అనంతరం సాయంత్రం సంగారెడ్డిలో జరిగే మైనారిటీ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారని ఉత్తమ్ వివరించారు. తెలంగాణ అంతా కాంగ్రెస్ వైపే చూస్తోంది కె. చంద్రశేఖర్‌రావు రూపంలో ఉన్న రాక్షసుని పాలనపై తెలంగాణ ప్రజలు విసుగు చెందారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్.సి కుంతియా ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో దేవరకద్రకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు డి.కె.సమరసింహారెడ్డి, హైకోర్టు న్యాయవాది జీఎంఆర్ (జి.మధుసూదన్ రెడ్డి) తోపాటు సీసీ కుంట జెడ్పీటీసీ క్రాంతి, ఆంజనేయులు, జెడ్పీటీసీ లక్ష్మీ ప్రభాకర్, ఖానాపూర్ నియోజకవర్గం టీఆర్ఎస్ నేత చారులతా రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తంరావు కొడుకు హరీశ్‌రావు, మల్కాజ్గిరి టీఆర్ఎస్ నేత సింగీతం సత్యం తదితరులు వేలాది మంది అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఉత్తమ్, కుంతియా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రజలు, నాయకులు పెద్దఎత్తున తరలి వస్తున్నారని, వచ్చే వారికి పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి డి.కె.అరుణ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
మేమూ ‘ముందుకే’!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు నవంబర్, డిసెంబర్లోనే ఉండొచ్చన్న సంకేతాల నేపథ్యంలో టీఆర్ఎస్ను ఢీ కొట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోడానికి, అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. హైకమాండ్ సూచనల మేరకు పార్టీని, అభ్యర్థులను అన్ని విధాలా సన్నద్ధం చేసే దిశగా సన్నాహకాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా శనివారం గాంధీభవన్‌లో అన్ని నియోజకవర్గాల ఇన్చార్జీలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీమెంటరీ ఇన్‌చార్జీలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ భేటీకి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియాతో పాటు కొత్తగా నియమితులైన ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీ సహా ముఖ్య నేతలంతా హాజరు కానున్నారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలు తదితరాలపై చర్చించనున్నారు. ఉత్తమ్ 100 రోజుల ప్రణాళిక దేశవ్యాప్తంగా వేగంగా మారుతున్న రాజకీయాలు, ముందస్తు ఎన్నికలు ఖాయమన్న సంకేతాలు కాంగ్రెస్ పార్టీని అలర్ట్ చేశాయి. తాజాగా ముందస్తుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరిన సవాల్‌కు ఆ పార్టీ అంతే దీటుగా సమాధానం ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం అని ప్రకటించిన ఉత్తమ్.. ఇందుకు 100 రోజుల కార్యాచరణ సిద్ధం చేశారు. ఆ వివరాలను కింది స్థాయి వరకు తీసుకెళ్లడం లక్ష్యంగా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేదికగానే ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ బాధ్యతలను ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులకు అప్పగించిన దృష్ట్యా వారికి ఆయా నియోజక వర్గ నేతలను పరిచయం చేయనున్నారు. వచ్చే నెల నుంచే కార్యదర్శులు 25 నుంచి 90 రోజుల పాటు క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేయనుండటంతో వారికి అందించాల్సిన సమాచారంపై నేతలను సన్నద్ధం చేయనున్నారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శక్తి యాప్‌లో రిజిస్ట్రేషన్‌పై ఇందులో అవగాహన కల్పించనున్నారు. కుంతియాకు వీహెచ్ ఫిర్యాదు పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండదని హైకమాండ్ స్పష్టం చేసినా పార్టీ నేతలు కొందరు రహస్య మంతనాలు చేస్తుండటంపై పార్టీ వ్యవహారల ఇంఛార్జి కుంతియాకు ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఫిర్యాదు చేశారు. అలాంటి కుట్రదారులపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించరాదన్నారు. -
కాంగ్రెస్ నేతల ‘ఐక్య’ రాగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు ఐక్య రాగం ఆలపిస్తున్నారు. తమ మధ్య దూరం తగ్గించుకుని ఒక్కతాటిపైకి రావాలని, వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొని అధికారంలోకి రావడమే లక్ష్యంగా కలసికట్టుగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. గురువారం గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర ఇన్చార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి నేతృత్వంలో కీలక నేతల భేటీ జరిగింది. సీనియర్ నేతలు జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, మల్లు రవి, డీకే అరుణ, అంజన్‌కుమార్ యాదవ్, ఆకుల లలిత, సునీతా లక్ష్మారెడ్డి, వి.హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కమిటీయా, కొత్త కమిటీలా? పార్టీ కమిటీలపై భేటీలో లోతుగా చర్చ జరిగింది. ఈ నెలాఖరుకల్లా అన్ని పోలింగ్ బూత్ స్థాయి కమిటీలు వేయాలని నిర్ణయించారు. జూలై 15 కల్లా శక్తి యాప్ ద్వారా కార్యకర్తలంతా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా కార్యాచరణ చేపట్టాలని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు ప్రణాళిక, అనుసరించాల్సిన వ్యూహం,.తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కొత్త జిల్లాలకూ డీసీసీలు వేయాలా, లేకా ఉమ్మడి జిల్లాల కమిటీలనే కొనసాగించాలా అన్నదానిపై చర్చించినట్టు తెలిసింది. కొత్త జిల్లాల కమిటీ ఇప్పుడే వేస్తే సమస్యలొస్తాయని, ఉమ్మడి జిల్లాల కమిటీలనే కొనసాగిస్తూ కొత్త జిల్లాల్లోని కీలక నేతలను ఉమ్మడి జిల్లా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్లు చేసేలా కార్యచరణ ఉండాలని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు. ఇందుకు ఏఐసీసీ ఆమోదం తీసుకోవాలన్న భావన వ్యక్తమైంది. కాళేశ్వరంతో పాటు సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ క్షేత్రస్థాయిలో పర్యటించి నిజానిజాలు, అంచనాలు తదితరాలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని, అదిచ్చే నివేదికలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. విభజన హామీల అమలు కోసం క్షేత్ర స్థాయి పోరాటం చేయాలని, టీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా నిర్ణయించారు. అంతర్గతంగా చర్చించుకుందాం... పార్టీని ఐక్యంగా నడిపించేందుకు లోపాలు, సమస్యలను అంతర్గతంగా పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలని టీపీసీసీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా నియోజకవర్గాల్లో ఉన్న గ్రూపు సమస్యలను పరిష్కరించకుండా ఐక్యంగా ఎలా వెళ్తామని మాజీ మంత్రి సునితాలక్షా్మరెడ్డి ప్రశ్నించడంతో ఉత్తమ్ కల్పించుకొని వాటిపై త్వరలోనే దృష్టి సారిస్తున్నట్టు చెప్పడంతో మిగతా నేతలు సైతం వెనక్కి తగ్గినట్టు తెలిసింది. ఈ నెల 23న హైదరాబాద్‌లో పోటీ చేసి ఓడిన నేతలు, గెలిచిన నేతలందరితో టీపీసీసీ సమావేశం ఏర్పాటుచేయబోతుందని, ఇలాంటి సమావేశాలు అన్ని జిల్లాల పరిధిలో ఏర్పాటుచేసి గ్రూపు సమస్యలను తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పినట్టు తెలిసింది. ఇలాగైతే ఏమిటి భవిష్యత్తు? చేరికలపై డీకే అరుణ ఫైర్ పీసీసీ రాష్ట్ర నేతల తీరుపై ముఖ్యుల సమావేశంలో మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘’నాగం జనార్దన్‌రెడ్డిని, రేవంత్‌రెడ్డిని పార్టీలోకి ఎలా చేర్చుకున్నారు? మీకిష్టమైన వాళ్లను ఢిల్లీ తీసుకెళ్లి కండువా కప్పిస్తారు! మేం చేర్పిస్తామన్న శివకుమార్‌రెడ్డి, ఎర్ర శేఖర్ వంటివాళ్లను ఎందుకు చేర్చుకోరు?’’అంటూ ఫైర్ అయినట్టు తెలిసింది. ‘‘కనీసం జిల్లా నేతలతో చర్చించకుండా గందరగోళం చేసి చేర్పించుకుంటున్నారు. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్ పరిస్థితి ఏమిటి?’’అని నిలదీశారని సమాచారం. జానారెడ్డి కల్పించుకొని ఇలాంటి విషయాలపై అంతర్గతంగా చర్చించుకుందామని సముదాయించినా అరుణ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎవరు పడితే వారు వెళ్లి రాహుల్‌గాంధీని కలుస్తున్నారని వీహెచ్ అభ్యంతరం తెలిపారు. ఎవరెవరు ఎప్పుడు వెళ్లాలన్న దానిపై పార్టీ నిర్ణయం తీసుకోవాలన్నారు. -
'కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం'
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా అన్నారు. బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికే పరిమితమైందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రధాని అవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. పనిచేసే వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. మరోపక్క, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణలో నలుగురే లాభపడ్డారని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తున్న వారిని కేసీఆర్ అణిచివేస్తున్నారని ఉత్తమ్ చెప్పారు. దళితులపై థర్డ్ డిగ్రీ.. గిరిజనులకు బేడీలు వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని అన్నారు. నాలుగేళ్ల పాలనలో తెలంగాణను కేసీఆర్ భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. -
పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థకు దెబ్బ
సాక్షి, హైదరాబాద్: నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మద్దతు ఇచ్చారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్ నుంచి పీపుల్స్‌ప్లాజా వరకు కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని దుయ్యబట్టారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దీనివల్ల నల్లధనం మార్చుకోవడం అక్రమార్కులకు సులువైందని ఆయన వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోదీది చీకటి నిర్ణయమని సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి విమర్శించారు. నోట్ల రద్దును సమర్థించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్థిక వ్యవస్థపై దాడి: జానారెడ్డి ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు .. ఆర్థిక వ్యవస్థపై దాడి అని అభివర్ణించారు. ప్రజలు సంయమనం పాటించినా ప్రయోజనాలు రాలేదన్నారు. నియంతృత్వ పాలనకు నోట్ల రద్దు నిర్ణయం పరాకాష్ట అని విమర్శించారు. చిన్న పరిశ్రమలు మూతపడ్డాయని, కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోయారని అన్నారు. కాంగ్రెస్‌ను దూషిస్తూ కేంద్రం అసహనాన్ని ప్రదర్శిస్తోందన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి సంక్షోభంలో ఉందన్నారు. మాజీ ఎంపీ మధు యాష్కీ మాట్లాడుతూ దేశానికి ప్రధాని చేసిన మోసాన్ని ఎండగట్టాలన్నారు. మోదీ తీసుకున్న నిర్ణయం మెదడు లేని నిర్ణయమన్నారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్‌కు, కూతురు కవితకు, అల్లుడు హరీశ్‌రావుకు ఈడీ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమో కాదో చెప్పాలని మధు యాష్కీ డిమాండ్ చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ మోదీ ఓ క్రిమినల్ అని వ్యాఖ్యానించారు. నోట్లరద్దులో సంపన్న వర్గాలకు కొమ్ముకాశారని ఆరోపించారు. -
రేవంత్ రాకను స్వాగతించాల్సిందే
-
రేవంత్ రాకను స్వాగతించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత ఎ.రేవంత్‌రెడ్డి చేరికను పార్టీ నేతలంతా స్వాగతించాల్సిందేనని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా స్పష్టం చేశారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో గోల్కొండ హోటల్లో వేర్వేరుగా సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి చేరికపై వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు వర్తమాన రాజకీయ పరిస్థితులపై పార్టీ నేతల మనోగతాన్ని చెప్పుకోవడానికి ఏఐసీసీ నుంచి అవకాశం కల్పించే ఉద్దేశంతో కుంతియా వారితో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మాజీమంత్రి, గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ తదితరులు కుంతియాతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ నెల 31న ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్‌రెడ్డి చేరిక ఉంటుందని పార్టీ నేతలకు కుంతియా అధికారికంగా వెల్లడించారు. రేవంత్‌కు పార్టీలో ఎలాంటి అవకాశాలు వస్తాయనే అంశం పూర్తిగా రాహుల్ గాంధీ పరిధిలో ఉంటుందని వివరించారు. పెద్దనోట్ల రద్దుపై నవంబర్ 8న నిరసన పాటిస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా తెలంగాణలో నవంబర్ నెలలో రాహుల్ గాంధీ బహిరంగసభ ఉంటుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్‌రెడ్డి చేరిక పార్టీకి అవసరమేనని కుంతియా చెప్పారు. దీనికి రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు అంగీకరించినట్టుగా తెలిసింది. షరతులేమీ లేవు.. పనితీరే ప్రామాణికం: కుంతియా రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా షరతులేమీ ఉండవని, నాయకుల పనితీరును బట్టి పదవులు, ప్రాధాన్యం ఉంటుందని కుంతియా స్పష్టం చేశారు. పార్టీ నేతలతో భేటీ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అందుబాటులో ఉన్న ముఖ్యనేతలను కలుస్తున్నట్టుగా చెప్పారు. రాహుల్ గాంధీ సమక్షంలో 31న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారని చెప్పారు. రేవంత్ రాకను రాష్ట్ర నాయకులెవరూ వ్యతిరేకించడం లేదన్నారు. ఈ అంశంపై మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌నేత డి.కె.అరుణతో ఇప్పటికే చాలాసార్లు మాట్లాడినట్టు ఆయన చెప్పారు. అరుణ కూడా పెద్దగా వ్యతిరేకించడంలేదన్నారు. అన్ని పార్టీలకు చెందిన నేతలు టచ్‌లో ఉన్నారని, త్వరలోనే వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వెల్లడించారు. అధిష్టానం చెప్పినట్టు పనిచేస్తాం: డీకే కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా స్వాగతిస్తామని, అధిష్టానం ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేస్తామని మాజీమంత్రి డి.కె.అరుణ చెప్పారు. పార్టీకోసం పనిచేస్తున్న తమలాంటి వారి పాత్ర ఎలా ఉందో రేవంత్‌రెడ్డి పాత్ర కూడా అలాగే ఉంటుందని అన్నారు. అధికారపార్టీ నుంచి చేరికలు: ఉత్తమ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలుంటాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. అలాగే ఇతర పార్టీల నేతలు మాట్లాడుతున్నారని, అవన్నీ సరైన సమయంలో ఉంటాయని అన్నారు. నవంబర్ రెండో వారంలో రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా మహబూబాబాద్‌లో గిరిజన గర్జన పేరుతో బహిరంగసభ ఉంటుందన్నారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన మాటలను కూడా అమలుచేయడంలేదని ఉత్తమ్ విమర్శించారు. -
మోదీ, కేసీఆర్‌కు టైం దగ్గర పడింది
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు టైం దగ్గరపడిందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా హెచ్చరించారు. పార్టీ నేతలంతా కలిసి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అని చెప్పారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తానని ప్రధాని నరేంద్రమోదీ మాట తప్పారని అన్నారు. అలాగే, డబుల్ బెడ్ రూంలు ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ప్రజలకు ఇప్పుడిప్పుడే అసలు నిజాలేమిటో తెలుస్తున్నాయని, మత విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని బీజేపీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జెండా ఎగరేయాలి..
కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కండి ఎన్నికల హామీలను విస్మరించిన కేసీఆర్ నిరుద్యోగ యువకులకు మొండి చెయ్యి రంజాన్ కానుకగా ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేయూలి కార్యకర్తల సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా ఖమ్మం: నాడు.. నేడు.. ఏనాడైనా జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోటగానే ఉంటుందని, గడిచిన ఎన్నికల్లో కూడా నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలిచారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, టీపీసీసీ ఇన్చార్జి రామచంద్రకుంతియా అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని శనివారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి కుంతియా హాజరై ప్రసంగించారు. గతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకొని నష్టపోయిందన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని, నిరుద్యోగ సమస్యను తీర్చుతామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా వాటిని అమలు చేయలేదని విమర్శించారు. పవిత్ర రంజాన్ మాసంలోనైనా మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం యువకులు బలిదానమయ్యారని, ఉద్యమంలో ముందు ఉన్నారని అన్నారు. కాగా కేసీఆర్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీలో నిలిచి గెలిచేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ డివిజన్ కమిటీలతోపాటు, పార్టీ అనుబంధ కమిటీలు వేయాలని, ప్రతి గడపకు పదిసార్లు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను గుర్తు చేయాలన్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు పడుతున్న ఇబ్బందులు వివరించాలన్నారు. టీఆర్ఎస్ కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వ అధికారులు పాల్గొనడం శోచనీయమన్నారు. అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, ప్రజల పక్షాన ఉండాలని పిలుపు నిచ్చారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయం వైపు నడిపించేందుకు అందరూ సహకరించాలన్నారు. ఇప్పటి వరకు అన్ని డివిజన్లలో కమిటీలను వేశామని, ఇదే స్ఫూర్తితో బూత్ లెవల్ కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సైనికుల్లా పనిచేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం అన్నారు. పదిమంది తుమ్మల నాగేశ్వరరావులు వచ్చినా కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో 8వ షెడ్యూల్ పెట్టాలనడం విడ్డూరంగా ఉందన్నారు. నైతిక విలువలు ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు పదవికి రాజీనామా చేసి 'ఓటుకు నోటు'కేసులో న్యాయ పోరాటం చేయాలని సవాల్ విసిరారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షులు ఐతం సత్యం, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, కొత్తా సీతారాములు, యర్రం బాలగంగాధర్ తిలక్, దీపక్ చౌదరి, నర్సింహా రావు, బాలాజీరావు నాయక్, పద్మ, ఫజల్, విజయ్‌కుమార్, కాలంగి దేవదానం, మగ్బూల్ పాల్గొన్నారు. -
కుంతియా సమక్షంలో టీ కాంగ్రెస్ నేతల భేటీ
హైదరాబాద్: పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ లో హైకమాండ్ పరిశీలకుడు కుంతియా సమక్షంలో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నేతుల చర్చించారు. అదే విధంగా కేసీఆర్ ఫిరాయింపులపై ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధానిని కలిసే అంశంపై టీ కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు వెలువడినట్టు సమాచారం. ఢిల్లీ వెళ్లటం వల్ల ఏం ప్రయోజనం లేదని జానారెడ్డి అన్నారు. ఆదివారం మరోసారి భేటీ అయి చర్చించుకుందామని ఇతర సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు.