పీసీసీ కార్యవర్గ సమావేశంలో కుంతియా, ఉత్తమ్, వీహెచ్, షబ్బీర్ అలీ తదితరులు
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో నయా నిజాం నియంతలా ప్రవర్తిస్తున్న కేసీఆర్ పీడ విరగడైంది. ఆయన బట్టేబాజ్ మాటలు మాట్లాడుతున్నారు. గాంధీ కుటుంబం, రాహుల్‌గాంధీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం, ముఖ్యుల అత్యవసర సమావేశం శుక్రవారం గాంధీభవన్‌లో ఉత్తమ్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, మాజీ మంత్రి జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు మధు యాష్కీగౌడ్, వంశీచందర్‌రెడ్డి, సంపత్ కుమార్, పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, ఎంపీ నంది ఎల్లయ్య, సీనియర్ కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, రేణుకా చౌదరి, గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లతో పాటు దాదాపు వంద మంది ముఖ్య నేతలు పాల్గొని పలు అంశాలపై చర్చించారు.
అనంతరం కుంతియా, భట్టిలతో కలిసి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఆయన తన స్థాయి మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని.. గాంధీ కుటుంబాన్ని, రాహుల్ గాంధీని వ్యక్తిగతంగా విమర్శించడం ఆయన నీచమైన ప్రవర్తనకు నిదర్శనమని దుయ్యబట్టారు. బట్టేబాజ్ మాటలు మాట్లాడుతూ తెలంగాణ పరువు తీస్తున్నారని, ఒక పాస్‌పోర్ట్ బ్రోకర్‌గా, దొంగగా జీవితాన్ని ప్రారంభించిన కేసీఆర్‌కు గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా రాక్షస పాలన సాగిందని, ఈ అవినీతి పాలనను అంతమొందించేందుకు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు కలిసి రావాలని కోరారు. ఇందుకు తెలుగుదేశం పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నామని.. రాజకీయ, రాజకీయేతర శక్తులంతా కలసి వచ్చి టీఆర్‌ఎస్‌ను ఓడించే పవిత్ర కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, ధర్మ యుద్ధానికి అంతా కలసి రావాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.
ఓటర్ జాబితాలో అక్రమాలు
రాష్ట్రంలో ఓటర్ జాబితాలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఉత్తమ్ ఆరోపించారు. 2014తో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరగాల్సింది పోయి దాదాపు 21 లక్షల ఓట్లు తగ్గాయని, అలాగే 8 లక్షల ఓట్లు జత అయ్యాయని, అయినా ఓట్ల సంఖ్య తగ్గడం ఏంటని ప్రశ్నించారు. దీన్నిబట్టి రాష్ట్రంలో ఓటర్ల నమోదు, తొలగింపుల్లో చాలా అక్రమాలు జరుగుతున్నాయనే అనుమనాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ నెల 11 నుంచి 18 వరకు కాంగ్రెస్ జెండా పండుగ చేసుకోవాలని, ప్రతికార్యకర్త ఇంటిపైన కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారని, ఇందుకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 10న దేశ వ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహిస్తున్నామని, ఈ బంద్‌లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు. ఈ నెల 12వ తేదీన రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ హైదరాబాద్‌కు వస్తున్నారని, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో జరిగిన అక్రమాలపై విలేకరుల సమావేశంలో మాట్లాడిన అనంతరం సాయంత్రం సంగారెడ్డిలో జరిగే మైనారిటీ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారని ఉత్తమ్ వివరించారు.
తెలంగాణ అంతా కాంగ్రెస్ వైపే చూస్తోంది
కె. చంద్రశేఖర్‌రావు రూపంలో ఉన్న రాక్షసుని పాలనపై తెలంగాణ ప్రజలు విసుగు చెందారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్.సి కుంతియా ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో దేవరకద్రకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు డి.కె.సమరసింహారెడ్డి, హైకోర్టు న్యాయవాది జీఎంఆర్ (జి.మధుసూదన్ రెడ్డి) తోపాటు సీసీ కుంట జెడ్పీటీసీ క్రాంతి, ఆంజనేయులు, జెడ్పీటీసీ లక్ష్మీ ప్రభాకర్, ఖానాపూర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ నేత చారులతా రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తంరావు కొడుకు హరీశ్‌రావు, మల్కాజ్‌గిరి టీఆర్‌ఎస్ నేత సింగీతం సత్యం తదితరులు వేలాది మంది అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఉత్తమ్, కుంతియా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రజలు, నాయకులు పెద్దఎత్తున తరలి వస్తున్నారని, వచ్చే వారికి పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి డి.కె.అరుణ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment