కాంగ్రెస్‌ నేతల ‘ఐక్య’ రాగం | Uttam makes birthday vow to defeat TRS in next polls | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేతల ‘ఐక్య’ రాగం

Published Fri, Jun 22 2018 1:48 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Uttam makes birthday vow to defeat TRS in next polls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్లు ఐక్య రాగం ఆలపిస్తున్నారు. తమ మధ్య దూరం తగ్గించుకుని ఒక్కతాటిపైకి రావాలని, వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొని అధికారంలోకి రావడమే లక్ష్యంగా కలసికట్టుగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు.

గురువారం గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి నేతృత్వంలో కీలక నేతల భేటీ జరిగింది. సీనియర్‌ నేతలు జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్‌ అలీ, మల్లు రవి, డీకే అరుణ, అంజన్‌కుమార్‌ యాదవ్, ఆకుల లలిత, సునీతా లక్ష్మారెడ్డి, వి.హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి కమిటీయా, కొత్త కమిటీలా?
పార్టీ కమిటీలపై భేటీలో లోతుగా చర్చ జరిగింది. ఈ నెలాఖరుకల్లా అన్ని పోలింగ్‌ బూత్‌ స్థాయి కమిటీలు వేయాలని నిర్ణయించారు. జూలై 15 కల్లా శక్తి యాప్‌ ద్వారా కార్యకర్తలంతా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా కార్యాచరణ చేపట్టాలని అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు ప్రణాళిక, అనుసరించాల్సిన వ్యూహం,.తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

కొత్త జిల్లాలకూ డీసీసీలు వేయాలా, లేకా ఉమ్మడి జిల్లాల కమిటీలనే కొనసాగించాలా అన్నదానిపై చర్చించినట్టు తెలిసింది. కొత్త జిల్లాల కమిటీ ఇప్పుడే వేస్తే సమస్యలొస్తాయని, ఉమ్మడి జిల్లాల కమిటీలనే కొనసాగిస్తూ కొత్త జిల్లాల్లోని కీలక నేతలను ఉమ్మడి జిల్లా కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు చేసేలా కార్యచరణ ఉండాలని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు.

ఇందుకు ఏఐసీసీ ఆమోదం తీసుకోవాలన్న భావన వ్యక్తమైంది. కాళేశ్వరంతో పాటు సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ క్షేత్రస్థాయిలో పర్యటించి నిజానిజాలు, అంచనాలు తదితరాలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని, అదిచ్చే నివేదికలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. విభజన హామీల అమలు కోసం క్షేత్ర స్థాయి పోరాటం చేయాలని, టీఆర్‌ఎస్, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా నిర్ణయించారు.

అంతర్గతంగా చర్చించుకుందాం...
పార్టీని ఐక్యంగా  నడిపించేందుకు లోపాలు, సమస్యలను అంతర్గతంగా పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలని టీపీసీసీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా నియోజకవర్గాల్లో ఉన్న గ్రూపు సమస్యలను పరిష్కరించకుండా ఐక్యంగా ఎలా వెళ్తామని మాజీ మంత్రి సునితాలక్షా్మరెడ్డి ప్రశ్నించడంతో ఉత్తమ్‌ కల్పించుకొని వాటిపై త్వరలోనే దృష్టి సారిస్తున్నట్టు చెప్పడంతో మిగతా నేతలు సైతం వెనక్కి తగ్గినట్టు తెలిసింది.

ఈ నెల 23న హైదరాబాద్‌లో పోటీ చేసి ఓడిన నేతలు, గెలిచిన నేతలందరితో టీపీసీసీ సమావేశం ఏర్పాటుచేయబోతుందని, ఇలాంటి సమావేశాలు అన్ని జిల్లాల పరిధిలో ఏర్పాటుచేసి గ్రూపు సమస్యలను తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పినట్టు తెలిసింది.


ఇలాగైతే ఏమిటి భవిష్యత్తు? చేరికలపై డీకే అరుణ ఫైర్‌
పీసీసీ రాష్ట్ర నేతల తీరుపై ముఖ్యుల సమావేశంలో మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘’నాగం జనార్దన్‌రెడ్డిని, రేవంత్‌రెడ్డిని పార్టీలోకి ఎలా చేర్చుకున్నారు? మీకిష్టమైన వాళ్లను ఢిల్లీ తీసుకెళ్లి కండువా కప్పిస్తారు! మేం చేర్పిస్తామన్న శివకుమార్‌రెడ్డి, ఎర్ర శేఖర్‌ వంటివాళ్లను ఎందుకు చేర్చుకోరు?’’అంటూ ఫైర్‌ అయినట్టు తెలిసింది. ‘‘కనీసం జిల్లా నేతలతో చర్చించకుండా గందరగోళం చేసి చేర్పించుకుంటున్నారు.

ఇదిలాగే కొనసాగితే భవిష్యత్‌ పరిస్థితి ఏమిటి?’’అని నిలదీశారని సమాచారం. జానారెడ్డి కల్పించుకొని ఇలాంటి విషయాలపై అంతర్గతంగా చర్చించుకుందామని సముదాయించినా అరుణ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎవరు పడితే వారు వెళ్లి రాహుల్‌గాంధీని కలుస్తున్నారని వీహెచ్‌ అభ్యంతరం తెలిపారు. ఎవరెవరు ఎప్పుడు వెళ్లాలన్న దానిపై పార్టీ నిర్ణయం తీసుకోవాలన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement