సమావేశంలో మాట్లాడుతున్న కుంతియా
సాక్షి, కామారెడ్డి: ‘‘దగుల్బాజీ, బట్టేబాజీ మాటలను తెలంగాణ ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదు. నాలుగున్నరేళ్లలో ఎంతో నష్టపోయారు. అప్రజాస్వామిక పాలనతో ప్రజలు విసిగిపోయారు. ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం దిగిపోకతప్పదు. ప్రభుత్వంతోపాటే టీఆర్‌ఎస్ పార్టీ కూడా కుప్పకూలిపోతుంది’’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 20న జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆయన కామారెడ్డికి వచ్చారు. అనంతరం శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ అధ్యక్షతన ఓ హోటల్‌లో పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కేసీఆ ర్ చెప్పేదొకటి, చేసేదొకటని విమర్శించారు.
నాలుగున్నరేళ్లుగా భరిస్తూ వచ్చిన ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సిద్ధమయ్యారన్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన ఎంతో మంది నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబంలోని నలుగురు, తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే ఎన్నికల్లో ప్రజలదే విజయమన్నారు. ప్రజలంటే ఈ ప్రభుత్వానికి గౌరవం లేకుండాపోయిందని, ప్రజాస్వామ్య హక్కులను కాలరా స్తూ అణచివేతకు పాల్పడిన ప్రభుత్వా న్ని గద్దెదింపడానికి ప్రజలంతా సిద్దం గా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులం తా ప్రజలతో కలిసి నడవాలని సూచించారు.
ప్రజలు విసుగెత్తిపోయారు..
ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు... ఇలా అన్ని వర్గాల వారు ప్రభుత్వం అవలంబించిన ప్రజా వ్యతి రేక విధానాలతో విసుగెత్తిపోయారని ఉత్తమ్ పేర్కొన్నారు. దళితుడిని సీఎం చేస్తానని, దళితులు, గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని, మైనారిటీలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని, డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. వాటిని నెరవేర్చకుండా మోసం చేశాడన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని, డిసెంబర్ 12న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారం చేపట్టగానే లక్ష ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేస్తుందని, పింఛన్లను రూ.2 వేలకు పెంచుతుందని తెలిపారు. తెల్ల కార్డుదారులందరికీ 7 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని అందిస్తామని, అలాగే నిత్యావసరాలను కూడా రేషన్ దుకాణాల ద్వారా ఇస్తామని, ఏడాదికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీన కామారెడ్డిలో నిర్వహించే రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయా లని ప్రజలను కోరారు.
సైనికుల్లా పనిచేయాలి..
కేసీఆర్‌ను గద్దెదింపడానికి కాంగ్రెస్ కార్యకర్తలంతా సైనికులుగా తయారుకావాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌సీ కుంతియా పిలుపునిచ్చారు. రాహుల్ సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. సమావేశంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీఎల్పీ మాజీ నాయకుడు జానారెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ, ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కీ, శ్రీనివాస కృష్ణన్, సలీం అహ్మద్, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, నాయకులు సురేశ్‌షెట్కార్, తాహెర్‌బిన్ హందాన్, అరుణతార, జమునారాథోడ్, మృత్యుంజయం, బాల్‌రాజు, సుభాష్‌రెడ్డి, సురేందర్, ఎడ్ల రాజిరెడ్డి, వెంకట్రాంరెడ్డి, రత్నాకర్, గంగాధర్, ఎంజీ వేణు, కైలాస్ శ్రీను, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, నిమ్మ మోహన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీను పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment